అన్నదాతల వద్దకొచ్చి అప్పులివ్వాలి | Sakshi
Sakshi News home page

అన్నదాతల వద్దకొచ్చి అప్పులివ్వాలి

Published Wed, Jul 19 2017 1:11 AM

అన్నదాతల వద్దకొచ్చి అప్పులివ్వాలి - Sakshi

బ్యాంకర్లే రైతులనడిగే రోజులు రావాలి
అదే నా కల.. నెరవేరి తీరుతుంది: కేసీఆర్‌


► వ్యవసాయ, రెవెన్యూ శాఖలపై సమీక్ష
► రైతు సంఘాల ఏర్పాటు.. విధివిధానాలు ఖరారు
► భూ రికార్డుల నిర్వహణకు కూడా  గ్రామస్థాయిలో 11 మందితో రైతు సమన్వయ సమితి
► పంట ధరల నిర్ణయంలో మండల కమిటీయే కీలకం
► అవసరమైతే రాష్ట్ర కమిటీ జోక్యం.. నేరుగా కొనుగోలు
► ప్రభుత్వ గ్యారంటీతో రూ.10 వేల కోట్లు సమకూరుస్తాం
► వ్యవసాయ భూముల రికార్డుల కోసం స్పెషల్‌ డ్రైవ్‌ లెక్క తేలాక కొత్త పాస్‌ పుస్తకాలు


సాక్షి, హైదరాబాద్‌
మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రైతులు కష్టాల్లోనే ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవేదన వెలిబుచ్చారు. సమైక్య రాష్ట్రంలో వివక్ష, నిర్లక్ష్యాల వల్ల తెలంగాణ రైతులు మరింత చితికిపోయారన్నారు. ‘‘మన రాష్ట్రంలో రైతులే ప్రధానం. వారి కోసం ఒక్కో పని చేసుకుంటూ పోతున్నం. రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసినం. త్వరలోనే 24 గంటల విద్యుత్, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, వచ్చే ఏడాది నుంచి ఎకరాకు ఎనిమిది వేల పెట్టుబడి, గిట్టుబాటు ధర , మార్కెట్‌ డిమాండ్‌ తదితరాల కోసం చర్యలు తీసుకుంటున్నం. ఫలితంగా రైతుల బతుకులు బాగుపడుతయని నమ్ముతున్న. ఇవన్నీ జరిగి ఐదేళ్లు గడిచాక, బ్యాంకులే రైతుల ఇండ్ల ముందు నిలబడి ‘అప్పులిస్తాం’అనే పరిస్థితి వస్తుంది. ఇది నేను కంటున్న కల. తప్పక నిజమై తీరుతది’’అని ఆయన ధీమా వెలిబుచ్చారు.

రైతు సంఘాల ఏర్పాటు, భూ రికార్డుల సక్రమ నిర్వహణ తదితరాలపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతు సంఘాల ఏర్పాటుకు సంబంధించి ఈ సందర్భంగా విధివిధానాలు ఖరారు చేశారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మెదక్, పాలమూరు జిల్లాల్లో ఇప్పటికే మార్పు వచ్చిందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ‘హైదరాబాద్‌కు వలస వచ్చిన వారంతా రేషన్‌ కార్డులు వాపస్‌ చేసి సొంత జిల్లాలకు వెళ్తున్నారు. ఇది నాకెంతో సంతృప్తినిచ్చింది’అని వ్యాఖ్యానించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌లతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

రైతు సంఘాల ఏర్పాటు విధివిధానాలివే:
రెవెన్యూ గ్రామానికో రైతు సంఘం ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతును సభ్యుడిగా చేర్చి 11 మందితో గ్రామ రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ, మహిళా రైతులకు ప్రాతినిధ్యం ఉంటుంది. గ్రామాల్లోని అన్ని సమితులను కలిపి మండల సమాఖ్య, ఆ తర్వాత జిల్లా, రాష్ట్ర సమాఖ్యలను ఏర్పాటు చేస్తారు.

గ్రామ రైతు సమితులు ప్రతి రైతుతోనూ బ్యాంకు ఖాతా తెరిపించాలి. వ్యవసాయ అధికారులకు ఇచ్చిన ఈ బ్యాంకు ఖాతాల్లో హైదరాబాద్‌ నుంచే ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది. రైతులు ఎవరికీ దరఖాస్తు చేయాల్సిన, ఎవరినీ కలవాల్సిన అవసరం ఉండదు.

మార్కెట్లోని అడితీదారులతో సంప్రదింపుల ద్వారా పంటల ధరలను నిర్ణయించడంలో మండల రైతు సమాఖ్య ప్రధాన భూమిక నిర్వహిస్తుంది. ఆ తర్వాతే మార్కెట్‌కు ఉత్పత్తులు వస్తాయి. గిట్టుబాటు ధర కోసం అవసరమైతే రాష్ట్ర సమాఖ్య జోక్యం చేసుకుంటుంది. నేరుగా పంటను కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం రాష్ట్ర రైతు సంఘానికి బడ్జెట్లోనే రూ.500 కోట్ల మూల నిధి కేటాయిస్తారు. ప్రభుత్వ గ్యారంటీతో రూ.10 వేల కోట్లను రాష్ట్ర రైతు సంఘం సమకూర్చుకుంటుంది. ప్రభుత్వ అనుమతితో ఆ పంటలను ప్రాసెస్‌ చేసి రాష్ట్ర రైతు సంఘమే విక్రయిస్తుంది.

భూ రికార్డుల నిర్వహణ విధివిధానాలు:
దేశంలో మరెక్కడా లేనివిధంగా వచ్చే నెలలో భూ రికార్డుల కోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలి. తెలంగాణలోని ప్రతి ఇంచు భూమి లెక్కా సరిచేయాలి. స్పెషల్‌ డ్రైవ్‌ కోసం అవసరమైతే 15 వేల మంది నిరుద్యోగ యువకులను నెలకు రూ.20 వేల వేతనమిచ్చి పనిచేయిస్తారు. ఇందుకు ప్రతి జిల్లాకూ ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయిస్తారు.

గ్రామంలో ఎంత భూమి (విలేజ్‌ ఆబాది), ఎవరి పేరిట ఉందో డ్రైవ్‌లో తేలుస్తారు. ఈ వివరాలన్నింటినీ గ్రామ ముఖ్య కూడలి వద్ద ప్రదర్శిస్తారు. వివాదాల్లేని భూములను తక్షణం, మిగతా వాటిని విచారణ తర్వాత ఏ రైతువో ప్రకటిస్తారు. భూ రికార్డులు సరిచేసేందుకు గ్రామ రైతు సంఘాలే వేదిక. వాటి సమక్షంలో భూమి వివరాలు సేకరణ, రికార్డులలో నమోదు జరుగుతాయి.

ఏ భూమి ఎవరిదో తేలాక కొత్తగా పాస్‌ పుస్తకాలిస్తారు. ప్రతి రైతుకూ, పాస్‌ పుస్తకానికి యూనిక్‌ కోడ్‌ ఇస్తారు. ఆ వివరాలన్నీ కంప్యూటర్‌లో నమోదు చేస్తారు. ఈ సరిచేసిన వివరాల ఆధారంగానే ఎకరాకు రూ.8 వేల పెట్టుబడి పథకం అమలవుతుంది. భూ రికార్డులన్నీ సరి చేశాక ప్రకటించిన జాబితానే ప్రభుత్వానికి పంపుతారు. ఏ రైతు వద్ద ఎంత భూమి ఉందన్న దాని ప్రకారమే బ్యాంకులో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది.

భూమి కొన్నా, అమ్మినా వివరాలను సంబంధిత ఎమ్మార్వోకు, గ్రామ రైతు సంఘానికి తెలియచేయాలి. ఆ తర్వాతే రిజిస్టర్‌ చేయాలి. ఈ ప్రక్రియంతా నాలుగు రోజుల్లో పూర్తి కావాలి. రిజిస్టరైన తర్వాత 15 రోజుల్లో మ్యుటేషన్‌ (పేరు మార్పిడి) జరగాలి. అంతే సమయంలో పాస్‌ పుస్తకాలూ సిద్ధం కావాలి. క్రయ విక్రయాల వివరాలను పాస్‌ పుస్తకాల్లో పొందుపరచాలి. రిజిస్టర్‌ కాగితాలు, పాస్‌ పుస్తకాలను నేరుగా రైతుల ఇంటికే కొరియర్‌లో పంపాలి. ఇదంతా నిర్ణీత సమయంలో పూర్తి చేయకుంటే సంబంధిత అధికారికి ఆలస్యపు రుసుం విధిస్తారు. రైతు సంఘాల నిర్మాణం, భూ రికార్డుల స్పెషల్‌ డ్రైవ్‌పై అవగాహనకు కొద్ది రోజుల్లోనే హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తారు. జిల్లాల నుంచి ప్రతినిధులను పిలిపిస్తారు. సీఎంతో పాటు వ్యవసాయ మంత్రి, అధికారులు పాల్గొంటారు.

Advertisement
Advertisement