అడ్డంకులు తొలిగేనా? | Sakshi
Sakshi News home page

అడ్డంకులు తొలిగేనా?

Published Mon, Jun 9 2014 3:48 AM

అడ్డంకులు తొలిగేనా?

 ‘ప్రాణహిత’ అటవీ భూములకురాని క్లియరెన్స్

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ వరప్రదాయని ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు అటవీశాఖ అడ్డంకులు తొలిగేనా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ భారీ సాగునీటి ప్రాజెక్టుపై సర్కారు నిర్లక్ష్యానికి తోడు, కేంద్ర పర్యావరణ అటవీశాఖల అనుమతులు లభించకపోవడంతో పనులు అర్ధంతరంగా నిలిచాయి. ఇప్పుడు రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా, కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు జోగు రామన్న, ఎస్.వేణుగోపాలాచారిలు నియమితులు కావడం, ప్రధాని వద్ద ప్రాణహిత అంశం కేసీఆర్ తీరుకురావచ్చిన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
తెలంగాణలోని ఏడు జిల్లాల పరిధిలో ఉన్న 16.40 లక్షల ఎకరాల బీడు భూములకు సాగు నీరందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతోపాటు, వందలాది గ్రామాలకు తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందు కు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మహానేత మరణం తరా్వాత సర్కారు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికొదిలేసింది. ముఖ్యంగా అటవీశాఖ క్లియరెన్సులు రాకపోవడంతో పనులు ఆగాయి. దీంతో ఈ ప్రాజెక్టు వ్యయం ఏటా పెరుగుతూ తడిసి మోపెడవుతోంది.
 
అటవీ భూములతో అడ్డంకులు
ఈ ప్రాజెక్టు లింక్-1 పరిధిలో ఐదు ప్యాకేజీలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 8,465.76 ఎకరాల భూమిని సేకరించాలని నీటి పారుదలశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు కేవలం 3,061 ఎకరాలు మాత్రమే సేకరించగలిగారు. మిగిలిన 5,404 ఎకరాల్లో 3,457 ఎకరాలు అటవీ భూములున్నట్లు గుర్తించారు. ఈ 3,457 ఎకరాలకు అటవీశాఖ అనుమతులు లభించడం లేదు. దీంతో పనులు అర్థాంతరంగా నిలిచాయి. ముఖ్యంగా నాలుగో ప్యాకేజీ పనులకు ప్రధాన అడ్డంకిగా మారింది.
 
43 కిలో మీట ర్ల కాలువ నిర్మించాల్సి ఉండగా అటవీశాఖ క్లియరెన్స్ లేకపోవడంతో 18 కిలోమీటర్ల మేరకు పను లు  నిలిచాయి. ఈ ప్యాకేజీ పనుల పరిధిలో 2,387 ఎకరాల అటవీ భూములున్నాయి. బెల్లంపల్లి, కాగజ్‌నగర్ అటవీ డివిజన్ల పరిధిలో ఉన్న కూచవెల్లి, కొండపల్లి, సారంగపల్లి, కుష్ణపల్లి అట వీ ప్రాంతంలో పనులు ఆగిపోయాయని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
 
అటవీశాఖ పరిశీలనలో ప్రతిపాదనలు
ఈ ప్రాజెక్టు పనులతో ముంపునకు గురికానున్న అటవీ భూములకు సంబంధించిన నీటి పారుదల శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలు అటవీశాఖ పరిశీలనలో ఉన్నాయి. ముంపునకు గురికానున్న అటవీ భూముల్లో ఉన్న చెట్ల గణన, ఇతర వనసంపద విలువ లెక్కింపు పూర్తయితే ఈ భూములకు అనుమతులు మంజూరుకు మార్గం సుగమమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద నిర్మిస్తున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు బ్యారేజీ నిర్మాణం పనుల వివరాలు ఇవ్వాలని మహారాష్ట్ర సర్కారు నుంచి ఆదేశాలందాయని నీటి పారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement