ఇదేమి సహకారం? | Sakshi
Sakshi News home page

ఇదేమి సహకారం?

Published Fri, Sep 12 2014 12:32 AM

farmers concern on crop loans

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రతికూల పరిస్థితుల కారణంగా పంటలు నష్టపోయినప్పటికీ రైతులు పంట రుణాలు సకాలంలో చెల్లించారు. ఈ ఏడాది మార్చి 31లోపు బకాయిలు కట్టేశారు. ఇలా రైతుల ముక్కుపిండి రుణాలు వసూలు చేసిన సహకార బ్యాంకు అధికారులు వారికి తిరిగి పంట రుణం మంజూరు చేయడానికి ముఖం చాటేస్తున్నారు. ఖరీఫ్ పంట కాలం దగ్గర పడుతున్నప్పటికీ పైసా కూడా అప్పు మంజూరు కావడం లేదు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తించక, కొత్త రుణం కూడా దొరకక రైతులు నష్టపోతున్నారు.
 
ఇలా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పరిధిలోని అనేక మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చేసేదేమీ లేక రైతులు సాగు అవసరాల కోసం వడ్డీ వ్యాపారులను, ప్రైవేటు అప్పులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు అప్పులతో వడ్డీల భారం మీదపడి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇలాంటి బాధి త రైతులు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ఉన్నా రు. నిబంధనల ప్రకారం పంట రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు తిరిగి రుణం మంజూరు చేయాలి. పంటలు వేసుకునే సమయంలోనే అంటే మే మాసంలోనే ఈ రుణాలు ఇవ్వాలి. కానీ ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్న బ్యాంకు అధికారులు అన్నదాతల సంక్షేమాన్ని గాలికొదిలేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
 
కాగజ్‌నగర్ బ్రాంచ్ పరిధిలోనే రూ.1.01 కోట్లు
కాగజ్‌నగర్ డీసీసీబీ బ్రాంచ్ పరిధిలో దహెగాం, కౌటాల, సిర్పూర్, బెజ్జూరు, కొత్తపేట సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో సుమారు 421 మంది రైతుల నుంచి రూ.1.01 కోట్ల పంట రుణాలు ముక్కుపిండి వసూలు చేశారు. వీరికి మే నెలలోనే పంట రుణాలు మంజూరు చేయాలి. కానీ మరో నెల రోజుల్లో ఖరీఫ్ పంటలు చేతికందే తరుణం వస్తున్నప్పటికీ పైసా రుణం ఇవ్వలేదు.
 
మంచిర్యాల బ్రాంచ్ పరిధిలోని రైతుల వద్ద రూ.8 లక్షలు, చెన్నూరు బ్రాంచ్ పరిధిలోని రైతుల వద్ద రూ.18 లక్షలు, లక్సెట్టిపేట బ్రాంచ్ పరిధిలో మరో రూ.7 లక్షలు రైతుల వద్ద వసూలు చేశారు. కానీ వీరికి పైసా రుణం ఇచ్చిన దాఖలాల్లేవు.

బెల్లంపల్లి డీసీసీబీ బ్రాంచ్ పరిధిలోని రైతులదీ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. సుమారు 325 మంది రైతుల వద్ద రూ.1.20 కోట్లు వసూలు చేశారు. వీరందరికి తిరిగి రుణం ఇవ్వాల్సి ఉండగా, కొందరికి మాత్రమే కేవలం రూ.30 లక్షల రుణం ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది.
 
త్వరలోనే మంజూరు చేస్తాం..
- అనంత్‌కుమార్, డీసీసీబీ సీఈవో
సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు కొందరికి తిరిగి రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. ఈ విషయంలో కొంత స్పష్టత లోపించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కొద్ది రోజుల్లోనే పంట రుణాలను మంజూరు చేస్తాం.

Advertisement
Advertisement