కూలీల శ్రమను దోచుకుంటారా.. | Sakshi
Sakshi News home page

కూలీల శ్రమను దోచుకుంటారా..

Published Thu, Jul 10 2014 3:21 AM

కూలీల శ్రమను దోచుకుంటారా.. - Sakshi

దమ్మపేట: ‘‘ఉపాధి కూలీల శ్రమను దోచుకుంటారా...? రెక్కలు ముక్కలయ్యేలా నెలల తరబడి పనులు చేయించుకుని వేతనాలు ఇవ్వకుండా దిగమింగుతారా..? మీరు (అధికారులు) తిన్న సొమ్మంతా కక్కాల్సిందే. అప్పటివరకు కూలీలకు అండగా ఉంటా. వారి తరఫున ఏ పోరాటానికైనా వెనుకాడేది లేదు. కూలీల వేతన బకాయిల చెల్లింపు సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఇక్కడి నుంచి (ఈజీఎస్ కార్యాలయం) కదిలేది లేదు’’ అంటూ, ఉపాధి హామీ పథకం అధికారులపై వైఎస్‌ఆర్ సీపీ శాసన సభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహోదగ్రులయ్యా రు. ఉపాధి కూలీలతో కలిసి దమ్మపేటలోని ఉపాధి హామీ పథకం(ఈజీఎస్) కార్యాలయం వద్ద భైఠాయించారు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు:
దమ్మపేట మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు చేసిన తమకు రావాల్సిన వేతన బకాయిలను చెల్లించాలన్న డిమాండుతో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (సీపీఎం) ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ ఈజీఎస్ కార్యాలయం వద్ద ఉపాధి కూలీలు ధర్నాకు దిగారు. అదే సమయంలో, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అటుగా వె ళుతూ అక్కడ ఆగారు. ఆయనకు సీపీఎం నాయకులు, ఉపాధి కూలీలు కలిసి సమస్యను వివరించారు. దీనిపై ఆయన తీవ్రం గా స్పందించారు. కూలీలతో కలిసి ఈజీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.

నిరుపేద కూలీలను కూడా వదలరా...?!
ఉపాధి కూలీలనుద్దేశించి తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ‘‘ఉపాధి పనులతో పొట్ట పోసుకుంటున్న నిరుపేద కూలీలను కూడా అధికారులు వదలరా..? వారి వేతనాలను బొక్కేస్తారా..? మీకు రావాల్సిన వేతన బకాయిలన్నీ ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదు’’ అని అన్నారు. కూలీలతోపాటు ఎమ్మెల్యే కూడా ధర్నాకు దిగడంతో ఈజీఎస్ స్థానిక అధికారులు కలవరపడ్డారు. వారు తమ పైఅధికారులకు సమాచారమిచ్చారు. ఈజీఎస్ పీడీ వెంకటనర్సయ్య, ఏపీడీ వెంకటరాజు ఫోన్ ద్వారా ఎమ్మెల్యేను శాంతింపచేసేందుకు ప్రయత్నిం చారు. ఎమ్మెల్యే మాత్రం.. ‘‘మీరు ఇక్కడికి వచ్చి, నా సమక్షంలో ఇక్కడి కూలీలకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమిం చేది లేదు. అవసరమైతే ఈ (ఈజీఎస్) కార్యాలయానికి తాళాలు వేస్తాం’’ అని హెచ్చరిం చారు.

చివరికి, కచ్చితంగా 15 రోజుల్లో కూలీల వేతన బకాయిలను చెల్లిస్తామని ఆ అధికారులు విస్పష్టంగా చెప్పడంతో ఎమ్మెల్యే శాంతిం చారు. ‘‘అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చా రు. ఇప్పడు ఈ ఆందోళనను తాత్కాలికంగా విరమిద్దాం. వారు చెప్పిన గడువు నాటికి వేతనాలు చెల్లించకపోతే మళ్లీ ఆందోళన తప్పదు’’ అని హెచ్చరించారు. కూలీలతో కలిసి దాదాపు రెండు గంటలపాటు ఎమ్మెల్యే బైఠాయించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి దొడ్డా లక్ష్మీనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పిల్లి నాయుడు, నాయకుడు రావి విశ్వనాధం, ముష్టిబండ సర్పంచ్ బుద్దా రాజు, వైఎస్‌ఆర్ సీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దారా యుగంధర్, పట్టణ అధ్యక్షుడు పగడాల రాంబాబు, నాయకుడు పాకనాటి శ్రీను పాల్గొన్నారు.

Advertisement
Advertisement