ఫెరల్ పిగ్స్ దాడి | Sakshi
Sakshi News home page

ఫెరల్ పిగ్స్ దాడి

Published Sun, Sep 28 2014 12:39 AM

ఫెరల్ పిగ్స్ దాడి - Sakshi

  • శివ్‌పూర్‌లో సిటీ హంటర్
  •  పందుల స్వైరవిహారం
  •  క్షతగాత్రుల్లో స్థానికులు, చిన్నారులు
  •  వేటాడాలని ఆదేశించిన అక్కడి హైకోర్టు
  • సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని శివ్‌పూర్ పట్టణ ప్రజలకు ఫెరల్ పిగ్స్ రూపంలో కొత్త ముప్పు వచ్చింది. వేల సంఖ్యలో పుట్టుకు వచ్చిన అడవి పంది జాతికి చెందిన ఈ జంతువుల దాడిలో పట్టణానికి చెందిన పెద్దలు, చిన్నారులు గాయపడ్డారు. వీటన్నింటికీ మించి ఈ పిగ్స్ కారణంగా ఆ ప్రాంతంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రబలడంతో విషయం హైకోర్టు వరకు వెళ్లింది. తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఫెరల్ పిగ్స్ వేటకు ఆదేశించింది. దీంతో హైదరాబాద్‌కు చెందిన లెసైన్స్‌డ్ హంటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ రంగంలోకి దిగారు.

    ఆరుగురు సభ్యులతో ఆపరేషన్ ప్రారంభించిన ఆయన గురు, శుక్ర, శనివారాల్లోనే 588 ఫెరల్ పిగ్స్‌ను హతమార్చారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 13 మ్యానీటర్లను వేటాడిన అనుభవం ఉన్న షఫత్ అలీ ఖాన్ శనివారం ‘సాక్షి’తో ఫోనులో మాట్లాడుతూ తాజా ఆపరేషన్ పూర్వాపరాలను తెలిపారు. శివ్‌పూర్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో మాదేవ్ నేషనల్ పార్క్ ఉంది. ఆ అరణ్యంలోని అడవి పందులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి సమీప గ్రామాల్లోని పెంపుడు పందులతో సంపర్కానికి పాల్పడ్డాయి. ఈ కారణంగా ఫెరల్ పిగ్స్ అనే జంతువులు పుట్టుకు వచ్చాయి.

    గడిచిన ఐదేళ్లలో వీటి సంతతి 15 నుంచి 20 వేల వరకు చేరింది. కాలక్రమంలో ఇవి శివ్‌పూర్ పట్టణం, శివార్లలోకి పెద్ద సంఖ్యలో ప్రవేశించాయి. ఒంటరిగా సంచ రించేపెద్దలు, పాఠశాలలకు వెళ్లే చిన్నారులపై వరుస దాడులకు పాల్పడుతున్నాయి. వీటన్నింటికీ మించి ఈ ఫెరల్ పిగ్స్ కారణంగా శివ్‌పురి పరిసరాల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి వ్యాపిస్తోంది. ఈ దుష్పరిణామాలకు ఫెరల్ పిగ్స్ కారణమని, తక్షణం నియంత్రించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శివ్‌ఫూర్‌కు చెందిన డాక్టర్ రాజేందర్ గుప్తా మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

    ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం లెసైన్స్‌డ్ హంటర్ సాయంతో వేల సంఖ్యలో ఉన్న ఆ జంతువులను మట్టుబెట్టాల్సిందిగా నాలుగు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి నుంచి అనుభవజ్ఞుడైన హంటర్ కోసం ఆరా తీసిన అక్కడి ప్రభుత్వం గత ఆదివారం హైదరాబాద్‌కు చెందిన నవాబ్ షఫత్ అలీ ఖాన్‌ను శివ్‌పూర్‌కు ఆహ్వానించింది. ఫెరల్ పిగ్స్‌ను సమూలంగా అంతమొందించాలని కోరుతూ ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించింది. ఆరుగురు సభ్యుల బృందంతో గురువారం నుంచి వేట ప్రారంభించిన షఫత్ అలీ ఖాన్ రెండు రోజుల్లో 588 ఫెరల్ పిగ్స్‌ను అంతమొందించారు.

    ఇంత భారీ సంఖ్యలో జంతువులను హతమార్చాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడం, వాటిని వేటాడటం దేశంలోనే ఇది తొలిసారని నవాబ్ ‘సాక్షి’కి తెలిపారు. చంపిన ఫెరల్ పిగ్స్‌ను అక్కడి ప్రభుత్వసిబ్బంది పొక్లయిన్‌ల ద్వారా ఎత్తి, టిప్పర్లతో పట్టణ శివార్లలోని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి ఖననం చేస్తున్నారని వివరించారు. ఈ ఆపరేషన్ దాదాపు నెల రోజుల పాటు సాగే అవకాశం ఉందని చెప్పారు.
     

Advertisement
Advertisement