‘ఆహార భద్రత’ దరఖాస్తులపై అయోమయం! | Sakshi
Sakshi News home page

‘ఆహార భద్రత’ దరఖాస్తులపై అయోమయం!

Published Mon, Nov 3 2014 5:31 AM

'Food security' applications are confused!

  • పౌరసరఫరాల శాఖలో సిబ్బంది కొరత
  •  ఒకవైపు మారుతున్న నిబంధనలు  
  •  దర ఖాస్తుల పరిశీలన టెస్టింగ్‌లకే పరిమితం  
  •  వారం గడిచినా..ఆరంభం కాని వైనం
  • సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో ఆహారభద్రత (రేషన్) దరఖాస్తుల పరిశీలనపై స్తబ్ధత నెలకొంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసి వారం కావస్తున్నప్పటికీ ఇంటింటి పరిశీలన మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కేవలం డీలర్లు స్వీకరించిన దరఖాస్తులు, రికార్డులను సేకరించిన సివిల్ సప్లై అధికారులు కంప్యూటరీకరణ చేయడంలోనే మునిగితేలుతున్నారు. వాస్తవంగా సివిల్ సప్లై శాఖలో ఒకవైపు సిబ్బంది కొరత వెంటాడుతుండగా, మరోవైపు మారుతున్న నిబంధనలపై స్పష్టత లేక దరఖాస్తుల పరిశీలనకు అధికారులు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇప్పటి వరకు డీలర్ల నుంచి సేకరించిన దరఖాస్తులు, రికార్డులను సర్కిల్ ఆఫీస్‌ల వారీగా ప్రైవేట్ డేటాబేస్ ఆపరేటర్ల సహాయంతో కంప్యూటరీకరిస్తున్నారు. నగరంలో తొమ్మిది సర్కిల్స్ ఉండగా, వాటిలో ఏ ఒక్కదానిలో కూడా పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. దరఖాస్తులను కంప్యూటరీకరించి డివిజన్, ఏరియా వారీగా విభజించి సమగ్ర కుటుంబ సర్వే నివేదికలతో సరిపోల్చుతూ విచారణ జరపాల్సి ఉంటుంది. డేటాబేస్ ఆపరేటింగ్ కోసం ప్రైవేట్ సిబ్బందిని డైలీ వేజ్ కిందతీసుకున్నప్పటికీ దరఖాస్తులపై ఇంటింటి పరిశీలనకు మాత్రం సిబ్బంది కొరత తప్పని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సివిల్ సప్లై శాఖలో 70 మందికి మించి సిబ్బంది లేరు.

    ఆహార భద్రత కార్డుల కోసం అందిన సుమారు 8.89 లక్షల దరఖాస్తులపై విచారణ జరపాల్సి ఉంటుంది. ఇటీవల రెండు మూడు సర్కిల్స్‌లో దరఖాస్తుల పరిశీలనపై ‘టెస్టింగ్’ నిర్వహించారు. ఒక ఇంటికి దరఖాస్తు పరిశీలన పూర్తయ్యేవరకు ఎంత సమయం పడుతుంది. రోజుకు సిబ్బంది ఎన్ని దరఖాస్తులను పరిశీలించవచ్చు అనేదానిపై టెస్టింగ్ నిర్వహించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బంది దరఖాస్తుల పరిశీలనకు సరిపోని పరిస్థితి నెలకొంది.

    తాజాగా నిబంధనల్లో మార్పు చేస్తున్నట్లు సంబంధిత మంత్రి వెల్లడించారు. దీంతో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన తర్వాతనే దరఖాస్తుల పరిశీలనకు రంగంలోకి దిగాలని  సంబంధిత అధికారులు భావిస్తున్నారు. మరోవైపు పెన్షన్, ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తికావస్తుండటంతో రెవెన్యూ సిబ్బందిని ఆహార భద్రత దరఖాస్తుల పరిశీలన కోసం వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
     

Advertisement
Advertisement