పొలం కుదువపెట్టి..కాయకష్టం చేసినా.. | Sakshi
Sakshi News home page

పొలం కుదువపెట్టి..కాయకష్టం చేసినా..

Published Sat, Nov 15 2014 3:04 AM

పొలం కుదువపెట్టి..కాయకష్టం చేసినా.. - Sakshi

వారిద్దరూ వ్యవసాయాన్నే నమ్ముకున్నారు.. ఒకతను పరిస్థితులు అనుకూలించక ఉన్న పొలాన్ని కుదువపెట్టగా వచ్చిన కొద్దిపాటి డబ్బులు కుటుంబ అవసరాలకే సరిపోయాయి.. గత్యంతరంలేక భార్యాపిల్లల తో కలిసి వేరే ప్రాంతానికి వలస వెళ్లాడు.. అక్కడ కొంత పొలం కౌలుకు తీసుకునిపంట సాగు చేయగా సరైన దిగుబడి రాలేదు.. చివరకు తమకున్న పశువులను ఆసామి తీసుకోవడంతో మనోవేదనకు గురై తనువు చాలించాడు.. మరోచోట ఇంకో కౌలురైతు చేసిన అప్పలు తీర్చలేక కూతురికి పెళ్లిచేయలేక బలవన్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు వీధిన పడ్డారు.. వివరాలిలా ఉన్నాయి.
 
మన్ననూర్ / కొత్తకోట రూరల్ :  అమ్రాబాద్ మండలం మన్ననూర్‌కు చెందిన కడారి దుర్గయ్య యాదవ్ (45) సమీపంలో మూడెకరాల పొలం ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక దానిని మరొకరి వద్ద కుదువపెట్టగా కేవలం మూడు వేలు మాత్రమే వచ్చాయి. ఆ డబ్బులు కుటుంబ అవసరాలకే సరిపోయాయి. దీంతో ఏడాదిక్రితం తమకున్న 12 పశువులను తీసుకుని నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం తిమ్మాపూర్‌కు భార్యాపిల్లలతో కలిసి వలస వెళ్లాడు.

వ్యవసాయంపైనే ఆశలు పెట్టుకున్న అతను అక్కడి ఓ ఆసామి పంటకు పెట్టుబడి పెట్టేలా మాట్లాడుకుని 20 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. అందులో పత్తి సాగు చేశాడు. తన చేతికష్టమంతా ధారపోసినా పత్తి సమయానికి వర్షాలు కురియక పంటంతా దెబ్బతింది. చివరకు పెట్టుబడి కింద పశువులను ఆసామి తీసుకోవడంతో భార్యాపిల్లలతో కలిసి పది రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఆరుగాలం చేసిన కష్టంతో పాటు ఉన్న పశువులు కూడా పోవడంతో రోజూ మదనపడుతుండేవాడు.

ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు కుమారులు ఆరుబయట ఆడుకుంటుండగా, భార్య వెంకటమ్మ బియ్యం తేవడానికి చౌకధరల దుకాణం వద్దకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన అతను ఇంటి పైకప్పు సీలుకులకు ఉరివేసుకుని చనిపోయాడు. కొద్దిసేపటికి తిరిగొచ్చిన వారు గమనించి బోరుమన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏఎస్‌ఐ పెంటోజీ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని సర్పంచ్ నిమ్మలాశ్రీనివాసులు పరామర్శించి *వేలు ఆర్థికసాయం అందజేశారు.

మరో సంఘటనలో ఈ ఏడాది కొత్తకోట మండలం అమడబాకుల గ్రామపంచాయతీ పరిధిలోని సత్యహళ్లికి చెందిన శ్రీనివాసులు (45) సమీపంలో నాలుగెకరాలను కౌలుకు తీసుకున్నాడు. సుమారు *రెండు లక్షలు అప్పుచేసి అందు లో వరి సాగు చేశాడు. ఇటీవల తెగుళ్లు సోకడంతో క్రిమిసంహాకర మందులు చల్లి నా పంట ఎదుగుదలలో మార్పురాలేదు. ఈయనకు భార్య ఈశ్వరమ్మతో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

దీంతో చేసిన అప్పులు తీరకపోవడం, అమ్మాయి పెళ్లి ఎలా చేయాలని మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే ఈనెల 11వ తేదీ రాత్రి ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం అతను మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటా యి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ కృష్ణ కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement