కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోరు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోరు

Published Mon, Apr 14 2014 3:28 AM

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోరు - Sakshi

  •      కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోరు
  •      దొంతి రాజీనామాతో ఖాళీ
  •      జిల్లా పీఠంపై పలువురు నేతల దృష్టి
  •      ఎన్నికల వేళ పొన్నాలకు తప్పని తలనొప్పి
  •  సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో పెద్ద చిక్కే వచ్చిపడింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన పొన్నాల లక్ష్మయ్య ఉన్నా... జిల్లా స్థారుులో ఆ పార్టీ సమన్వయ బాధ్యతలు చూసే అధ్యక్షుడు లేకుండాపోయారు. నర్సంపేట టికెట్ ఇచ్చి వెనక్కి తీసుకున్నందుకు నిరసనగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి దొంతి మాధవరెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ రంగంలో ఉండడంతో తక్షణం డీసీసీ పీఠాన్ని కాంగ్రెస్‌లోని ఇతర నేతలకు అప్పగించాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది.  

    పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఆయన నిర్ణయం ప్రకారమే డీసీసీ చీఫ్‌ను నియమించనున్నారు. ఎన్నికల తరుణంలో డీసీసీ పదవిని పొన్నాల ఎవరికి కట్టబెడతారనేది ఆ పార్టీలో ఆసక్తికరంగా మారింది. సాధారణ ఎన్నికల్లోపే నియూమక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిసింది. వరంగల్ డీసీసీ చీఫ్ తరహాలోనే ఖమ్మం డీసీసీ అధ్యక్ష పదవి ఖాళీ అయింది. కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అధ్యక్షులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ జిల్లాలకు సైతం కొత్త అధ్యక్షులను నియమించే అవసరం ఉన్నందున... వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం.
     
    పది మందికి పైనే...
     
    డీసీసీ పదవిపై జిల్లాలో ఆశలు పెట్టుకున్న వారు ఆ పార్టీలో ఎక్కువ మందే ఉన్నారు. సుమారు పది మంది పది మంది నేతలు ఆ పదవిని ఆశిస్తున్నారు. దొంతి మాధవరెడ్డికి టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో ఆయన సామాజికవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తల్లో కాంగ్రెస్‌పై అసంతృప్తి నెలకొందనే అభిప్రాయం ఉంది.

    దీన్ని తొలగించేందుకు దొంతి సామాజిక వర్గానికే తిరిగి డీసీసీ పదవిని కట్టబెట్టే అవకాశం ఉంది. ఈ లెక్కన కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి ప్రధానంగా జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. బీసీ వర్గాలకు ఈ పదవిని కేటాయించాల్సి వస్తే.. బండా ప్రకాష్, సాంబారి సమ్మారావు పేర్లను పరిశీలనకు రానున్నట్లు విశ్లేషకుల అంచనా.
     
    ప్రస్తుతం జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌గా ఉన్న జంగా రాఘవరెడ్డి డీసీసీ పదవి విషయంలో ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది. డీసీసీ చీఫ్ పదవి నుంచి వైదొలిగిన మాధవరెడ్డి ప్రత్యర్థి కావడంతో జంగా రాఘవరెడ్డి దీన్ని అధిరోహించాలని  భావిస్తున్నట్లు సమాచారం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించి నిరాశ చెందిన జంగాకు ఈ పదవిని ఇచ్చే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ఎలా ఉంటుందో వేచిచూడక తప్పదు.
     
    వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించి భంగపడిన నాయిని రాజేందర్‌రెడ్డి పేరు డీసీసీ అధ్యక్ష పదవికి వినిపిస్తోంది. ప్రస్తుతం గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఉన్న రాజేందర్‌రెడ్డి.. టికెట్ల కేటాయింపు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం సైతం జరిగింది. రాజేందర్‌రెడ్డి స్వయంగా ఇలా ప్రచారం చేసుకున్నారని... మళ్లీ ఆయనే ఖండించారని నాయిని వ్యతిరేక వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై ఇలా స్పందించిన నా యినికి పదవి ఇవ్వడం సమంజసం కాదని వీరు అంటున్నారు.
     
    ప్రస్తుతం డీసీసీ అధికార ప్రతినిధి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సైతం వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించారు. టికెట్ వస్తుందనే ఉద్దేశంతోనే ముందుగానే నామినేషన్ వేశారు. పొన్నాల లక్ష్మయ్య జోక్యంతో ఉపసంహరించుకున్నారు. పార్టీలో అందరిని సమన్వయం చేసే బొద్దిరెడ్డి పేరును డీసీసీ అధ్యక్ష పదవికి పరిశీలించే అవకాశం ఉంది. తక్షణం డీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేయని పక్షంలో తాత్కాలికంగా సమన్వయ బాధ్యతలను బొద్దిరెడ్డికే అప్పగించే అవకాశం ఉంది.
     
    జంగా రాఘవరెడ్డికి డీసీసీబీ అధ్యక్ష పదవి, నాయిని రాజేందర్‌రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఉన్నారు. ఇప్పటికే వీరు పదవుల్లో ఉన్నందున డీసీసీ పీఠాన్ని అప్పగించే విషయంలో అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది. బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని కాదంటే... చివరికి పొన్నాల వైశాలి పేరును పరిశీలించనున్నట్లు సమాచారం. వైశాలికి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. వచ్చే ఐదేళ్ల వరకు మళ్లీ ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో వైశాలి పేరును డీసీసీ అధ్యక్ష పదవికి పరిశీలించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వైశాలి ప్రస్తుతం కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇది పార్టీ పదవే కావడంతో... డీసీసీ చీఫ్ పదవి ఇచ్చినా కాంగ్రెస్‌లో వ్యతిరేకత రాదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారుు.
     

Advertisement
Advertisement