పోడు కోసం ‘ప్రత్యేక’ పోరు.. | Sakshi
Sakshi News home page

పోడు కోసం ‘ప్రత్యేక’ పోరు..

Published Tue, May 26 2015 2:24 AM

పోడు కోసం ‘ప్రత్యేక’ పోరు..

- ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమమే ధ్యేయం
- మహాధర్నాలో న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు టాన్యా
దోమలగూడ:
ప్రభుత్వం పోడు భూములను స్వాధీనం చేసుకునే చర్యలను విరమించుకోవాలని, లేకుంటే ఆదివాసీలకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాల్సి వస్తుందని సీపీఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు టాన్యా హెచ్చరించారు.  పోడు భూములను లాక్కునే చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ జల్, జమీన్, జంగిల్‌పై ఆదివాసీలదే హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించడం లేదని ఆరోపించారు.

ఆదివాసీలను న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు వారికి అన్యాయం చేసే చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు.  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన భూ ఆర్డినెన్స్ ద్వారా లక్షల ఎకరాల వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.  న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ.. అడవిపై ఫారెస్టు సిబ్బంది పోలీసులు, పెట్టుబడిదారుల పెత్తనం ఎమిటని ప్రశ్నించారు.  పొట్ట కోసం చెట్లను నరికేందుకు వచ్చిన కూలీలను చంద్రబాబు ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపిందని, రూ. వందల కోట్ల రుణాలు ఎగవేసిన సుజనాచౌదరిని ఎన్‌కౌంటర్ చేయగలదా అని నిలదీశారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోవర్ధన్ మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడం లేదని ఆరోపించారు. న్యూడెమోక్రసీ నాయకులు ముక్తార్ పాషా, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు వి.సంధ్య, ఏఐకేఎంఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అచ్యుతరామారావు, మండల వెంకన్న, ఎ. నరేందర్, అనురాధ, భూక్యా, అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి నిర్మల, గౌని ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement