సాగు దూరమై.. బతుకు భారమై... | Sakshi
Sakshi News home page

సాగు దూరమై.. బతుకు భారమై...

Published Wed, Sep 9 2015 12:56 AM

సాగు దూరమై..  బతుకు భారమై... - Sakshi

మెదక్ జిల్లాలో సగటున మూడు రోజులకో రైతు ఆత్మహత్య
 
అదును మీద అప్పులిచ్చిన షావుకార్లంతా పట్టణాలకు వలస   సరిగా రుణాలు ఇవ్వని బ్యాంకులు... చీటీలు, ఫైనాన్స్‌లలో అప్పులు చేస్తున్న అన్నదాతలు ఆ వాయిదాలు కట్టడం కోసం మైక్రో ఫైనాన్స్‌లో రుణాలు వీటి వాయిదాల కోసం పశువులను అమ్ముకుంటున్న దుస్థితి కనీసం కూలీకూడా దొరకని పరిస్థితి అప్పుల ఆవేదనతో బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులు
 
సంగారెడ్డి: సాగుకు తెచ్చిన అప్పులు.. బ్యాంకులు రుణాలివ్వక తెచ్చిన ఫైనాన్స్ బాకీలు.. వాటి వాయిదాలు కట్టడానికి మైక్రోఫైనాన్స్ రుణాలు.. ఎదిగిన ఆడపిల్లల పెళ్లిళ్ల ఖర్చులు.. అన్నింటికీ తోడుగా మద్యం మహమ్మారి... ఇలా అన్నీ ఒకదానికొకటి పురివేసుకొని అన్నదాత గొంతుకు ఉరి వేస్తున్నాయి. ఇంతకాలం అదును మీద అప్పిచ్చిన ఊరి షావుకార్లు పల్లెలను వదిలేసి పట్టణాలకు వెళ్లి రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెడుతున్నారు. బ్యాంకులు సరిగా రుణాలివ్వక రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం చిట్టీలు ఎత్తి డబ్బు తీసుకుంటున్నారు. వీటి వాయిదాలు కట్టడం కోసం పట్టణ ఫైనాన్సియర్ల వద్ద పొలం తాకట్టు పెడుతున్నారు. ఈ ఫైనాన్స్ వడ్డీలు కట్టడం కోసం సూక్ష్మ రుణా (మైక్రో ఫైనాన్స్)లను తీసుకొంటున్నారు. ఇలా ఒకదానిపై ఒకటి... అప్పుపై అప్పు పేరుకుపోతోంది. అటు పంటలు పోయి, ఇటు అప్పులు పెరిగిపోయి రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మెదక్ జిల్లాలో సగటున మూడు రోజులకో రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. మెతుకు సీమ వ్యవసాయ కుటుంబాల్లో సగటున ప్రతి 100 మంది మహిళల్లో ఇద్దరు వితంతువులుగా మారుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ జిల్లాలో ఇప్పటివరకు 145 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ‘సాక్షి’ పరిశీలనలో తేలిన నగ్న సత్యమిది.

అప్పులిచ్చేదెవరు?
మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం ఎల్కల్ గ్రామంలోని పెద్దపెద్ద షావుకార్లు ఇక్కడ స్థానికంగా గిట్టుబాటు కావడం లేదని పట్నం బాట పట్టారు. వారిలో ఒకాయన రైతులకు అప్పులు ఇచ్చి... పంట చేతికి రాగానే తిరిగి వసూలు చేసుకోవడం చేసే వ్యక్తి. రైతులపై కనీసం రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టగల సత్తా ఉన్నవ్యక్తి. అలాంటి షావుకార్లు ఎల్కల్ గ్రామంలో ఐదుగురు ఉండేవారు. పక్క గ్రామాల రైతులు కూడా వీరి వద్దకు వచ్చేవారు. అయితే ఐదేళ్ల నుంచి కాలం కలసిరాక రైతుల పంటలు ఇంటికి చేరడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నలుగురిలో నిలుచోబెట్టి దబాయించి మరీ అప్పులు కట్టాలని షావుకార్లు నిలదీస్తుండడంతో... ఆ అవమానం భరించలేక రైతులు ఆత్మహత్యలే దిక్కనుకుంటున్నారు. ఈ ఐదేళ్లలో ఎల్కల్ చుట్టు పక్కల పల్లెల్లో కలిపి దాదాపు 70 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ గొడవలన్నీ ఎందుకనో, రైతుల మీద పెట్టుబడి పెట్టి నష్టపోవడం ఎందుకనో... ఈ షావుకార్లంతా గజ్వేల్‌కు వెళ్లిపోయారు. అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. అటు ప్రభుత్వమూ ఆదుకోక, బ్యాంకుల నుంచి అప్పులూ సకాలంలో రాక, ఇటు ఊర్లో షావుకార్లూ లేక... రైతులు దిక్కుతోచక పస్తులుంటున్నారు.

 మైక్రో ఫైనాన్స్ వల
 రైతులు చీటీ వాయిదా డబ్బులు కూడా చెల్లించే మార్గాలు లేవు. కూలీ పనులు కూడా దొరకని పరిస్థితి. ఇదే అదునుగా పల్లెల్లో మళ్లీ మైక్రో ఫైనాన్స్ (సూక్ష్మ రుణ) సంస్థలు వల విసురుతున్నాయి. మహిళా సంఘాల గ్రూపులను చేరదీసి... సభ్యులను ఒకరికి మరొకరుగా జమానతు పెట్టుకొని రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు రుణాలు అందిస్తున్నాయి. అయితే రైతులు అంతకుముందు చేసిన అప్పులకు వడ్డీ కట్టడం కోసం ఈ మైక్రోఫైనాన్స్‌ల వద్ద అప్పులు చేస్తున్నారు. తాము చేసిన అప్పుకు వడ్డీ కట్టడం కోసం ఎల్కల్ గ్రామం వెంకటేశ్వర మహిళా సంఘం సభ్యురాలు దొనపల్లి ముత్యాలు రెండు నెలల కింద మైక్రో ఫైనాన్స్ సంస్థను రూ.10 వేలు అప్పు ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ సంస్థ వాళ్లు రూ.8,000 మాత్రమే చేతికిచ్చి వారానికి రూ.800 చొప్పున 12 వారాల్లో బాకీ తీర్చాలనే నిబంధన పెట్టారు. కూలీ పనులు కూడా దొరకని ఈ రోజుల్లో వారానికి రూ.800 వాయిదా కట్టడం ఎలా సాధ్యమో తెలియదు.
 
‘స్వశక్తి’ సాయం లేదు
మహిళా స్వశక్తి సంఘాలకు ప్రభుత్వం అందించే రుణాలు ఈ ఏడాది సరిగా అందలేదు. నిర్దేశించుకున్న ప్రాజెక్టుకు కాకుండా మహిళలు ఇతర అవసరాలకు రుణ నిధులను వాడుకుంటున్నారని ప్రభుత్వం భావించింది. ఇలాగైతే మహిళా సాధికారత సాధ్యం కాదనే ఆలోచనతో సమగ్ర సర్వే చేసేంత వరకు స్వశక్తి సంఘాలకు నిధులు నిలిపివేయాలని నిర్ణయించింది. సాధారణంగా స్వశక్తి సంఘాల రుణాల సొమ్మును ఎక్కువ మంది మహిళలు వ్యవసాయంపైనే పెట్టుబడిగా పెట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతుకు డబ్బు సాయం అందే ఈ దారి కూడా మూసుకుపోయింది. దీంతో ఆర్థిక వెసులుబాటు కోసం 20 నుంచి 30 మంది రైతులు కలసి చీటీలు వేసుకుంటున్నారు. దౌల్తాబాద్ మండలంలోని ఒక గ్రామంలో రూ.2లక్షల చీటీని ఒక రైతు కేవలం రూ.65 వేలకు పాడుకున్నారు. అదే గ్రామంలో రూ.లక్ష చీటీని మరో రైతు రూ.25 వేలకే తీసుకున్నాడు.  ప్రతి రైతుది ఇలాంటి దీన పరిస్థితే. ఇంతా చేసి తెచ్చిన డబ్బును వ్యవసాయంలో పెట్టుబడిగా పెట్టిన రైతును కాలం వెక్కిరించింది. పత్తి, మొక్కజొన్న పంటలు వాడిపోయాయి. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసినా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు.
 
పంట చేతికందినా..
సంగుపల్లెకు చెందిన చినపులి బీరప్ప నాలుగెకరాల్లో బూడిద గుమ్మడి పాదులు పెట్టారు. కుటుంబ సభ్యులంతా కలసి ప్రతికూల పరిస్థితుల్లోనూ పోటీపడి పాదులను పోతం చేసుకున్నారు. పంట కోతకొచ్చే సమయానికి మార్కెట్‌లో గుమ్మడికాయ ధర పడిపోయింది. ఏం చేయాలో తోచక బీరప్ప గుమ్మడికాయలను కోసి పొలంలోనే రాశులుగా పోశాడు. 20 రోజులుగా అవి ఎండకు ఎండి వానకు తడిసి కుళ్లిపోతున్నాయి. పశువులు, పక్షులు తినిపోతున్నాయి. రైతులు పంటను దాచుకునే అవకాశం లేదు. దీంతో వచ్చిందే చాలు అనుకొని దిగుబడి చేతికి అందగానే దళారులకు అమ్ముకుంటున్నారు. ధాన్యం అమ్మకానికి అనుకూల పరిస్థితులు లేనప్పుడు మద్ధతు ధర వచ్చేంత వరకు పంట దాచుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వసతులు కల్పించాలి. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచనలు చేయడం లేదు.
 
రైతులకు చెయ్యిచ్చి..

బ్యాంకులు రైతులకు చెయ్యిచ్చి మైక్రోఫైనాన్స్ సంస్థలకు మాత్రం చేయూతనిస్తున్నాయి. పట్టాదారు పుస్తకాలు, పాసుబుక్కులు పట్టుకొని రైతులు రోజుల తరబడి తిరిగినా అప్పులివ్వని బ్యాంకర్లు... మైక్రో ఫైనాన్స్ సంస్థలకు మాత్రం ఉదారంగా రుణాలిచ్చేస్తున్నారు. ఈ డబ్బుకు బ్యాంకర్లు రూపాయి వడ్డీ తీసుకుంటున్నారు. రైతులు తీసుకుంటున్న పంట రుణాల్లో బ్యాంకర్లు ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బును మినహాయించుకుంటున్నారు. ఈ మొత్తాన్ని ఇన్సూరెన్స్ విభాగంలో జమ చేయకుండా దారి మళ్లించి మైక్రోఫైనాన్స్ సంస్థల చేతిలో పెడుతున్నారు. 2014లో మెదక్ జిల్లాలో రూ.1,400 కోట్లు పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో ప్రతి రూపాయికి ఇన్సూరెన్స్ ప్రీమియం మినహాయించుకున్నారు. కానీ రూ.400 కోట్ల రుణాలకు చెందిన ప్రీమియాన్నే బ్యాంకర్లు ఇన్సూరెన్స్ విభాగంలో జమ చేశారు. రూ.1,000 కోట్ల రుణాల ప్రీమియం డబ్బు ఎటుపోయిందో రికార్డులు లేవు. ఈ సొమ్మునే మైక్రోఫైనాన్స్ సంస్థలకు ఇస్తున్నట్లు సమాచారం. మైక్రోఫైనాన్స్ సంస్థలు ఇలా తీసుకున్న సొమ్మును మహిళా సంఘాలకు రూ.10 వడ్డీకి ఇస్తున్నాయి. దానికితోడు రుణం తీసుకున్న మహిళ పేరిట బీమా అంటూ... ఇచ్చిన అప్పులో కొంత ప్రీమియంగా మినహాయించుకుంటున్నాయి.
 
ఊళ్లు వదిలి పోతుండ్రు
‘‘నేను చిన్నప్పటి నుంచి ఎవుసాయం జేత్తన్న. అదును మీద సర్కారు సాయం ఎన్నడూ అందలే. ఎప్పుడైనా పంటకు పెట్టుబడి అంటే కిష్టపురం, శేవర్తి షావుకార్లే అప్పులిచ్చేటోళ్లు. మళ్ల పంటల మీద తీసుకునేటోళ్లు. ఇప్పుడు రైతుకు అప్పు పుట్టడం మా కట్టంగా ఉంది..’’
     - ఎంబరి మల్లయ్య(75), రైతు, నర్సన్నపేట
 
 వారాల చిట్టి తీసుకున్న
 ‘‘పిలగాడు సైకిల్ మోటర్ మీద నుంచి పడ్డడు. భూమి తాకట్టు పెట్టి ఫైనాన్స్‌ల రూ.30 వేలు తెచ్చిన, కూలికి పోదామన్నా పని దొరుకుత లేదు. ఫైనాన్సోళ్లు మిత్తిగట్టమని బలవంతం జేస్తే వారాల చిట్టిలొళ్ల దగ్గర 10 వేలు తీసుకుంటే ఇన్ని పైసలు వడ్డీ కట్టిన, ఇన్ని పైసలు మేం తింటిమి. వారానికి రూ.800 కట్టాలంటే నా పాణం పోతంది..’’     - దొనపల్లి ముత్యాలు, ఎల్కల్
 
ఒక్కింట్లెనే 5 మంది పోయిరి

‘‘మా ఒక్క ఇంట్లెనే ఐదు మంది పురుగుల మందు తాగి సచ్చిపోయిండ్రు. అర ఎకరం భూమిలో బోరేస్తే పడలే. అప్పులైనయి అని నా మొగడు సామి రెండు నెలల కింద మందు తాగి పాణం దీసుకుండు. అంతకు ముందు ఐదేండ్ల కింద మా మామ నర్సయ్య, మా సినమామలు మల్లయ్య, కిష్టయ్య, చంద్రయ్య, మా మరిది సామి అప్పుల బాధ పడలేక పురుగుల మందు తాగి సచ్చిపోయిండ్రు. మా చిన్న పిలగాని కోసం నేను బతుకుతున్న. బతికిన దాంట్లే ఏం ఫయిదా లేదయ్యా..’’    - సింగరాతి లక్ష్మి, ఎల్కల్
 
ప్రాణమొక్కటే మిగిలింది..
‘‘రూ.2లక్షల చీటీ ఎత్తితే రూ.65 వేలు వచ్చినయి. తీసుకున్న పైసలన్నీ పత్తి చేనుకే పెట్టిన. వానలు లేక పత్తి గూడేసింది. పువ్వు రాలిపోతంది. చీటీ వాయిదా రానే వచ్చింది. నలుగుట్లె పడితె ఇజ్జతుండదని మా ఇంటామే వారాల చీటీల దగ్గర రూ.20 వేలు తెచ్చి కడితిమి. వారం వాయిదా కడతానికి గొర్రెపిల్ల ఉంటే అమ్మితిని. ఇంకేం మిగిలింది సారు. నా పాణమే ఉంది..’’    - పులి రాజయ్య, రైతు, సంగుపల్లె
 

Advertisement

తప్పక చదవండి

Advertisement