గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు | Sakshi
Sakshi News home page

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు

Published Tue, Mar 7 2017 6:58 PM

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్‌ దాడులు - Sakshi

హుస్నాబాద్‌: గుడుంబాను తయారు చేయడాన్ని మానుకున్న గిరిజనులకు ప్రభుత్వం చేయూతనిస్తూ ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని మెదక్‌ జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ కేఏబీ శాస్త్రి అన్నారు. హుస్నాబాద్‌ మండలంలోని మీర్జాపూర్, అంబానాయక్‌ తండాల్లో ఎక్సెజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గుడుంబాను తయారు చేస్తున్న  ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఐదుగురిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 35 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు శాస్త్రి తెలిపారు.

 

అనంతరం హుస్నాబాద్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్‌ ప్రాంతంలో గతంలో గుడుంబా తయారు చేస్తున్న 281 మందిని బెండోవర్‌ చేశామని, వారిలో కొందరిలో మార్పు రాలేదన్నారు. వారి పూచీకత్తును జప్తు చేస్తామన్నారు. గుడుంబా తయారు చేసే వారిపై పీడీ యాక్ట్‌ కేసును నమోదు చేస్తామన్నారు. గుడుంబా తయారీని వదిలేసినవారికి ప్రభుత్వం చేయూతనిస్తూ ప్రత్యామ్నాయంగా ఉపాధి మార్గం చూపెడుతుందని అన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గుడుంబా తయారు చేసే వారికి సంబంధించిన సమాచారమందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచడమే కాకుండా పారితోషికం ఇస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ సైదులు, ఎక్సైజ్‌ సీఐ విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.  
 

Advertisement
Advertisement