డబ్బు కోసం నకిలీ మావోయిస్టుగా.. | Sakshi
Sakshi News home page

డబ్బు కోసం నకిలీ మావోయిస్టుగా..

Published Fri, Mar 6 2015 2:25 AM

Fake Maoist to for money

మంచిర్యాల టౌన్ : అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఓ డిగ్రీ విద్యార్థి నకిలీ మావోయిస్టు అవతారమెత్డాడు. ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లను పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడు. ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు. చివరికి పోలీసులు పన్నిన వ్యూహంలో అడ్డంగా దొరికిపోయూడు. గురువారం మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఏఎస్పీ ఎస్.ఎం.విజయ్‌కుమార్ వివరాలు వెల్లడించారు.
 
డబ్బు అవసరాలు.. పాత కక్షలతో..
చెన్నూర్ పట్టణంలోని మారెమ్మవాడకు చెందిన కొమటం మధూకర్ అలియాస్ మధు అలి యూస్ మదన్ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేశాడు. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిం చాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. అలాగే తనకు గత సాధారణ, ప్రాదేశిక ఎన్నికల సమయంలో కొంతమంది ప్రజాప్రతినిదులతో జరిగిన గొడవలతో వ్యక్తిగత కక్షలను పెంచుకున్న మధూకర్ నకిలీ మావోయిస్టు అవతారం ఎత్తాడు. అంతేకాకుండా తను కౌలు తీసుకున్న పొలంలో సాగు సమయంలో దాదాపు రూ.లక్షకు పైగా అప్పుల పాలయ్యాడు. అప్పులను తీర్చుకోవడం కోసం, పాత కక్షలతో ప్రజాప్రతినిధులను బెదిరించి డబ్బులు సంపాదించాలనుకున్నాడు. మహారాష్ట్ర గడ్చిరోలి దళ కమాండర్ రామన్న పేరుతో ప్రజాప్రతినిధులను, కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేయడమే లక్షంగా పెట్టుకున్నాడు.
 
పార్టీ చందాగా రూ.లక్షలు డిమాండ్
ఈ క్రమంలో మంచిర్యాల కాలేజ్‌రోడ్‌లోని పాతగర్మిళ్లకు చెందిన బెల్లంకొండ వెంకటేశ్వర్‌రావు అలాయాస్ భాస్కర్‌రావుతో పాటు ఆయన కుమారుడు భార్గవ్‌కు కూడా ఫోన్ చేసి పార్టీ చందాగా రూ.లక్ష డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులను చంపేస్తామని హెచ్చరించారు. దీంతో అనుమానం వచ్చిన కాంట్రాక్టర్ వెంకటేశ్వర్‌రావు ఫిబ్రవరి 14వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

మధూకర్ చెన్నూర్‌కు చెందిన మరో ముగ్గురు ప్రజాప్రతినిధులను కూడా మావోయిస్టు పేరుతో బెదిరింపు ఫోన్లు చేశాడు. ఇందులో కోటపల్లి మండల జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డితో ఎన్నికల సమయంలో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టు పార్టీ చందాగా రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. అలాగే చెన్నూర్ ఎంపీపీ మైదం కళావతి భర్త మైదం రవితో జరిగిన గొడవలో కూడా అతనికి ఫోన్ చేసి పార్టీ చందాగా రూ.5 లక్షలు, గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వార్డు సభ్యుడు బత్తుల సమ్మయ్యతో జరిగిన గొడవను దృష్టిలో ఉంచుకుని పార్టీ చందాగా కొంత మొత్తం డబ్బులు డిమాండ్ చేశాడు. వీరంతా పోలీసుల దర్యాప్తులో బాధితులుగా తేలారు.
 
అంతా పక్షం రోజుల్లోనే...
మంచిర్యాలకు చెందిన బెల్లంకొండ వెంకటేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు సీఐ వి.సురేశ్, పోలీస్ సిబ్బంది 15 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని గురువారం మంచిర్యాల గర్మిళ్లలో అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు వాల్ పోస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. కాగా, పాత కక్షలతో పాటు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే నకిలీ మావోయిస్టు అవతారం ఎత్తినట్లు విచారణలో మధూకర్ అంగీకరించాడు. అతడిని రిమాండ్‌కు పంపారు.

Advertisement
Advertisement