Sakshi News home page

రిక్తహస్తం

Published Wed, Jun 11 2014 3:33 AM

రిక్తహస్తం

ఆదిలాబాద్ టౌన్ : అమ్మహస్తం పథకం నిలిచింది. వినియోగదారులకు పంపిణీ చేయాల్సిన తొమ్మిది రకాల సరుకుల జాడ లేదు. రూ.185 ధరకే నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు తలపెట్టిన అమ్మహస్తం పథకానికి ప్రభుత్వం మంగళం పాడింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే సాధారణ సరుకులైన బియ్యం, కిరోసిన్, చక్కెరతోపాటు అదనంగా కారం, పసుపు, చింతపండు, పామాయిల్, గోధుమపిండి, గోధుమలు, ఉప్పు తదితర సరుకులు రూ.185కే అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కిరణ్ హంగు ఆర్భాటాలతో ప్రవేశపెట్టిన పథకం ప్రస్తుతం కథ ముగిసింది. దీంతో అదనపు సరుకుల పంపిణీ పూర్తిగా నిలిచిపోవడంతో సాధారణ సరుకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
 
 అటకెక్కినట్టేనా!
 జిల్లాలో 7.05 లక్షల మంది రేషన్‌కార్డుల దారులు ఉన్నారు వీరందరికి నెలవారీగా సరకులు పంపిణీ చేస్తున్నారు. అమ్మహస్తం పథకంలో భాగంగా ఈ కార్డుదారులకు ప్రతినెల తొమ్మిది రకాల సరుకు అందజేయాలి. కాగా అమ్మహస్తం సరుకుల్లో నాణ్యత కొరవడంతో కార్డుదారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. నాణ్యమైన సరుకులు అందిస్తామంటూ అప్పటి ప్రభుత్వం, నేతలు ప్రగల్భాలు పలికినప్పటికీ క్షేత్రస్థాయిలో సరుకులపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
 
 ఫలితంగా రేషన్ డీలర్లు క్రమంగా ఈ సరుకులను పక్కన పెట్టారు. కేవలం బియ్యం, చక్కెర, పామాయిల్ సరుకులకు మాత్రమే డీడీలు కట్టి స్టాకు తెప్పించుకోవడంతో మిగతా సరుకుల ప్రాధాన్యం క్రమంగా పడిపోయింది. కేవలం బియ్యం, చక్కెర, పామాయిల్ మాత్రమే అందజేస్తూ వచ్చారు. బహిరంగ మార్కెట్‌లో ఈ వస్తువుల ధరలు రెట్టింపు ఉండడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
 నిల్వలు ముక్కిపోయి
 అమ్మహస్తం పథకం కింద జిల్లాకు కేటాయించిన సరుకులు చింతపండు, కారం, ఉప్పు, గోధుమలు, గోధుమపిండి తదితర సరుకులకు డిమాండ్ లేకుండపోయింది. రేషన్ డీలర్లు సరుకులు తీసుకపోవడంతో వాటిని పౌరసరఫరాల శాఖ అధికారులు గోదాంల్లోనే నిల్వ ఉంచారు. దీంతో కొన్ని సరకులు ముక్కిపోవడంతో ప్రభుత్వానికి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెలకు సంబంధించి జిల్లాకు వచ్చిన స్టాకులో చింతపండు ఈనెల 14,848 ప్యాకెట్లు, పసుపు నిల్వ 130, కారం 1,92,764, ఉప్పు 64 వేలు, చక్కెర 90 వేలు, గోధుమలు 44 వేలు, గోధుమపిండి 50 వేల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సరుకులన్నీ కార్డుదారులందరికీ సరిపోవు. కేవలం బియ్యం, చక్కెర మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. వినియోగదారులు సరుకుల కోసం అడిగితే స్టాక్ లేదంటూ తప్పించుకుంటున్నారు.
 
 మూడు నెలల నుంచి పామాయిల్ బంద్
 రేషన్ కార్డుదారులకు కిలో చొప్పున అందించే పామాయిల్ కొరత జిల్లాలో తీవ్రంగా ఉంది. మూడు నెలల నుంచి కార్డుదారులకు అందడంలేదు. జిల్లాకు 7.05 లక్షల కార్డుదారులకు పామాయిల్ ప్యాకెట్లు అవసరం. ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డు దారులకు పామాయిల్ పంపిణీ కావడం లేదు. తాజాగా ఈ నెలలో కూడా పామాయిల్ సరాఫరా నిలిచింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

అమ్మహస్తం సరుకులు తీసుకోవడం లేదు.. - జిల్లా పౌరసరఫరాల మేనేజర్
అమ్మహస్తం సరుకులను కార్డుదారులు తీసుకెళ్లడం లేదు. దీంతో డీలర్లు ఆ వస్తువులకు సంబంధించి డీడీలు కట్టడంలేదు. గోదాముల్లో ఉన్న సరుకులను డీడీలు కట్టిన వారికి పంపిణీ చేస్తున్నాం. మూడు నెలల నుంచి పామాయిల్ రావడం లేదు. పామాయిల్ వచ్చిన వెంటనే వినియోగదారులకు అందజేస్తాం.

Advertisement

తప్పక చదవండి

Advertisement