చినుకు జాడేదీ? | Sakshi
Sakshi News home page

చినుకు జాడేదీ?

Published Fri, Jun 13 2014 11:52 PM

చినుకు జాడేదీ? - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొత్త రాష్ట్రంలో సరికొత్త ఆశలతో ముందుకెళ్తున్న కష్టజీవికి అప్పుడే ఇబ్బందులు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావ డంతో సాగు పనులకు సన్నద్ధమైన రైతుకు వరుణుడు ముఖం చాటేశాడు. సీజన్ మొదలై దాదాపు పక్షం రోజులు కావొస్తున్నా ఇప్పటివరకు తొలకరి పలకరించకపోవడంతో రైతన్న దిగాలు పడుతున్నాడు. ఈ సారి వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చేస్తున్న ప్రకటనలతో ఆందోళనలో పడ్డాడు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో రెండు లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక లు రూపొందించింది. దీంతో దుక్కులు దున్ని సాగుపనులకు సిద్ధమైన రైతుకు వాతావరణం కలిసిరావడంలేదు.
 
4.27సెంటీమీటర్ల లోటు వర్షపాతం
సాధారణంగా జూన్ నెల ప్రారంభం నుంచి వర్షాల ప్రభావం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈనెల సాధారణ వర్షపాతం 10.3 సెంటీమీటర్లు నమోదు కావాల్సి ఉంది. ఇందులో భాగంగా శుక్రవారం నాటికి 4.5సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అయితే జిల్లాలో ఇప్పటివరకు 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు కురిసిన వర్షపాతాన్ని పరిశీలిస్తే పట్టణ మండలాల్లోనే నమోదైనట్లు తెలుస్తోంది. ఉప్పల్, హయత్‌నగర్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, బాలానగర్, కుత్భుల్లాపూర్, మేడ్చల్ మండలాల్లో మోస్తరు వర్షాలు కురవగా.. మిగతా మండలాల్లో వరుణుడి కరుణ అంతంతమాత్రంగానే ఉంది.
 
ఆశలన్నీ ఈ సీజన్‌పైనే..
గత ఖరీఫ్‌లో విస్తారంగా పంటలు సాగయ్యాయి. సాధారణ విస్తీర్ణం కంటే అధికంగా 2.2 లక్షల హెక్టా ర్లలో పంటలు పండించారు. కానీ అధికవర్షాలు నష్టాన్నే మిగిల్చాయి. దిగుబడులు వచ్చే కీలక సమయంలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నష్టానికి సంబంధించి సర్కారు ఇప్పటివరకు పరిహారాన్ని సైతం విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో గత నష్టాన్ని ఈసీజన్‌లో పూడ్చుకోవాలని రైతులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు.
 
తాజా ఖరీఫ్ సీజన్లో రెండు లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేసి ఆ మేరకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే విత్తనాలు నాటాల్సి ఉండగా.. వర్షం జాడలేకపోవడంతో రైతులు విత్తు విత్తేందుకు జంకుతున్నారు. ఒకట్రెండురోజుల్లో వర్షాలు కురిస్తే తప్ప సాగు పనులు ముందుకు సాగేలా లేవు.

Advertisement
Advertisement