ఉసురు తీసిన అప్పులు | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన అప్పులు

Published Mon, Jul 6 2015 12:23 AM

ఉసురు తీసిన అప్పులు - Sakshi

కాలం కనికరించలేదు.. రెక్కలుముక్కలు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.. వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. ఈ ఏడాది సాగుచేసిన పత్తిపంట ఎండుముఖం పట్టింది. ఇక అప్పులు తీరేమార్గం లేదని మనోవేదనకు గురైన ఓ అన్నదాత పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వారం రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. ఈ విషాదకర సంఘటన షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లిలో సోమవారం చోటుచేసుకుంది.
 
 షాబాద్ : మృతుడి కుటుంబీకులు, ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం చేగూరు అనుబంధ బండోనిగూడకు చెందిన కొత్తకుర్వ శంకరయ్య(50) ఇరవై సంవత్సరాల క్రితం కుటుంబంతో సహా షాబాద్ మండలం తాళ్లపల్లి గ్రామానికి వలస వచ్చాడు. ఇక్కడే స్థిరపడి 10 ఎకరాల భూమి కోనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రతి ఏడూ పత్తిపంట సాగుచేస్తున్నాడు. మూడు సంవత్సరాలుగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు సరిగా పండకపోవడంతో తీవ్ర నష్టం వచ్చింది.

అనంతరం వ్యవసాయ పెట్టుబడుల కోసం చేవెళ్లలోని యాక్సిస్ బ్యాంకులో రూ.6 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద మరో రూ.4 లక్షలు అప్పులు చేశాడు. ఈసారైనా కష్టపడి పంటలు సాగుచేసి ఎలాగైనా అప్పులు తీర్చాలని భావించాడు శంకరయ్య. గత జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు పది ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటాడు. అప్పటి నుంచి వర్షాల జాడలేదు. దీంతో మొలకెత్తిన పత్తి మొలకలు ఎండుముఖం పట్టాయి.  ఇక ఈ ఏడాది అప్పులే మిగిలేటట్టు ఉన్నాయని, గతంలోని అప్పులు కుప్పలుగా ఉన్నాయని మనోవేదనకు గురయ్యాడు. వాటిని తీర్చేమార్గం కనిపించకపోవడంతో గత జూన్ 28న పురుగుల మందు తాగాడు.

గమనించిన కుటుంబీకులు ఆయనను స్థానికుల సాయంతో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దాదాపు వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన శంకరయ్య ఓడిపోయాడు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి మృతిచెందాడు. ఆదివారం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆదివారం సాయంత్రం తాళ్లపల్లిలో కుటుంబీకులు శంకరయ్య అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య భాగ్యమ్మ, కూతుళ్లు మంజుల, అరుణ, కొడుకులు కుమార్, మల్లేష్‌లు ఉన్నారు. ఇద్దరి కూతుళ్ల వివాహం జరిగింది.

 కన్నీటిపర్యంతమై కుటుంబీకులు
 ఇంటికి పెద్దదిక్కు అయిన శంకరయ్య మృతితో భార్యాపిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. తామెలా బతకాలని గుండెలవిసేలా రోదించారు. అందిరితో కలుపుగోలుగా ఉండే శంకరయ్య మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement