సింగరేణికి వయోభారం | Sakshi
Sakshi News home page

సింగరేణికి వయోభారం

Published Sun, Jan 4 2015 3:52 AM

Focus on internal recruitment vacancies

కొత్తగూడెం(ఖమ్మం): సింగరేణికి యువరక్తం ఎక్కించాల్సిన సమయం ఆసన్నమైంది. సంస్థలో పనిచేసే కార్మికుల్లో అత్యధికులు 40 ఏళ్ల పైబడిన వారే ఉన్నారు.  ఔట్ సోర్సింగ్ విధానంతో రోజురోజుకు కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరుగుతోంది. పర్మనెంట్ కార్మికులు గణనీయంగా తగ్గిపోయారు. నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఖాళీల భర్తీకి అంతర్గత నియామకాలపై దృష్టి సారిస్తున్న యాజమాన్యం కొత్తగా నియామకాలు చేపట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో 2015లో రిటైర్డయ్యే కార్మికుల సంఖ్య 2 వేల వరకు ఉండడం గమనార్హం.
 
40 ఏళ్ల పైబడిన వారే ఎక్కువ..
1990 నుంచి సింగరేణి సంస్థలో ఆర్థిక సంస్కరణలు, నూతన యాంత్రీకరణ అమల్లోకి రాగా కొత్త నియామకాలు చేపట్టడం లేదు. సంస్థలో వీఆర్‌ఎస్, గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీంలను అమల్లోకి తెచ్చారు. డిపెండెంట్ ఎంప్లాయీమెంట్‌ను కూడా పూర్తిగా ఎత్తి వేశారు. 1990కి పూర్వం సంస్థలో 1.20 లక్షల మంది కార్మికులు ఉండగా తర్వాత పద్నాలుగేళ్లలో ఆ సంఖ్య సగానికి తగ్గింది. గత పదిహేనేళ్లుగా కొత్తగా నియామకాలు లేవు.   

టెక్నికల్ విభాగంలో ఇంజినీర్లను మాత్రమే అరకొరగా నియమిస్తున్నారు. పాతవారే కొనసాగుతుండడంతో ప్రస్తుత కార్మికుల్లో 80 శాతం మంది 40 ఏళ్ల వయస్సు పైబడిన వారే. ఇందులో 50 ఏళ్లకు పైబడిన కార్మికుల సంఖ్య సగం వరకు ఉంది.
 
యాంత్రికరణ.. ఔట్ సోర్సింగ్‌పై దృష్టి..
యాంత్రిరణ నేపథ్యంలో కోల్‌ఫిల్లింగ్‌ను సంస్థ విస్మరించింది. ఓపెన్‌కాస్టులపై ఎక్కువగా దృష్టి సారించి భూగర్భ గనుల్లో ఎల్‌హెచ్‌డీ, ఎల్‌ఈడీ యంత్రాలను ప్రవేశపెట్టడంతో గతంలో ఉన్న తట్టా చెమ్మస్ సంస్కృతి కనుమరుగైంది. ఇలా ఉత్పత్తిపై దృష్టిసారిస్తున్నా.. నియామకాలను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కాంట్రాక్ట్ కార్మికులను భూగర్భ గనుల్లోనూ పనులకు వినియోగించుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ప్రస్తుతం సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు.  
 
అనారోగ్యాల బారిన కార్మికులు

నియామకాలు విస్మరిస్తుండడంతో  పనిలో మెళకవలు తెలిసిన కార్మికులు తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కార్పొరేట్ శాఖలో క్లరికల్ గ్రేడ్ నియామకాల్లో జాప్యం చేయడం వల్ల ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఉన్న కార్మికులపై పనిభారం పెరిగి అనారోగ్యానికి గురవ్వాల్సి వస్తోంది. ఈ ఏడాది పెద్దసంఖ్యలో రిటైర్మెంట్లు ఉన్నందున రిక్రూట్‌మెంట్‌పై యాజమాన్యం దృష్టిపెట్టాలనే డిమాండ్ విన్పిస్తోంది.

Advertisement
Advertisement