Sakshi News home page

‘పాలెం’ బాధితులకు ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలి

Published Fri, Nov 28 2014 1:59 AM

‘పాలెం’ బాధితులకు ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలి

* అసెంబ్లీలో జీరో అవర్
* ప్రస్తావించిన  టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి
* యువతను వేధిస్తున్న పోలీసులు: ఎంఐఎం సభ్యుడు పాషాఖాద్రి
* భీంరావ్‌వాడ వాసులకు ఆవాసాలు ఏర్పాటు చేయాలి: రాజాసింగ్
* సింగరేణి ఆస్పత్రుల్లో వైద్యులను నియమించాలి: పాయం వెంకటేశ్వర్లు

 
 సాక్షి, హైదరాబాద్: పాలెం బస్సు దుర్ఘటనలో ప్రాణాలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు గత ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష ఎక్స్‌గ్రేషియోను రూ.10లక్షలకు పెంచాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆదం వెంకటేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. పాలెం బస్సు దుర్ఘనటకు కారణమైన ట్రావెల్స్ యాజమాన్యం బాధితులకు చెల్లిస్తామన్న పరిహారం ఇంతవరకు ఇవ్వలేదని, యాజమాన్యంపై సరైన చర్యలు సయితం లేవన్నారు.
 
 ఎంఐఎం సభ్యుడు పాషాఖాద్రి మాట్లాడుతూ, దొంగతనం కేసుల్లో పట్టుబడిన యువకులను పోలీసులు పదేపదే వేధిస్తున్నారని చెప్పారు. గాంధీభవన్ పక్కనే భీంరావ్‌వాడ బస్తీని 2008లో అధికారులు బలంవంతంగా ఖాళీ చేయించారని, దీనిపై గతంలో టీఆర్‌ఎస్ సహా అన్ని పార్టీలు వారి వద్దకు వెళ్లి పరామర్శించాయని, ఇప్పడు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ వారి సమస్యలపై స్పందించి బస్తీ వాసులకు అక్కడే ఆవాసాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని రాజాసింగ్ (బీజేపీ) కోరారు. గద్వాల ఏరియా ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగినందున 100 పడకల ఆస్పత్రిని 200ల పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని డీకే అరుణ (కాంగ్రెస్) ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. సింగరేణి ఆస్పత్రుల్లో సరైన వైద్యులు, సిబ్బంది లేరని, ఆస్పత్రులు అలంకరణ ప్రాయంగా మారాయని, నిర్ణీత ధరకు తక్కువగా టెండర్లు వేయడం వల్ల నాణ్యతలేని మందుల సరఫరా జరుగుతోందని పాయం వెంకటేశ్వర్లు (వైఎస్సార్‌సీపీ) ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. భద్రాచలం ఆలయ పరిధిలో భక్తుల సౌకర్యార్ధం పుష్కరఘాట్‌లను నిర్మించాలని సున్నం రాజయ్య (సీపీఎం) కోరారు. మానేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్ధ్యం 24 టీఎంసీల నుంచి 4 టీఎంసీలకు పడిపోయిందని, తాగు నీటి అవసరాల దృష్ట్యా ఎస్సారెస్పీ నుంచి వరద కాల్వ ద్వారా రిజర్వాయర్‌ను నింపాలని గంగుల కమలాకర్ (టీఆర్‌ఎస్) విజ్ఞప్తి చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement