పెన్షన్ల నియంత్రణకు ఆర్థిక శాఖ కసరత్తు | Sakshi
Sakshi News home page

పెన్షన్ల నియంత్రణకు ఆర్థిక శాఖ కసరత్తు

Published Fri, Jun 6 2014 2:41 AM

Finance Ministry exercising to control on Pensions

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లను భారీగా పెంచుతామని ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ అమలుకు కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతమున్న పెన్షనర్లుకు ఏడాదికి చెల్లించాల్సిన మొత్తం రూ.3,819 కోట్లు  అవుతోంది. కాని ఆర్థిక శాఖ అధికారులు ఈ భారాన్ని రెండు వేలకోట్లకు మించకుండా కట్టడి చేయాలని యోచిస్తున్నారు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, హామీ మేరకు వృద్ధులు, వితంతువుల పెన్షన్‌ను వెయ్యి రూపాయలకు, వికలాంగుల పెన్షన్‌ను రూ.1,500కు పెంచుతామని స్పష్టం చేశారు. 
 
అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పెన్షనర్ల సంఖ్య  31.67 లక్షలమంది ఉన్నారు. వీరిలో కంట్రిబ్యూటరీ పెన్షన్ ‘వైఎస్సార్ అభయహస్తం’ పథకంలో 1.76 లక్షల మంది ఉన్నారు. వీరిని మినహాయిస్తే.. వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు మొత్తం 29.90 లక్షలమంది పెన్షనర్లు ఉన్నారు. వీరిలో వికలాంగులకు ప్రతినెలా ఐదువందల రూపాయలు ప్రస్తుతం చెల్లిస్తున్నారు. మిగిలిన పెన్షనర్లందరికీ రెండువందల రూపాయల లెక్కన పెన్షన్ చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పెన్షన్లకు ప్రతిసంవత్సరం తెలంగాణలో రూ.855 కోట్లు ఖర్చవుతోంది. ఎన్నికలహామీ మేరకు పెంచితే, ఏకంగా రూ.3,819 కోట్లవుతుంది. 
 
దీన్ని రూ.2,000 కోట్లకు పరిమితం చేయాలన్న ఆలోచనతో ఆర్థికశాఖ ఉన్నట్టు తెలుస్తోంది. అంతకు మించి భారం పెరిగితే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమున్న పెన్షనర్లలో అనర్హులను తొలగించడం, పెన్షన్ల మంజూరుకు నిబంధనలను కఠినతరం చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. అయితే ఆర్థికశాఖ చేసే ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరిస్తారా, లేక ఎన్నికల హామీ మేరకు పెన్షన్లను పెంచాల్సిందేనంటారా వేచి చూడాల్సిందే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement