నకిలీ సర్టిఫికెట్లు పెట్టి.. కొలువులు కొల్లగొట్టి! | Sakshi
Sakshi News home page

నకిలీ సర్టిఫికెట్లు పెట్టి.. కొలువులు కొల్లగొట్టి!

Published Wed, Nov 4 2015 1:28 AM

నకిలీ సర్టిఫికెట్లు పెట్టి.. కొలువులు కొల్లగొట్టి! - Sakshi

వైద్య ఆరోగ్య శాఖలో అక్రమాల బాగోతం
కాంట్రాక్టు ఉద్యోగాల్లో చేరిన వందలాది మంది అనర్హులు
‘సాక్షి’కి అందిన అక్రమాల చిట్టా
త్వరలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్న ప్రభుత్వం

 
హైదరాబాద్: పారామెడికల్ కోర్సులు చేయకుండానే నకిలీ సర్టిఫికెట్లు పెట్టారు.. సంతకాలు ఫోర్జరీ చేశారు.. టెన్త్ సర్టిఫికెట్లు కూడా నకిలీవి పెట్టారు.. వైద్య ఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు కొలువుల్లో చేరారు.. అసలు ఈ సర్టిఫికెట్లను పరిశీలించకుండానే అధికారులు రిజిస్ట్రేషన్ చేశారు. కాంట్రా క్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో... ప్రభుత్వ ఇనిస్టిట్యూట్లలో శిక్షణ పొందిన కొందరు కాంట్రాక్టు ఉద్యోగుల ఫిర్యాదుతో ఈ బాగోతం బయటపడింది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, సూర్యాపేట, మిర్యాలగూడ, ఒంగోలు కేంద్రంగా ఢిల్లీ నుంచి ఈ నకిలీ ‘మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్‌ఏ)’ డిప్లొమా వచ్చినట్లు వెల్లడైంది. ఈ సర్టిఫికెట్లను పరిశీలించకుండానే వైద్యవిధాన పరిషత్‌లోని పారా మెడికల్ బోర్డు అధికారులు రిజిస్ట్రేషన్ చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలు వెల్లడైనా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఈ వ్యవహారం వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
 ఢిల్లీ కేంద్రంగా దందా..: ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఐదు వేల జనాభాకు ఒక ‘మల్టీపర్పస్ మేల్ వర్కర్’ను నియమించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు 2002లో జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ప్రభుత్వ ఇనిస్టిట్యూట్‌లలో శిక్షణ పొందిన 1,050 మంది అభ్యర్థులతో పాటు మరో పది వేల మంది వీటికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో సూర్యాపేట కేంద్రంగా కొనసాగిన ఓ పారిశుద్ధ్య టెక్నాలజీ సంస్థ నుంచి ఢిల్లీలోని ఓ ఇనిస్టిట్యూట్ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు పొందారు. ఇందుకు భారీగా సొమ్ము చెల్లించారు. దీనిపై ఆరోపణలు రావడంతో అప్పట్లోనే ఆ సంస్థపై పోలీసులు దాడి చేసి సీజ్ చేశారు. కానీ రూ.లక్షలు పెట్టి కొన్న ఆ సర్టిఫికెట్లతో కొంత మంది కాంట్రాక్టు కొలువులు పొందారు.

ఇవి నకిలీలలు: నకిలీ సర్టిఫికెట్లతో తెలంగాణ, ఏపీల్లో ఇప్పటికే అనేకమంది కాంట్రాక్టు ప్రతిపాదికన చేస్తున్నారు. కొంతమంది నకిలీల జాబి తా ‘సాక్షి’ చేతికి చిక్కింది. వాటిలో కొన్ని..ఓ అభ్యర్థికి 1996 డిసెంబర్‌లో సూర్యాపేటలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శానిటేషన్ టెక్నాలజీలో డిప్లొమా పూర్తిచేసినట్లు సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే కోర్సు పూర్తికాకముందే 1996 ఆగస్టులోనే ప్రొవిజనల్ సర్టిఫికెట్ జారీచేశారు.
  ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న చాలామంది అభ్యర్థుల డిప్లొమా, ప్రొవి జనల్ సర్టిఫికెట్లపై రిజి స్ట్రార్ సంతకం ఫోర్జరీ చేయబడి ఉంది. రిజిస్ట్రార్ కల్నల్ ఎస్. కటారియాకు బదులు వేర్వేరుగా సంతకాలు ఉన్నాయి.

  ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి పేరు నాగేశ్వరరావు కాగా... వైద్య ఆరోగ్యశాఖకు ఆయన సమర్పించిన డిప్లొమా, ప్రొవిజినల్ సర్టిఫికెట్లపై జ్ఞానేశ్వరరావు అని ఉంది. ఒక అభ్యర్థి నకిలీ ఎస్సెస్సీ సర్టిఫికెట్ దాఖలు చేశాడు. ఆ సర్టిఫికెట్‌తో పాటు డిప్లొమా, ప్రొవిజనల్‌పైనా ఒకే వ్యక్తి చేతిరాత ఉండడం గమనార్హం.
 
వారిని తొలగించాల్సిందే..
నకిలీ, ఫోర్జరీ సర్టిఫికెట్లతో అనేక మంది వైద్యారోగ్యశాఖలో హెల్త్ వర్కర్ ఉద్యోగాలు పొందారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో నకిలీలు ఎక్కువగా ఉన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై పోస్టులు పంచుకున్నారు. ప్రభుత్వం నకిలీలను  తొలగించకుంటే ఆందోళన చేపడతాం.
 - మన్నె శ్రీనివాస్ పిళ్లై,
 హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ నాయకుడు
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement