ఎర్రవల్లి ఇక 'ఆదర్శ గ్రామం' | Sakshi
Sakshi News home page

ఎర్రవల్లి ఇక 'ఆదర్శ గ్రామం'

Published Sun, Aug 30 2015 3:35 AM

ఎర్రవల్లి ఇక 'ఆదర్శ గ్రామం' - Sakshi

  • ప్రభుత్వపరంగా డిక్లేర్ చేయిస్త
  •   గ్రామానికి సంబంధించిన అన్ని పనులకు సర్కార్‌దే బాధ్యత
  •   వ్యవసాయ అభివృద్ధికి 100 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధమే
  •   ఎర్రవల్లి విత్తనోత్పత్తి గ్రామంగా ఆవిర్భవించాలి
  •   'స్వయంపాలిత-సమృద్ధి గ్రామం'గా మారాలె
  •   ఐకమత్యంతోనే అన్నీ సాధ్యం
  •   ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు
  •  గజ్వేల్: 'ఎర్రవల్లిని ప్రభుత్వపరంగా ఆదర్శ గ్రామంగా డిక్లేర్ చేయిస్తా. గ్రామానికి సంబంధించిన అన్ని పనులను ఇక సర్కార్ చూసుకుంటది. వ్యవసాయ రంగం అభివృద్ధికి అవసరమైతే రూ. 100 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధమే. మన ఊరిని విత్తనోత్పత్తి గ్రామంగా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుందాం. మీకో బ్యాంకును పెట్టిస్తా. మొత్తమ్మీద ఊరిని స్వయంపాలిత-సమృద్ధి గ్రామంగా మార్చుకుందాం'అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లి గ్రామంపై వరాల జల్లు కురిపించారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా 10 రోజుల కిందట మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామంలో పర్యటించిన కేసీఆర్...శనివారం సాయంత్రం మరోమారు ఎర్రవల్లిని సందర్శించారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించనున్న స్థలాన్ని, శిథిలమైన ఇళ్ల కూల్చివేత పనులను ఆయన పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, 'గడా' ఓఎస్‌డీ హన్మంతరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే...


     నిన్న మీరంతా నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు పోయి వచ్చారు కదా. ఆ ఊరు ఎట్లుంది. మనం ఎందుకు అట్ల కావొద్దు. ముందుగాల ఇళ్ల నిర్మాణ పనులు, ఊరిని శుభ్రం చేసుకునే పనులు చేసుకుందాం. ఆ తర్వాత వ్యవసాయరంగ అభివృద్ధి పనులు మొదలు పెడదాం. వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామంలోని భూములన్నింటికీ భూసార పరీక్షలు చేస్తరు. దానిని బట్టి పంటలు వేసుకుందాం. వరి పంట బంద్‌జేద్దాం. ఇంకా విత్తనోత్పత్తి పంటలే వేసుకుందాం. నేను సీడు కంపెనీలతో మాట్లాడుతా. మీరు ఉత్పత్తి చేసిన విత్తనాలు వారు తీసుకుపోతరు. మంచి లాభం ఉంటది. ఊల్లె ఒక్క గుంట జాగ కూడా వేస్ట్ కావొద్దు. మంచి భూములు మనయ్. తెలంగాణలో ఏ గ్రామానికీ లేని సౌకర్యం మీకుంది. ముఖ్యమంత్రి అయిన నేను మీ ఊరు వ్యక్తిని. నేనే కాదు ప్రభుత్వ యంత్రాంగమంతా మీ వెంట ఉంటది. పనులెందుకు కావ్? అందరికీ బోర్లు వేయిస్త. డ్రిప్ సిస్టమ్ పెట్టుకుందాం. నీళ్ల నిల్వకు కుండీలు కట్టుకుందాం. ఇంటింటికీ బర్రెలు ఇప్పిస్త. పాడిరంగాన్ని అభివృద్ధి చేసుకుందాం. జరంత భూమి ఉన్నోళ్లకు కూరగాయల పంటలు పండించేలా చేద్దాం. దళితుల భూములను బాగజేపిస్త. వారికి గతంలో పంపిణీ చేసిన భూముల్లో కొంత బాగలేదు. అంత సాఫ్ జేపిస్త. అక్కడ కూడా బంగారు పంటలు పండేట్లు చేసుకుందాం. గ్రామంలో జాగలన్నీ సక్కగ లేవు. ఒక్కో రైతుకు ఆడింత, ఈడింత జాగుంది. రైతుల మధ్య అవగాహనతో హద్దు బదులు చేసుకుందాం. దీని ద్వారా ఒక్క దగ్గరనే ఎక్కువ భూమి అయితది. పూర్తిగా భూమి లేనోళ్లకు ఫౌల్ట్రీ ఫారాలు పెట్టిద్దాం. ఎస్సీ, బీసీ పిల్లలకు సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇస్త. వచ్చే వానాకాలం వరకు లోకమంతా వచ్చి ఈ ఊరినే చూసెటట్టు కావాలె. ఇవ్వన్నీ జరగాలంటే ఐకమత్యం చాలా అవసరం. ఎవరింట్లయినా పెండ్లయితే ఇంటికో రూ. 50 చొప్పున సాయం జేయండి. ఆ కుటుంబం అప్పులపాలు కాకుండా ఉంటది.
     ఊర్ల ఉండెటోళ్లకే ఇండ్లు...
     'ఊర్ల నివాసం ఉండెటోళ్లకే ఇండ్లు ఇస్తం. 30, 40 ఏళ్ల కిందట ఇతర ప్రాంతాలకు వలస పోయి అక్కడ ఇండ్లు కట్టుకున్నోళ్లకు ఎట్ల ఇస్తం' అంటూ సీఎం స్పష్టం చేశారు. గ్రామానికి చెందిన పలువురు ఇండ్ల జాబితాలో తమను చేర్చుకోవడం లేదని సీఎం దృష్టికి తీసుకురాగా పైవిధంగా స్పందించారు. గ్రామానికి చెందిన అన్ని కులాలతో కూడిన కమిటీ ఇళ్ల జాబితాను సిద్ధం చేసి గ్రామసభలో చదవాలని, ఎవరివైనా పేర్లు రాకపోతే మరో అవకాశం కల్పించాలని ఆదేశించారు.
     రాఖీ కట్టిన సర్పంచ్...
     ఎర్రవల్లి గ్రామంలో పర్యటించిన సీఎం కేసీఆర్‌కు గ్రామ సర్పంచ్ భాగ్య రాఖీ కట్టారు. అనంతరం పాదాభివందనం చేసి సీఎంతోపాటు సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement