29 Apr, 2018 11:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌, మంత్రి పి.రామచంద్రా రెడ్డి (89) శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రమాదవశాత్తు బాత్‌రూంలో జారి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన స్వస్థలం మెదక్‌ జిల్లా మారేపల్లి గ్రామం. రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టాను పొందారు. మెదక్‌ జిల్లా కోర్టులో కొంతకాలం పనిచేశారు. 

ఆయన చదువుకునే రోజుల్లో స్వామి రామానందతీర్థ ప్రసంగాలకు ఆకర్షితుడయ్యారు. అప్పట్లోనే నిజాం నిరంకుశ పాలనకు ఎదురెళ్లి జైలుకెళ్లారు. 1957లో పటాన్‌చెరు పంచాయత్‌ సమితికి అధ్యక్షుడిగా ఎన్నియ్యారు. మొదటిసారిగా 1962లో సంగారెడ్డి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తరువాత 1971, 83, 85, 89లలో ఎమ్మెల్యేగా గెలిచారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో (1989) అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు. స్పీకర్‌గా ఎన్నో సంస్కరణలు చేపట్టారు. నేదురుమల్లి జనార్ధన్‌ హయాంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. ఎన్నో పరిశ్రమలు నెలకొల్పడంలో, యువతకు ఉపాధి కల్పించడంలో ముఖ్యపాత్ర పోషించారు. చివరిగా 2004లో ఎన్నికల్లో ఓడిపోయాక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు