మా నీళ్లు మాకే కావాలి | Sakshi
Sakshi News home page

మా నీళ్లు మాకే కావాలి

Published Tue, May 20 2014 11:43 PM

మా నీళ్లు మాకే కావాలి - Sakshi

 మంజీర ముంపు గ్రామ వాసుల పోరాటం

 సాక్షి, సంగారెడ్డి: మా నీళ్లు.. మా నిధులు.. మా ఉద్యోగాలు మాకే కావాలని ఆరు దశాబ్దాలుగా పోరాడిన నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కల సాకారమవుతున్న తరుణమిది. మరికొన్ని రోజుల్లోనే తెలంగాణ ఏర్పాటు కాబోతున్న సమయంలో.. మా నీళ్లు మాకే కావాలని పల్లెలు నినదిస్తున్నాయి. దశాబ్దాలుగా సరఫరా అవుతున్న తాగునీటిని ‘హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్(హెచ్‌ఎండబ్ల్యూఎస్)’ యంత్రాంగం నియంత్రించి ఆ పల్లె ప్రజల గొంతులను నొక్కేసింది.

దీంతో మా నీళ్లు మాకే కావాలని అక్కడి ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు. మంజీర డ్యాం కింద కలబ్‌గూరు, అంగడిపేట గ్రామాలు సర్వం కోల్పోయాయి. ఈ డ్యాం నిర్మాణం కోసం సుమారు వెయ్యి ఎకరాల పంట పొలాలను ఇక్కడి రైతులు ధారాదత్తం చేశారు. మూడు దశాబ్దాల కింద రైతుల నుంచి అత్యంత చౌకగా భూములు కొట్టేసిన నాటి ప్రభుత్వం ఇక్కడ డ్యాం నిర్మించింది.
 
 ఏ డ్యాం కోసమైతే నాడు భూములను ధారాదత్తం చేశారో అదే డ్యాం నీళ్ల కోసం ఉద్యమిస్తున్నారు ఆ గ్రామస్థులు. మంజీర డ్యాం నుంచి జంట నగరాలకు హెచ్‌ఎండబ్ల్యూఎస్ తాగు నీటిని తరలిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేసే పైప్‌లైన్ల ద్వారానే జిల్లా పరిధిలోని కలబ్‌గూరు, కంది, పోతిరెడ్డిపల్లి, చిట్కూల్, ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రారం, లక్డారం, పోచారం గ్రామాలకు హెచ్‌ఎండబ్ల్యూఎస్ తాగునీటిని సరఫరా చేస్తోంది. ఆయా గ్రామ పంచాయతీలు, హెచ్‌ఎండబ్ల్యూఎస్ మధ్య ఏళ్ల కింద ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల మేరకు దశాబ్దాలుగా సరఫరా అవుతున్న నీళ్లను హెచ్‌ఎండబ్ల్యూఎస్ యాజమాన్యం మూడు రోజుల కింద కుదించింది.

ప్రధాన పైప్‌లైన్‌ల నుంచి ఈ గ్రామాలకు నీళ్లను తరలించే పైప్‌లైన్‌కు మీటర్లు బిగించి..ఆ మీటర్ల ఆధారంగా నీటి సరఫరాను సగానికి తగ్గించేసింది. దీంతో ఈ గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ప్రధానంగా కలబ్‌గూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కలబ్‌గూరు, అంగడిపేట, గంజిగూడెం గ్రామాల్లో నీరు రాక జనం అల్లాడుతున్నారు.  2011 జనాభా లెక్కల ఆధారంగానే ఈ గ్రామాలకు నీటి సరఫరాను కుదించాలని జిల్లా పరిషత్ సీఈఓ ఆశీర్వాదం ఇచ్చిన లేఖ ఆధారంగానే నీటి సరఫరాలో కోత విధించినట్లు హెచ్‌ఎండబ్ల్యూఎస్ జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. గతంలో కలబ్‌గూరు పంచాయతీకి రోజూ 500 కిలో లీటర్ల నీటిని సరఫరా చేయగా.. ప్రస్తుతం 207 కిలో లీటర్లకు కుదించడంతో ఈ సమస్య తలెత్తింది. వ్యక్తికి 135 లీటర్ల నీటి చొప్పున లెక్కేసి 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ గ్రామాలకు నీటి కోటాను నిర్ణయించినట్లు హెచ్‌ఎండబ్ల్యూఎస్ పేర్కొంటోంది.
 
 నీటి సరఫరా చేసినా పంచాయతీలు ఏళ్ల తరబడి తమకు చార్జీలు చెల్లించడం లేదని వాదిస్తోంది. అయితే, హెచ్‌ఎండబ్ల్యూఎస్ సైతం తమ పంచాయతీకి ఎన్నడూ వాణిజ్య పన్ను చెల్లించలేదని కలబ్‌గూరు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మంగళవారం ఆ గ్రామ పెద్దలు జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రవికుమార్‌లను జెడ్పీ కార్యాలయంలో కలుసుకుని చర్చలు జరిపారు. ఆశీర్వాదం హెచ్‌ఎండబ్ల్యూఎస్ జీఎం ప్రవీణ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి కలబ్‌గూరుకు నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. అయినా.. సమస్య పరిష్కారం కాకపోవడంతో తమ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉన్న హెచ్‌ఎండబ్ల్యూఎస్ అధికారులతో తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమవుతున్నారు.
 
 బీరు కంపెనీలకు నీరు..  
 మంజీర నీటికి ఉన్న క్రేజ్‌ని సొమ్ము చేసుకునేందుకు మండల పరిధిలోని బీర్లు, శీతల పానీయాల ఉత్పత్తి పరిశ్రమలు వెలిశాయి. దీనికి హెచ్‌ఎండబ్ల్యూఎస్ విచ్చలవిడిగా నీటిని సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఒక వేళ ఇంటెక్ వెల్ వద్ద సమస్యలు ఉత్పన్నమైతే అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా ఈ పరిశ్రమలకు నీళ్లను అమ్ముకుంటున్న హెచ్‌ఎండబ్ల్యూఎస్.. సర్వం ధారపోసిన కలబ్‌గూరు గ్రామ పంచాయతీకి మాత్రం నీటి సరఫరాలో కోతలు విధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హెచ్‌ఎండబ్ల్యూఎస్ యంత్రాంగం ఫక్తు వ్యాపార ధోరణితో వ్యవహరిస్తూ మండు వేసవిలో తమకు నీళ్లు ఇవ్వక ఇబ్బంది పెడుతున్నారని పల్లె ప్రజలు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement