విస్తరణ 10 మీటర్లే | Sakshi
Sakshi News home page

విస్తరణ 10 మీటర్లే

Published Mon, Jun 23 2014 11:47 PM

విస్తరణ  10 మీటర్లే

ఫోర్ లేన్.. ఫాల్స్ న్యూస్  సంగారెడ్డి - నాందేడ్ రహదారి
 
నాదేండ్ రహదారి అభివృద్ధిపై స్పష్టత
నాలుగులేన్ల ప్రకటన అవాస్తవమని తేల్చిన అధికారులు
7 నుంచి 10 మీటర్ల మేర పెంచాలని నిర్ణయం
జిల్లాలోని 51 కి.మీ. పనులకు రూ.98.6 కోట్లు మంజూరు
నెల రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశం

 
 
 సంగారెడ్డి-నాందేడ్ రహదారి... జిల్లా నుంచి ఢిల్లీ, షిరిడీ లాంటి ప్రాంతాలకు వెళ్లే ఏకైక రోడ్డు. అందువల్లే ఈ దారిపై నిత్యం వందల వాహనాలు పరుగులు తీస్తుంటాయి. దాదాపుగా 141 కిలోమీటర్లు విస్తరించిన ఈ రోడ్డు కేవలం 7 మీటర్ల వెడల్పు మాత్రమే ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మూల మలుపులు, గుంతలు కుడా అధికం కావడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. దీంతో రోడ్డును విస్తరించాలనే డిమాండ్ తీవ్రమైంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తుండడంతో ప్రజాప్రతినిధులు ఓ అవాస్తవ ప్రకటన చేశారు. నాందేడ్ దారిని నాలుగులేన్లుగా విస్తరిస్తున్నామని, జీవో కూడా జారీ అయ్యిందంటూ ఊదరగొట్టారు. అయితే నేతలు మాటలన్నీ అవాస్తమని అధికారులు తేల్చేశారు.
 
 జోగిపేట:
జిల్లాలో 89 కిలోమీటర్ల మేర విస్తరించిన నాందేడ్  రహదారిపై ప్రయాణం నరకంగా మారింది. సంగారెడ్డి- నాందేడ్- అకోల రహదారి పొడవు 141 కిలోమీటర్లు కాగా, వెడల్పు మాత్రం కేవలం 7 మీటర్లు. దీంతో ఈ రోడ్డుపై మూల మలుపులు, గోతులు కూడా అధికం కావడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోడ్డును విస్తరించాలనే డిమాండ్ అధికమైంది. నేతలు ఎక్కడకూ వెళ్లినా నాందేడ్  రహదారి విస్తరణ అంశంపై నిలదీతలూ ఎక్కువయ్యాయి. మరోవైపు ఎన్నికలు సమీపించడంతో ప్రజాప్రతినిధులు గండం గట్టెక్కేందుకు ఓ అవాస్తవ ప్రకటన చేశారు. కేంద్రం ఎలాంటి అనుమతులు ఇవ్వకున్నా, సంగారెడ్డి-నాందేడ్-అకోలా రహదారిని  కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా గుర్తించిందని, ఈ రోడ్డును నాలుగులేన్ల రోడ్డుగా విస్తరించేందుకు నిధులు మంజూరైనట్లు అప్పుడుపార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న  వారంతా పలుసార్లు ప్రకటించారు. జిల్లా ప్రజానీకం కూడా ఆనందపడ్డారు. ఇక కదలకుండా షిర్డీ, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు వెళ్లవచ్చని భావించారు. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.

అంతా అవాస్తవం

 సంగారెడ్డి-నాందేడ్-అకోలా రహదారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తారన్న ప్రకటనలు అవాస్తవమని జాతీయ రహదారుల అధికారులు తేల్చేశారు, ప్రస్తుతం ఉన్న 7 మీటర్ల రోడ్డును 10 మీటర్లుగా పెంచుతూ రోడ్డు వేసేందుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని స్పష్టం చేశారు. ఈ మేరకు సంగారెడ్డి నుంచి నాందేడ్ వరకు గల 141 కి.మీ పొడువున్న రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు. ఈ మేరకు మెదక్ జిల్లాలో 89 కి.మీ మేర ఉన్న ఈ రోడ్డును 10 మీటర్ల విస్తరించాలని ప్రభుత్వం జీఓలో పేర్కొన్నట్లు అధికారులు చెప్పారు. ఈపనులు 2013వ సంవత్సరంలోనే మంజూరు చేసినా, టెండర్ల నిర్వహణకు సంబంధించి అధికారులు నిర్లక్ష్యం చూపారన్నారు. అందువల్ల తాజాగా సంగారెడ్డి నుంచి బొడ్మట్‌పల్లి గ్రామం వరకు గల 51 కి.మీ మేర రోడ్డు విస్తరణకు గాను ప్రభుత్వం రూ.98 కోట్లు మంజూరు చేసిందని ఈ పనులకు సంబంధించి టెండర్లను నెలరోజుల్లో నిర్వహించే అవకాశం ఉందని జాతీయ రహదారుల(ఎన్‌హెచ్) డిప్యూటీ ఈఈ శ్రావణ్ ప్రకాశ్ తెలిపారు. ఈ నిధులతోనే అన్నాసాగర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు 20 వరకు కల్వర్టుల నిర్మిస్తామన్నారు. ఫోర్‌లేన్‌కు సంబంధించి ఎలాంటి మంజూరు లేదని ఆయన స్పష్టం చేశారు.

కలగా మారిన నాలుగు లేన్ల విస్తరణ

 నిత్యం వందలాది లారీలు, కార్లు, ఇతర సర్వీసులతో రద్దీగా ఉండే ఈ రోడ్డును ఫోర్‌లేన్లుగా విస్తరిస్తారని స్థానికులు భావించారు. వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే ఈ రోడ్డును సంగారెడ్డి, నాందేడ్, అకోలా రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి అభివృద్ధి పరచడంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు అంటున్నారు. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ పలు సభల్లో ఫోర్‌లేన్ రోడ్డు మంజూరైందని ప్రకటించారనీ, అయితే జాతీయ రహదారుల అధికారులు మాత్రం అలాంటిదేమీలేదని చెబుతున్నారని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

 రోడ్డు విస్తరణకు కృషి చేశా

 నాందేడ్ అకోలా రహదారి విస్తరణ కోసం తనవంతు కృషి చేశానని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా జోగినాథ్ తెలిపారు. రాజ్యసభ సభ్యులు దేవేందర్‌గౌడ్ ద్వారా రోడ్డు విస్తరణ చేపట్టాలన్న లేఖతో అప్పటి కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణను కోరినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రోడ్డును 10 మీటర్ల మేర పెంచేందుకు నిధులను మంజూరు చేయడం హర్షదాయకమన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement