'తెలంగాణలో కరోనా కేసు నమోదు కాలేదు' | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో కరోనా కేసు నమోదు కాలేదు'

Published Wed, Mar 4 2020 6:41 PM

Etela Rajender Says No Corona Positive Cases In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఎక్కడా కరోనా (కోవిడ్‌-19) కేసు నమోదు కాలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రభుత్వం కరోనాపై అప్రమత్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మంత్రి ఈటల బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చినవారికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయన‍్నారు. తెలంగాణలో ఉన్న ఏ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకలేదన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మాత్రమే ఈ వైరస్‌ సోకిందన్నారు.

కరోనా అనుమానితుల ఇద్దరి నమూనాలను పూణెకు పంపామని, 47మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్థారించాకే కరోనా పాజిటివ్‌ ప్రకటన చేయడం జరుగుతుందన్నారు. వైరస్‌ ఉన్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆ తుంపరలు నేరుగా ఇతరుల నోట్లో, కంట్లో పడితేనే ఇది వ్యాపిస్తుందని అన్నారు. క​రోనా వైరస్‌పై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు వదంతులు నమ్మొద్దని మంత్రి ఈటల సూచించారు. సమస్య తీవ్రత అర్థం చేసుకోవాలని, బాధ్యత కలిగిన మీడియా... ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలన్నారు. భయం కలిగించే వార్తలను ప్రచారం చేయడం తగదన్నారు. చదవండి: కోవిడ్‌ కట్టడికి 100 కోట్లు

మహేంద్ర హిల్స్‌ వద్ద (కరోనా వైరస్‌ సోకి ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కంటోన్మెంట్‌ మహేంద్రహిల్స్‌ ప్రాంతవాసి) ముందు జాగ్రత్తగా శానిటేషన్‌ నిర్వహించామని, కరోనాపై అనుమానాలు ఉంటే 104కు కాల్‌ చేయొచ్చని తెలిపారు. ప్రతి పేషెంట్‌ గాంధీ ఆస్పత్రికే రానవసరం లేదని, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా చికిత్స పొందవచ్చన్నారు. రాష్ట్రంలోని పెద్ద ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు ఉన్న దగ్గర కూడా చికిత్స తీసుకునేందుకు అనుమతి ఇచ్చామని మంత్రి ఈటల తెలిపారు. ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. టెస్ట్‌ కోసం నమునాలను గాంధీ ఆస‍్పత్రికి పంపాల్సి ఉంటుందన్నారు. ప్రయివేట్‌ మెడికల్‌ కాలేజీలు కూడా పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు ముందుకు వచ్చాయన్నారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి ఈటల పేర‍్కొన్నారు. 50 పడకలు ఉన్న ప్రతి ఆస‍్పత్రి సహకరించేందుకు ముందుకు వచ్చాయన్నారు. చదవండి: కరోనా మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావ్‌: వర్మ

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌
కోఠీలోని కమిషనర్‌ ఆఫ్‌ హెల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు. నలుగురు ఐఏఎస్‌ అధికారులకుతో నిపుణుల కమిటీ వేశామని, ఇందుకోసం అధికారులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరామన్నారు. చాలా వైరస్‌లతో పోలిస్తే కరోనా ప్రభావం తక్కువని, ఇది ప్రాణాలపై పెద్దగా ప్రభావం చూపదని అన్నారు. చదవండి: ఇక క్షణాల్లో కొవిడ్‌ను గుర్తించవచ్చు!

Advertisement
Advertisement