వామ్మో.. స్వైన్‌ఫ్లూ | Sakshi
Sakshi News home page

వామ్మో.. స్వైన్‌ఫ్లూ

Published Sat, Nov 22 2014 11:47 PM

వామ్మో.. స్వైన్‌ఫ్లూ - Sakshi

 మొయినాబాద్: స్వైన్‌ఫ్లూ సోకి చికిత్స పొందుతున్న రైతు మృత్యువాత పడడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మొయినాబాద్‌కు చెందిన రైతు ఆసిఫ్(29) మృతితో మొయినాబాద్ మండల కేంద్రంలో శనివారం తీవ్ర కలకలం రేగింది. ఈనెల 6న ఆసిఫ్‌కు జ్వరం రావడంతో కుటుంబీకులు నగరంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి స్వైన్‌ఫ్లూ సోకిందని నిర్ధారించి చికిత్స అందించసాగారు. పరిస్థితి విషమించడంతో రైతు శుక్రవారం రాత్రి చనిపోయాడు.

ఆసిఫ్‌కు స్వైన్‌ఫ్లూ సోకిందనే విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు వారం రోజుల క్రితం ఇళ్లు వదిలివెళ్లారు. మొయినాబాద్‌లోని ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు పట్టుబట్టారు. కొందరు తల్లిదండ్రులు శనివారం తమ పిల్లలను స్కూళ్లు, కాలేజీలకు పంపలేదు. విద్యార్థులు     మాస్క్‌లు ధరించి స్కూళ్లకు వెళ్తున్నారు. పెద్దలు కూడా మాస్క్‌లతో బయటకు వెళ్తున్నారు. శనివారం నలుగురు ఓ చోట కలిస్తే ‘స్వైన్‌ఫ్లూ’ విషయమే మాట్లాడుతూ కనిపించారు.

 మూడు రోజుల క్రితం..
 మూడు రోజుల క్రితం మొయినాబాద్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్(30) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఆయన పచ్చకామెర్ల వ్యాధితో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇమ్రాన్‌కు పది రోజల క్రితం జ్వరం రావడంతో కుటుంబీకులు నగరంలోని ఓవైసీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు గురువారం మృతి చెందాడు. అతడి అంత్యక్రియలు స్వస్థలం రాజేంద్రనగర్ మండలంలోని నార్సింగిలో నిర్వహించారు. ఇమ్రాన్ భార్య నూర్జహాన్(25) సైతం అనారోగ్యంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. కాగా దంపతులకు స్వైన్‌ఫ్లూ సోకి ఉండొచ్చని మొయినాబాద్‌లో పుకార్లు వ్యాపించాయి.

ఆసిఫ్ పొరుగింట్లో ఉండే వృద్ధురాలు లక్ష్మి(65)కి ఇటీవల జ్వరంతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెళ్లిందో ఎవరికి తెలియలేదు. ఆమెకు కూడా స్వైన్‌ఫ్లూ సోకి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా ఆసిఫ్ వ్యవసాయంతో పాటు పలు సంతలు తిరుగుతూ పశువుల క్రయవిక్రయాలు జరుపుతుండేవాడు. ఈక్రమంలో ఆయనకు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకి ఉంటుందని స్థాని కులు అనుమానిస్తున్నారు.  

 భయంభయం..
 శనివారం ఆసిఫ్ అంత్యక్రియలు మండల కేంద్రంలో నిర్వహించారు. స్థానికంగా ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించొద్దని కొందరు స్థానికులు తహసీల్దార్ గంగాధర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. గృహ సముదాయాల మధ్య ఉన్న శ్మశానవాటికలో ఆసిఫ్ మృతదేహాన్ని ఖననం చేయడంతో ఇరుగుపొరుగు ఇళ్ల వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమకు కూడా వ్యాధి వ్యాపిస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక.. కొందరు తమ ఇళ్లను ఖాళీ చేసి బంధువుల వద్దకు వెళ్తున్నారు.

 స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతుండడంతో అవగాహన కల్పించాల్సిన అధికారులు పత్తా లేకుండా పోయారు. ఆసిఫ్‌కు స్వైన్ ఫ్లూ సోకిందనే విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న చేవెళ్ల ఏరియా వైద్యాధికారి చెంచయ్య ఈనెల 13న మొయినాబాద్‌ను సందర్శించారు. ఆసిఫ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి నివారణ మాత్రలు అందజేశారు. వైద్యాధికారులు ఎటువంటి చర్యలు చే పట్టలే దు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందిం చాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement