మా నోట్లో మట్టి కొట్టొద్దు | Sakshi
Sakshi News home page

మా నోట్లో మట్టి కొట్టొద్దు

Published Thu, Mar 22 2018 9:05 AM

Farmers Opposed To Bypass In Khammam - Sakshi

అన్నదాతకు పంట పొలమే జీవనాధారం.. వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నాం.. బైపాస్‌ రోడ్‌తో మా నోట్లో మట్టికొట్టొదంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. సత్తుపల్లి, వేంసూరు మండలాల రైతులు బుధవారం పట్టణంలోని నాలుగు కిలోమీటర్లు పాదయాత్రతో ప్రదర్శన నిర్వహించారు.  

సత్తుపల్లి : జాతీయ రహదారి విస్తరణలో విలువైన పంట భూములు కోల్పోతున్నామని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రైతు పేర్కొంటున్నారు. ఇప్పటికే సింగరేణి ఓపెన్‌ కాస్టు, లంకాసాగర్‌ ప్రాజెక్టు, బేతుపల్లి ప్రత్యామ్నాయ కాలువ నిర్మాణాలతో వేలాది ఎకరాల పంట భూములు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసినప్పుడు పంట భూముల విలువ నాకు తెలుసు.. సాధ్యమైనంత వరకు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని రైతులు వాపోతున్నారు.  

మహారాష్ట్ర తరహాలో ఆందోళన..   
ఎకరం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలున్న వ్యవసాయ భూములు దొరికే పరిస్థితి లేదు. వ్యవసాయం తప్పా ఇతర వృత్తులు తెలియవు. ఉన్న కొద్దిపాటి భూములను లాక్కొంటే మేమెట్లా బతకాలని ప్రశ్నిస్తున్నారు. వంద మీటర్ల వెడల్పుతో జాతీయ రహదారి విస్తరణలో భూములు తీసుకుంటున్నారు. వచ్చే రెండేళ్లల్లో గోదావరి జలాలు వస్తాయి.. పంట భూముల్లో సిరులు పండించుకుందామనుకుంటే మా భూములను స్వాధీనం చేసుకుంటే ఎలా అని నిలదీస్తున్నారు. ప్రత్యామ్నాయంగా మరో రెండు సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటే కొంత మేరకైనా నష్ట నివారణ జరగవచ్చని.. 32 కిలోమీటర్ల దూరం బైపాస్‌ నిర్మాణం చేయటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇటీవల అన్నదాతలు చేసిన ఆందోళన తరహాలో చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని రైతులు తెలిపారు.

రైతుల భూములు లాక్కోవద్దు..  
జాతీయ రహదారి బైపాస్‌రోడ్‌ నిర్మాణానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోండి. ఇప్పటికే చౌడవరంలో లంకాసాగర్‌ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయాం. జాతీయ రహదారి విస్తరణలో 67 ఎకరాలు పోతుంది. దీంట్లో నా భూమి మూడు ఎకరాలు ఉంది.   -చల్లా రామనర్సింహారెడ్డి,రైతు, చౌడవరం, వేంసూరు మండలం

అది ఉంటేనే బువ్వ..
నాకున్న ముప్పాతిక వ్యవసాయ భూమి జాతీయ రహదారికి పోతుంది. భూమి పోతే  కొనలేని పరిస్థితి ఉంది. ఇప్పటికి మూడు నాలుగు ప్లాన్లు చెప్పి.. మా భూముల్లోనే రోడ్డుకు తీసుకుంటే ఎలా? అది ఉంటేనే మాకు బువ్వ.  -లింగారెడ్డి సత్యనారాయణ,రైతు, సిద్ధారం, సత్తుపల్లి మండలం

Advertisement
Advertisement