Sakshi News home page

‘ఫీల్డ్ అసిస్టెంట్’ మృతితో ఉద్రిక్తత

Published Thu, Jul 9 2015 11:43 PM

'Field Assistant' after the death of tension

నవాబుపేట : ఓవైపు ఉపాధిహామీ సిబ్బంది సమ్మె నేపథ్యంలో.. ఫీల్డ్ అసిస్టెంట్ గుండెపోటుతో మృతి చెందడంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉపాధి సిబ్బంది పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరే ఆయన మృతికి కారణమని ఉపాధి సిబ్బంది సంఘాలు భగ్గుమన్నాయి. మృతదేహంతో బంధువులు ధర్నా చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న ఈ సంఘటన మండల పరిధిలోని యావాపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, స్థాని కుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్ల రాంచంద్రయ్య(40) స్థానికంగా ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్.

ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి సిబ్బంది 23 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈక్రమంలో బుధవారం సాయంత్రం వరకు నవాబుపేటలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన సమ్మెలో ఆయన పాల్గొన్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్లిన రాంచంద్రయ్య రాత్రి కుటుంబీకులతో కలిసి భోజనం చేసి నిద్రించాడు. గురువారం ఉదయం 6 గంటలకు ఆయన భార్య లలిత  నిద్రలేచింది. ఆమె భర్తను నిద్ర లేపడానికి యత్నించగా రాంచంద్రయ్యలో స్పందన లేదు.

పరిశీలించగా అప్పటికే ఆయన మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి సిబ్బంది యావాపూర్ చేరుకున్నారు. తహసీల్దార్ యాదయ్య, ఎంపీడీఓ తరుణ్‌లు ఆర్థిక సాయంగా రూ.10 వేలు మృతుడి కుటుంబీకులకు ఇవ్వగా వారు తిరస్కరించారు.  ఈ పది వేలతో మా కుటుంబానికి ఒరిగేదేమి లేదని చెప్పారు. ప్రభుత్వం ఉపాధిహామీ సిబ్బందిపై ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరితో రాంచంద్రయ్య కు గుండెపోటు వచ్చి మృతిచెందాడని ఉపాధి హామీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదు ట ధర్నా చేసేందుకు మృతదేహాన్ని డీసీఎం వ్యాన్‌లో ఎక్కించారు. 

విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీనివాస్ సిబ్బం దితో కలిసి అడ్డుకున్నారు. ధర్నాతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పారు. ధర్నా చేయాలనుకుంటే గ్రామంలో చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఆందోళన చేస్తామని మృతుడి బంధువులు, స్థానికులు భీష్మించడంతో ఉద్రిక్తత నెల కొంది. పోలీసులు సర్దిచెప్పడంతో ధర్నా యత్నాన్ని విరమించారు. రాంచంద్రయ్యకు భార్య లలిత, కూతురు పార్వతి(డిగ్రీ), కుమారుడు మహేష్(9 వ తరగతి) ఉన్నారు.  

 కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి..
 మృతుడు రాంచంద్రయ్య కుటుంబానికి ఉపాధిహామీ చట్ట ప్రకారంగా 15 రోజుల్లో నష్టపరిహారం చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ఉపాధిహామీ సిబ్బంది సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు అంజిరెడ్డి డిమాండు చేశారు. 23 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.  

 ప్రభుత్వం ఆదుకుంటుంది..
 రాంచంద్రయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. ఆయన మృతుడి కుటుంబీకులను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాంచంద్రయ్య మృతి బాధాకరమని చెప్పారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, అశోక్, వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement