ఇదేం పద్ధతి? | Sakshi
Sakshi News home page

ఇదేం పద్ధతి?

Published Tue, Jun 17 2014 3:35 AM

ఇదేం పద్ధతి? - Sakshi

  • అడ్వాన్స్ లేకుండా పనులు ఎలా సాధ్యం
  • మేడారం జాతర పనులపై పే అండ్ అకౌంట్స్ అభ్యంతరం
  • ఇరుక్కుపోయిన ఐటీడీఏ  ఇంజనీరింగ్ విభాగం అధికారులు
  • సమస్య నుంచి బయటపడేందుకు సచివాలయం వేదికగా పైరవీలు
  • ఎవ్వరూ మనల్ని చూడట్లేదు.. ఏం చేసినా పరవాలేదు అనే ధీమాతో మేడారం జాతర పనుల్లో నిబంధనలను తుంగలో తొక్కిన ఐటీడీఏ, గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు.. ఇప్పుడు అడ్డంగా ఇరుక్కున్నారు. జాతర పనుల్లో నిబంధనలు పక్కనపెట్టిన విషయూన్ని పే అండ్ అకౌంట్స్ విభాగం గుర్తించింది. ఏ పద్ధతి ప్రకారం పనులు చేపట్టారో తెలపాలని వివరణ కోరింది. దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఐటీడీఏ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర సచివాలయం వేదికగా ఎలాగైనా సమస్యను పరిష్కరించుకునేందుకు పావులు కదుపుతున్నారు.
     
    సాక్షి, హన్మకొండ :మేడారం జాతర సందర్భంగా రెడ్డిగూడెం, చిలకలగుట్ట దగ్గర, జంపన్నవాగులో ఇన్‌ఫిల్టరేషన్ వెల్స్, మంచినీటి సరఫరా పనులు నిర్వహించేందుకు గిరిజన సంక్షేమ శాఖ టెండర్లు ఆహ్వానించింది. అయితే జాతరకు సమయం తక్కువగా ఉందని పేర్కొంటూ ఈ టెండర్లు రద్దు చేస్తూ దాదాపుగా 1.42 కోట్ల విలువైన పనులు శాఖ తరఫున సొంతంగా చేపడతామని చివరి నిమిషంలో గిరిజన సంక్షేమశాఖ అధికారులు ప్రకటించారు. ఈ అంశంలో కలెక్టర్ దగ్గరి నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని పనులు చేపట్టారు. జాతర ముగిసిన తర్వాత ఈ పనికి సంబంధించిన బిల్లులు మంజూరు చేయాల్సిందిగా కోరుతూ పే అండ్ అకౌంట్స్ విభాగానికి సంబంధిత ఫైలును గిరిజన సంక్షేమశాఖ, ఇంజినీరింగ్ విభాగం పంపింది.
     
    అడ్వాన్‌‌స లేకుండా పనులెలా..?

    ప్రభుత్వ అధికారులు తమ శాఖ తరఫున సొంతంగా పనిని చేపట్టాలంటే పని మొత్తం విలువలో కొంత మొత్తాన్ని  మొదట అడ్వాన్సుగా తీసుకుని పనిని ప్రారంభించాలి. ఆ తర్వాత దశల వారీగా పని చేపడుతూ అడ్వాన్సులు తీసుకుంటూ  పూర్తి చేయాల్సి ఉంటుంది.  అయితే పని పూర్తి చేశాం.. మాకు బిల్లులు మంజూరు చేయండి అంటూ పే అండ్ అకౌంట్స్ విభాగానికి పంపిన ఫైలులో పనిని చేపట్టేందుకు అడ్వాన్సులు తీసుకున్నట్లుగా ఎక్కడా పేర్కొనలేదు.

    అందుకు సంబంధించిన పత్రాలను దాఖలు చేయలేదు. దాంతో ఈ అంశాన్ని తప్పు బడుతూ పే అండ్ అకౌంట్స్ విభాగం.. బిల్లులు మంజూరు చేసేందుకు నిరాకరించింది. 1.40 కోట్ల రూపాయల విలువైన పనులు ఎటువంటి అడ్వాన్సులు తీసుకోకుండా ప్రభుత్వ అధికారులు ఏ విధంగా పనులు పూర్తి చేశారో చెప్పాలంటూ వివరణ కోరింది. అడ్వాన్సులు తీసుకోకుండా పనులు పూర్తి చేసేందుకు నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారో తెలపాలంటూ నిలదీసింది.
     
    కమీషన్ల వల్లే సమస్య
     
    తమకు అనుకూలుడైన వ్యక్తికి పనిని కట్టబెట్టేందుకు గిరిజన సంక్షేమశాఖ, ఇంజినీరింగ్ అధికారులు నిబంధనలను తొక్కిపెట్టి టెండర్లు రద్దు చేశారనే ఆరోపణలు జాతర ముందే వినిపించాయి. శాఖ తరఫున పనిచేస్తున్నట్లు కాగితాల్లో పేర్కొన్నా... వాస్తవంలో ఈ పనులు ఏటూరునాగారానికి చెందిన ఓ కాంట్రాక్టరుకు కట్టబెట్టారు. దానితో పనిని చేపట్టేందుకు అడ్వాన్సులు తీసుకోవాల్సిన అవసరం అధికారులకు రాలేదు.

    కానీ జాతర పూర్తయిన తర్వాత బిల్లుల మంజూరు సమయంలో శాఖ తరఫున పనిని చేపట్టామని పేర్కొన్న అధికారులు అందుకు సంబంధించిన అడ్వాన్సు బిల్లులను సమర్పించలేక పోయారు. ఎటువంటి  జాగ్రత్తలు తీసుకోకుండానే ఈ పనికి సంబంధించిన బిల్లులు మంజురుకు ఫైలును పే అండ్ అకౌంట్స్ విభాగానికి పంపారు. ఇప్పుడు అక్కడ కథ అడ్డం తిరిగింది.
     
    చినికి చినికి గాలివాన

     
    అడ్వాన్సు రూపంలో సొమ్ము డ్రా చేయకుండా గిరిజన సంక్షేమ శాఖ కింది స్థాయి సిబ్బంది పనులు చేపడుతుంటే దాన్ని పర్యవేక్షించాల్సిన పై అధికారులు ఎందుకు చూస్తుండిపోయారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పే అండ్ అకౌంట్స్ విభాగం ఈ అంశాన్ని తప్పు పట్టే వరకు ఏ ఒక్కరూ ఈ ఉందంతంపై నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పే అండ్ అకౌంట్స్ విభాగం ఈ వ్యవహారాన్ని తప్పు పట్టడంతో ఈ అంశం రాష్ట్ర రాజధానికి చేరింది.

    ఇంతకాలం తమ మధ్య గుట్టుగా ఉన్న అంశం బట్టబయలు కావడంతో ఇంజనీరింగ్ అధికారుల్లో గుబులు మొదలైంది. ఈ అంశంపై పెద్ద ఎత్తున విచారణ జరిగితే చాలా మంది అధికారులకు అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో ఎలాగైనా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సచివాలయం కేంద్రంగా పైరవీలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
     

Advertisement
Advertisement