అనుబంధాల ‘సారిక’ | Sakshi
Sakshi News home page

అనుబంధాల ‘సారిక’

Published Fri, Nov 6 2015 1:25 PM

అనుబంధాల ‘సారిక’

అందరితో ఆప్యాయంగా మాట్లాడేది..
ఆమె పలకరిస్తే అత్త తిట్టేది..
అభినవ్ స్కూల్‌లో ఆక్టివ్‌గా ఉండేవాడు..
జ్ఞాపకాలు చెబుతూ విలపించిన స్థానికులు

 
హన్మకొండ చౌరస్తా : పిన్ని, ఆంటీ, అక్క, వదినా ఇలా ప్రతి ఒక్కరినీ వరుసలతో పలకరిస్తూ అనుబంధాలు పెనవేసుకుంటూ మాట్లాడేది.. రోజు సాయంత్రం ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని గల్లీలో వాకింగ్ చేస్తూ ఎదురుపడే వారిని ఆప్యాయంగా పలకరించేది.. ఇవి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ య్య కోడలు సారికతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ స్థానికులు చెప్పిన మాటలు. సారికతో పాటు ముక్కు పచ్చలారని ముగ్గురు చిన్నారులు అగ్నికి ఆహుతి కాగా.. ఆ ఘట నను స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోజూ తమకు కనిపించేవారు లేరన్న విషయాన్ని తలుచుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా హన్మకొండ రెవెన్యూ కాలనీలో సారిక, ఆమె కుమారులు సజీవ దహనమైన గృహం వద్ద చుట్టు పక్కల వారిని ‘సాక్షి’ పలకరించగా పలు విషయాలు చెప్పుకొచ్చారు.

సారిక అత్త రాక్షసి..

వాడలో అందరితో కలివిడిగా ఉంటే సారిక ఎవరితోనైనా మాట్లాడినట్లుగా కనిపిస్తే చాలు ఆమె అత్త(మాజీ ఎంపీ రాజయ్య భార్య) మాధవి బూతులు తిట్టేదని స్థానికులు చె ప్పారు. ఈ వాడలో ఎవరితో సఖ్యతతో ఉండడం తెలియని ఆమె రాక్షసిలా వ్యవహరించేదని పేర్కొన్నారు. గత ఏడాది సారిక ఆత్మహత్యకు యత్నించిన పదిహేను రోజుల తర్వాత ఇంటి బయట కనిపిస్తే పలకరించినందుకు వాడలో అందరిని కలిపి బూతులు తిట్టిందన్నారు. అప్పటి నుంచి సారిక అత్త ఇంట్లో ఉందటే చాలు ఆ ఇంటి ముఖం కూడా చూడకపోయేవారమన్నారు. సారిక అత్త చదువుకున్నా సం స్కారంలేని ఆడది అని ఛీత్కరించుకున్నారు.
 
రెండో పెళ్లి చేసిందే అత్త..

రాజయ్య కొడుకు అనిల్‌కు రెండో పెళ్లి చేసిందే సారిక అత్త అని స్థానికులు చెబుతున్నారు. సారికకు పెద్ద కొడుకు పుట్టగానే కాజీపేటకు చెందిన ముస్లిం యువతితో దగ్గరుండి పెళ్లి చేసిందన్నారు. రెండో భార్యకు కూడా ప్రస్తుతం ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిసింది.
 
సెంటిమెంట్‌తో అభినవ్‌కు పిలుపు..


వరంగల్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేసిన రాజయ్య ఆ రోజు తన మనవడు అభినవ్‌ను పిలిపించుకున్నట్లు స్కూల్ యాజమాన్యం చెబుతోంది. అభినవ్ అంటే రాజయ్యకు ఇష్టమని, గతంలో ఎంపీగా గెలిచినప్పడు కూడా అభినవ్ చేతిత నామినేషన్ తీసుకువెళ్లినందున అదే సెంటిమెంట్‌తో ఈసారీ పిలిపించినట్లు సమాచారం.
 
పీఎఫ్ డబ్బులతో కిరాణ సరుకులు కొనుగోలు..


సారిక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసినప్పుడు పీఎఫ్‌గా వచ్చిన డబ్బుతోనే కిరాణ సరుకులు, బియ్యం కొనుగోలు చేసుకునేదని సమాచారం. మూడు నెలల క్రితం ఆ డబ్బు అయిపోవడంతో పాత మిత్రుల సహకారంతో కాలం వెళ్లదీ స్తున్నట్లు తెలిసింది. సాధారణ  కుటుంబ మహిళగానే వ్యవహరించేదని స్థానిక కిరాణ దుకాణ సిబ్బంది తెలిపారు.
 
అభినవ్.. ఏ ప్లస్..


ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా పిల్లలకు అవి తెలియకుండా సారిక వ్యవహరించేది. రాంనగర్‌లోని మాంటిస్సోరి స్కూల్ లో సెకండ్ క్లాస్ చదువుతున్న అభినవ్ చాలా ఆక్టివ్‌గా ఉండే వాడని ఉపాధ్యాయులు తెలిపారు. అనిల్, సారిక కలిసి 2013లో అభినవ్ యూకేజీలో ఉన్నప్పుడు తమ పాఠశాలలో చేర్పించారని మాంటిస్సోరి స్కూల్ ఇన్‌చార్జి అశోక్‌రెడ్డి చెప్పారు. అభినవ్ ఇటీవల జరిగిన పరీక్షల్లో ఏ ప్లస్ మార్కులు రావడం విశేషం.

Advertisement

తప్పక చదవండి

Advertisement