నాలుగు ముక్కలు! | Sakshi
Sakshi News home page

నాలుగు ముక్కలు!

Published Wed, Sep 2 2015 11:31 PM

Four pieces

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : విషయం పాతదే అయినా సూర్యాపేట కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై మళ్లీ ప్రారంభమైన చర్చ జిల్లా వాసుల్లో ఉత్కంఠ, ఆసక్తిని కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందన్న వార్తల నేపథ్యంలో మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడంతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యత చేకూరింది.  సూర్యాపేట కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాల్సి వస్తే జిల్లాను నాలుగు ముక్కలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

అంటే ప్రస్తుత జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలను రెండు జిల్లాలుగా, మరో రెండు నియోజకవర్గాలను జిల్లా నుంచి విడదీసి మరో రెండు కొత్త జిల్లాల్లో కలుపుతారని సమాచారం. అయితే, ప్రాథమికంగా ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం మూసీనది ప్రాతిపదికగా జిల్లాను విడదీయాలనే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ఏ జిల్లాలో ఉంచుతారనే దానిపై కొంత ప్రతిష్టంభన కూడా సాగుతోంది.

 అటు ఐదు... ఇటు ఐదు
 వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే జిల్లా విభజనపై చర్చ ప్రారంభమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 24 జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని అప్పటి టీఆర్‌ఎస్ అధినేత హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ ప్రకటన చేయడం, ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చినప్పుడు సూర్యాపేట జిల్లాను ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో తెలంగాణ ఏర్పాటైన తర్వాత జిల్లా విభజన అనివార్యమనే అభిప్రాయం జిల్లా వాసుల్లో ఏర్పడింది.  ప్రస్తుతం ఉన్న నల్లగొండకు తోడు సూర్యాపేట జిల్లాను ఏర్పాటు చేయాల్సి వస్తే ఏ రకంగా చేస్తారనే దానిపై ఎక్కడా అధికారిక సమాచారం లేకపోయినా మూసీ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని విభజిస్తారనే చర్చ మాత్రం జరిగింది.

అందులో భాగంగా నల్లగొండ పరిధిలో మునుగోడు, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్లగొండతోపాటు నకిరేకల్‌ను ఉంచుతారని, ఇక సాగర్ ఆయకట్టు పరిధిలోని మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడలతో పాటు సూర్యాపేట, దాని పక్కనే ఉన్న తుంగతుర్తి నియోజకవర్గాలను కలిపి సూర్యాపేట జిల్లా చేస్తారనే చర్చ జరిగింది. అయితే, నకిరేకల్ నియోజకవర్గాన్ని సూర్యాపేటలో కలపాలా లేక నల్లగొండలో ఉంచాలా అనేది కూడా చర్చనీయాంశమయింది. ముఖ్యంగా ప్రస్తుత చర్చ ప్రకారం జిల్లాను విభజిస్తే కొత్తగా నీటిపారుదల సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మినహా జిల్లా ఆయకట్టు, నాన్‌ఆయకట్టుగా విడిపోయే ప్రమాదముంది.

అంటే సాగర్ ఆయకట్టు పరిధిలోని కీలక నియోజకవర్గాలైన మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడలు సూర్యాపేట జిల్లాలోనికి వెళితే కేవలం నాగార్జున సాగర్ నియోజకవర్గం మాత్రమే నల్లగొండ జిల్లాలో ఉంటుంది. అందులో కూడా గుర్రంపోడు, పెదవూర మండలాలు కూడా నాన్‌ఆయకట్టు కిందే ఉంటాయి. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని కచ్చితంగా నల్లగొండ జిల్లాలోనే ఉంచాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అందులో భాగంగానే నకిరేకల్‌ను సూర్యాపేటలో కలిపి మిర్యాలగూడను నల్లగొండలో ఉంచుతారని ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ఎటు వైపు ఉంచాలనే దానిపై ప్రతిష్టంభన నెలకొనే అవకాశం ఉంది.
 
  జనగాంలోకి ఆలేరు..
  ఇక, జిల్లాను విభజించాల్సి వస్తే వరంగల్ జిల్లా సరిహద్దు నియోజకవర్గమైన ఆలేరును జనగాం జిల్లాలో కలుపుతారని సమాచారం. ఆలేరుతోపాటు ప్రస్తుత వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాలను కలిపి జనగాం జిల్లాగా ఏర్పాటు చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇక, భువనగిరి విషయానికి వస్తే యాదాద్రి పేరుతో ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ (ఈస్ట్) జిల్లాలో ఈ నియోజకవర్గాన్ని కలపనున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలను కూడా ఈస్ట్ జిల్లాలో కలపనున్నారు. అలా జరగాలంటే ఆలేరు నియోజకవర్గం నుంచి యాదగిరిగుట్ట మండలాన్ని విడదీయాలి.

అంటే నియోజకవర్గాల సరిహద్దులు మార్చాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం అనుమతి ఉండాలి. అయితే, పునర్విభజనకు ఏర్పాటైన కమిషన్ 2026 వరకు నియోజకవర్గాల మార్పునకు అనుమతి ఇచ్చే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో యాదాద్రి కేంద్రంగా హైదరాబాద్ ఈస్ట్ జిల్లా ఏర్పాటవుతుందా? లేక భువనగిరి నియోజకవర్గాన్ని యథాతథంగా ఆ జిల్లాలో కలుపుతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మరోవైపు హుజూర్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని మేళ్లచెర్వు మండలం ఇప్పుడు సూర్యాపేట రెవెన్యూ డివిజన్‌లో ఉంది. మిగిలిన మండలాలన్నీ మిర్యాలగూడ ఆర్డీఓ పరిధిలోనికి వస్తాయి.

అయితే, జిల్లాల విభజన జరిగితే మేళ్లచెర్వు మండలం ఉన్న హుజూర్‌నగర్ ఎలాగూ సూర్యాపేటలోనే ఉంటుంది కనుక మేళ్లచెర్వు మండలాన్ని మాత్రం మిర్యాలగూడ ఆర్డీఓ పరిధిలోకి తీసుకెళ్తారనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం మదిలో ఏముంది? జిల్లాను ఏ విధంగా విభజిస్తారు? ఏ నియోజకవర్గాలు ఎక్కడ కలుస్తాయి? అసలు జిల్లా విభజన ఉంటుందా? ఉండదా? జిల్లాల విభజన తర్వాత ప్రస్తుతమున్న 12 నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో ఉంటాయి? అనేది ఇప్పుడు జిల్లా వాసుల్లో హాట్‌టాపిక్‌గాా మారింది.

Advertisement
Advertisement