రేక్‌ పాయింట్‌ వచ్చేనా? | Sakshi
Sakshi News home page

రేక్‌ పాయింట్‌ వచ్చేనా?

Published Sun, Aug 25 2019 9:56 AM

Fertilizer Rake Point At Akanapet Railway Station In Medak District - Sakshi

సాక్షి, రామాయంపేట: రైతన్నలకు మరింతగా ఎరువులను అందుబాటులోకి తీసుకురావడానికి గాను రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా తొమ్మిది రేక్‌పాయింట్ల ఏర్పాటుకై వ్యవసాయశాఖ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా  రామాయంపేట మండలంలోని అక్కన్నపేట రైల్వేస్టేషన్‌లో రేక్‌ పాయింట్‌ ఏర్పాటు కోసం రెండేళ్లక్రితమే ఆ శాఖ స్టాండింగ్‌ కమిటీకి ప్రతిపాదనలు పంపించింది. జిల్లాలో ముఖ్య కూడలిలో ఉన్న అక్కన్నపేట రైల్వేస్టేషన్‌లో రేక్‌ పాయింట్‌ ఏర్పాటుచేస్తే అన్ని విధాలుగా అనువుగా ఉంటుంది. ఇక్కడి రేక్‌ పాయింట్‌ను అర్థాంతరంగా ఎత్తివేశారు. ఇక్కడ రేక్‌పాయింట్‌ కొనసాగిన సమయంలో ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎరువుల సరఫరా జరిగిందని, స్టేషన్‌లోని షెడ్డులో ఎరువుల స్టాక్‌ దించి జిల్లాలో ఇతర ప్రాంతాలకు సరఫరా చేశారని అధికారులు తెలిపారు.

గతంలో నిర్మించిన పెద్ద షెడ్డు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల సరఫరాకు గాను ప్రస్తుతం ఉన్న తొమ్మిది రేక్‌ పాయింట్లతోపాటు మరో అదనంగా మరో తొమ్మిదింటిని ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు గతంలోనే పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి సిఫారసు చేశారు. జిల్లాలోని అక్కన్నపేటతోపాటు బీబీనగర్, మహబూబాబాద్, నల్లగొండ, భూపాలపల్లి, ఉప్పల్, కొత్తగూడెం, వికారాబాద్, బాసరలో రేక్‌ పాయింట్లను ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖవారు ప్రతిపాదనలు పంపారు.

రేక్‌పాయింట్‌ ఏర్పాటైతే...
అక్కన్నపేటస్టేషన్‌లో రేక్‌పాయింట్‌ ఏర్పాటైతే రైళ్లలో నేరుగా పరిశ్రమల నుంచి స్టేషన్‌కు ఎరువుల బస్తాలు వస్తాయి. దీంతో ఇక్కడ స్టాక్‌పెట్టి జిల్లాపరిధిలో అవసరమైన పట్టణాలకు, గ్రామాలకు సరఫరా చేస్తారు. సకాలంలో రైతులకు ఎరువులు అందడంతోపాటు ఖర్చు తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. అక్కన్నపేట స్టేషన్‌లో రేక్‌ పాయింట్‌ ఏర్పాటు చేస్తే ఈప్రాంతం అభివృద్ధి సాధిస్తుందని, తద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖవారు పలుమార్లు శిథిలమైన గోదాంను పరిశీలించారు. నాలుగైదు నెలల్లో రేక్‌పాయింట్‌ ఏర్పాటుకై ఆదేశాలు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

సీఎం సుముఖత
అక్కన్నపేట రైల్వేస్టేషన్‌వద్ద రేక్‌ పాయింట్‌ ఏర్పాటుకోసం పలుమార్లు కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ ఉన్నతాధికారులకు విన్నవించాం. ఈ మేరకు సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంద్రానికి సిఫారసు చేశారు. ఈ స్టేషన్‌నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు, సమీపంలో ఉన్న జిల్లాలకు ఎరువులు, సిమెంట్, తదితర సామగ్రి తరలించడానికి అనుకూలంగా ఉంటుంది.  – పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్‌ 

రేక్‌పాయింట్‌ ఏర్పాటు చేయాలి
జిల్లా వ్యాప్తంగా అన్నివిధాలుగా అందుబాటులో ఉన్న అక్కన్నపేట రైల్వేస్టేషన్‌లో రేక్‌ పాయింట్‌  ఏర్పాటు చేయాలి. గతంలో ఇక్కడ రేక్‌ పాయింట్‌ ఉండేది. ఈ మేరకు పెద్ద షెడ్డుకూడా సిద్ధంగా ఉంది. అవసరమైతే అదనపు సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కృషిచేస్తాం. ఇది ఏర్పాటుచేస్తే రైతులకు ఎంతోమేలుగా ఉంటుంది. వ్యవసాయరంగానికే కాకుండా వ్యాపారానికి సంబంధించి ఉత్పత్తులు సరఫరా చేసుకోవచ్చు.
– ముస్కుల స్రవంతి,  వైస్‌ఎంపీపీ, రామాయంపేట

Advertisement
Advertisement