చిరుధాన్యాల రైతుల్ని ప్రోత్సహించాలి | Sakshi
Sakshi News home page

చిరుధాన్యాల రైతుల్ని ప్రోత్సహించాలి

Published Tue, Oct 2 2018 2:28 AM

Farmers should be encouraged - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘వెనక్కి ప్రయాణిద్దాం, ప్రగతి సాధిద్దాం. మనిషి జీవనశైలి వందేళ్లు వెనక్కి వెళ్లాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన, శక్తిమంతమైన సమాజం తయారవుతుంది. ఆధునిక మానవుడు అనుసరించాల్సింది ఇదే. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఆ చర్యలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలి’’అని దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(డీడీఎస్‌) డైరెక్టర్‌ పీవీ సతీశ్‌ అన్నారు.

సోమవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాగి, జొన్నలు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాల రైతులకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. ‘చిరుధాన్యాల సేద్యానికి తక్కువ నీరు సరిపోతుంది. వరిసాగుకు పనికిరాని భూముల్లో కూడా ఇవి పండుతాయి, వాతావరణ సంక్షోభాన్ని తట్టుకుని మనుగడ సాగించే ఈ పంటలకు ప్రభుత్వం అండగా నిలిస్తే రాబోయే తరాలు ఆరోగ్యవంతంగా, శక్తిమంతంగా మారుతాయి’అని పేర్కొన్నారు. చిరుధాన్యాల సాగు పూర్తిగా సేంద్రియ వ్యవసాయమేనం టూ సిక్కిం మాదిరిగా తెలంగాణ ప్రభు త్వం కూడా ఒక విధానం ప్రకటించాలని సతీశ్‌ కోరారు.

‘చిరు’రేషన్‌ ఇవ్వండి
రేషన్‌ దినుసుల్లో చిరుధాన్యాలను చేర్చాలని సతీశ్‌ సూచించారు. జాతీయ ఆహారభద్రత చట్టం ప్రకారం ప్రతి రేషన్‌కార్డు మీద కనీసం ఏడు కిలోల చిరుధాన్యాలను పంపిణీ చేయాలని, ఇవి పోషకాహారలోపం తో బాధపడుతున్న వారికి వరం అవుతాయన్నారు. ఆయా రాజకీయ పార్టీల అనుబంధ రైతు సంఘాలు ముందుకు వస్తే చిరుధాన్యాలపై ప్రభుత్వాలు స్పందిస్తాయని దిశ సంస్థ నిర్వాహకులు సత్యనారాయణరాజు అన్నారు.

‘ఇప్పుడు సమాజాన్ని పీడిస్తున్న డయాబెటిస్‌ వంటి వ్యాధులకు దూరంగా ఉండడానికి చిరుధాన్యాలు ఎంతో దోహదం చేస్తాయనే చైతన్యం చాలామందిలో వచ్చింది. అయితే, వాటిని రోజూ ఉడికించి తినడానికి మొహం మొత్తడంతో ఆపేస్తున్నారు. అందుకోసమే పోషకాహార నిపుణులను సంప్రదించి చిరుధాన్యాలను ఎన్నిరకాలుగా వండవచ్చనే అంశం మీద డీడీఎస్‌ పరిశోధించింది. రాగి, జొన్నలు, కొర్రలు, సామలుతో నలభై రకాల వంటకాలను రూపొందించింది’అని సతీశ్‌ చెప్పారు.

ఈ సందర్భంగా తినడానికి సిద్ధంగా(రెడీ టు ఈట్‌) జొన్న, రాగి, సజ్జ మురుకులు, కారప్పూస, కొర్ర బూందీ, గవ్వలు, పప్పు చెక్కలు, జొన్న అటుకుల లడ్డు, కారం కాజాలు, రాగి లడ్డు, జొన్న లడ్డు వంటి సంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు.

Advertisement
Advertisement