‘బోగస్’.. జాబ్స్! | Sakshi
Sakshi News home page

‘బోగస్’.. జాబ్స్!

Published Wed, Apr 23 2014 3:08 AM

Fake certificate Teachers were promoted

సాక్షి, రంగారెడ్డి జిల్లా: నకిలీ సర్టిఫికెట్ల బాగోతంలో జిల్లా విద్యాశాఖ మరోసారి పాలుపంచుకుంది. గతంలో బోగస్ ధ్రువీకరణ పత్రాలతో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల వ్యవహారం ఇంకా సద్దుమణగకముందే మరో నిర్వాకం బట్టబయలైంది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఇటీవల చేసిన ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ కోటాలో క్లరికల్ క్యాడర్, చివరి గ్రేడ్ పోస్టులకు సంబంధించి 47 ఖాళీలను భర్తీ చేసేందుకు జిల్లా యంత్రాంగం గత ఏడాది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కేవలం మెరిట్‌పైనే ఆధారపడి ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇందులో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టిన అధికారులు ఎట్టకేలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు చిక్కంతా ఇక్కడే ఉంది. ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన అధికారులు.. అవి సరైనవేనా.. లేదా అనే కోణంలో పరిశీలన చేయకుండా కేవలం మార్కులను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు.
 
ఏమార్చారిలా.. 
బ్యాక్‌లాగ్ ఉద్యోగాల్లో కేవలం మార్కులే ప్రామాణికం. ఇదే అదనుగా భావించిన కొందరు అభ్యర్థులు సరికొత్త ఎత్తుగడ వేశారు. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి వాటిని దరఖాస్తులతో సమర్పించారు. వీటిలో అభ్యర్థులు సాధించిన మార్కులు చూస్తే దిమ్మతిరిగిపోతుంది. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడో తరగతి, ఐదో తరగతిలో 99శాతం మార్కులుండడం గమనార్హం. గరిష్టంగా 600 మార్కులకు చాలా మంది అభ్యర్థులకు 595, 594, 593, 592, 591 ఇలా 14 మందికి 95శాతానికిపైగా మార్కులు వ చ్చాయి. వీరు సమర్పించిన సర్టిఫికెట్లన్నీ సరూర్‌నగర్, హయత్‌నగర్, మంచాల మండలాల్లోని ప్రైవేటు పాఠశాలలకు సంబంధించినవే. అయితే ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను జిల్లా యంత్రాంగం బహిర్గతం చేయడంతో అసలు తంతు బయటపడింది. ఎక్కువ మార్కులు సాధించిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అసలు కథ వెలుగు చూసింది. వారు సమర్పించిన ధ్రువీకరణ పత్రాల తాలూకు పాఠశాలల్లో రికార్డులకు ఏమాత్రం పొంతన కుదర కపోవడం విశేషం.
 
హడావుడి ఎందుకో!
ఈ అక్రమాల వ్యవహారంపై ఇదివరకే కొందరు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు ఆదేశించిన యంత్రాంగం సరూర్‌నగర్ ఉపవిద్యాధికారి రోహిణిని విచారణాధికారిగా నియమించింది. విచారణాధికారి నివేదిక ఆధారంగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ విచారణ నివేదిక రాకమునుపే ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందించారు. దీంతో అక్రమార్కులు సైతం ఉద్యోగాల్లో చేరారు.
 

Advertisement
Advertisement