ఎరువుల ధరలు పెరగవు.. | Sakshi
Sakshi News home page

ఎరువుల ధరలు పెరగవు..

Published Thu, May 21 2015 2:42 AM

ఎరువుల ధరలు పెరగవు.. - Sakshi

- ఈ ఏడాదిలో 3వేల జెనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు
- వరంగల్‌లో కాటన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తా
- వచ్చే నెలలో కాజీపేట నుంచి  ముంబై ప్రత్యేక రైలు
- కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారామ్ అహిర్
పోచమ్మమైదాన్ :
బీజేపీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా లక్ష్యంతో ముందుకు సాగుతోందని, ఇందులో భాగంగానే దేశంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు  కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి హన్సరాజ్ గంగారామ్ అహిర్ తెలిపారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎనిమిది ఎరువుల ఫ్యాక్టరీలు మంజూరు చేశామని, ఇందులో ఒకటి తెలంగాణలోని రామగుండంలో పునఃప్రారంభిస్తున్నామని, దీంతో రానున్న నాలుగేళ్లు ఎరువుల ధరలు పెరగవని పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని వెంకటేశ్వరగార్డెన్‌లో  వరంగల్ మహానగర ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా బీజేపీ పోరుసభ బుధవారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా హన్సరాజ్ గంగారామ్ అహిర్ హాజరై మాట్లాడారు. జనస్తుతి పథకంలో భాగంగా ఈ సంవత్సరం ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద 3వేల జనరిక్ మెడికల్ షాపులు, రానున్న మూడు సంవత్సరాల్లో 55 వేల జెనరిక్ మెడికల్ షాపులను ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన కోల్ స్కామ్ వెలికితీయడం ద్వారా దేశానికి రూ.2లక్షల కోట్లు కలిసి వచ్చాయన్నారు. హైదరాబాద్‌లో ఐటీ పార్క్, రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ, వరంగల్‌లో కాటన్ పరిశ్రమ ఏర్పాటుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని అధిక మెజార్టీతో గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుందన్నారు. వచ్చే నెలలో కాజీపేట నుంచి ముంబైకి ప్రత్యేక రైలును ప్రారంభిస్తామన్నారు.

గవర్నర్ సమాధానం చెప్పాలి..
టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని, ఇది పార్టీ ఫిరాయింపు చట్టం పరిధిలోకి రాదా అనే దానిపై గవర్నర్ సమాధానం చెప్పాలన్నారు. అన్ని మాఫియాలకు కేరాఫ్‌గా టీఆర్‌ఎస్ పార్టీ మారిందన్నారు. ఓయూ భూములను లాక్కోవడంపై మాట్లాడిన విద్యార్థులను అవమాన పరుస్తున్నారని ధ్వజమెత్తారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛహైదరాబాద్‌ను కేసీఆర్ మొదలుపెట్టారని విమర్శించారు. మిషన్ కాకతీయ ఎంత ఫలితాలు ఇస్తాయో ఇంకా తెలియాల్సి ఉందన్నారు. వరంగల్‌లో నాలుగురోజుల  ఉన్న సీఎం కనీసం రూ.నాలుగు లక్షల అభివృద్ధి పనులనైనా చేయలేదని విమర్శించారు. ప్రజాసమ్యలపై వినతిపత్రాలు ఇచ్చేందుకు సీఎం అపాయింట్‌మెంట్ అడిగితే నెలలు గడిచినా ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు చాడ శ్రీనివాస్ రెడ్డి నగర సమస్యలపై తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈసభలో  బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మారావు, జిల్లా ఇన్‌చార్జి కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మాందాటి సత్యనారాయణరెడ్డి, వన్నాల శ్రీరాములు, నాయకులు రావు పద్మ, విజయలక్ష్మి, వంగాల సమ్మిరెడ్డి, దొంతి దేవేందర్‌రెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, విజయ్‌చందర్‌రెడ్డి, బొడిగె గట్టయ్య, మాచర్ల సాంబయ్య, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, నాగపురి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement