రికవరీకి నో ‘హామీ’ | Sakshi
Sakshi News home page

రికవరీకి నో ‘హామీ’

Published Sat, Jun 28 2014 1:18 AM

రికవరీకి నో ‘హామీ’ - Sakshi

ఖమ్మం : వలసల నివారణ, అడిగిన ప్రతి కూలీకి పని కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాల్సిన ఉపాధి హామీ పథకం జిల్లాలో అక్రమాల పుట్టగా మారింది. వాటర్‌షెడ్ పనుల్లో కోట్ల రూపాయల కుంభకోణంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినా.. వాటిపై ఇప్పటి వరకు నిజానిజాలు నిగ్గు తేల్చలేదనే ఆరోపణలు ఉన్నాయి. పథకం ప్రారభం నుంచి  నేటి వరకు ఈజీఎస్‌లో జరిగిన అవకతవకలపై నిర్వహించిన  సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్)లో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని వెల్లడైంది.

అయినా వాటిని రికవరీ చేసేందుకు జిల్లా అధికారులు ప్రయత్నించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నామమాత్రంగా ఒకరిద్దరిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై గ్రామసభలు కూడా నిర్వహించడం లేదని, పనులు చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టిస్తూ, కోట్ల రూపాయలు డ్రా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

 రికవరీకి నోచని రూ. 2.49 కోట్లు...
 జిల్లాలో 5, 82,759 జాబ్ కార్డులు ఉండగా వీటి ద్వారా 14,41,083 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. పథకం ప్రారంభమైన 2010 నుంచి ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల విలువైన పనులు చేస్తున్నారు. ఇందులో కింది నుంచిపైస్థాయి అధికారుల చేతివాటంతో కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నట్లు తేటతెల్లమైంది. 2010 నుంచి  ఈ సంవత్సరం వరకు ఈ అక్రమాలపై ఏడు సార్లు సోషల్ అడిట్ నిర్వహించారు. ఈ ఆడిట్ ద్వారా జిల్లాలో 3,14,00,739 రూపాయల అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. అయితే, వాటిని రికవరీ చేయడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

మొదటి విడత తనిఖీల్లో రూ. 15 లక్షలకు పైగా అక్రమాలకు పాల్పడినట్టు తేలగా, అందులో రూ. 13 లక్షలు రికవరీ చేశారు. అదే రెండో విడతలో రూ. 59 లక్షలు దుర్వినియోగం కాగా, ఇందులో కేవలం రూ. 20 లక్షలు, మూడో విడతలో రూ. 26 లక్షలకు రూ.13 లక్షలు, నాలుగో విడతలో రూ. 28 లక్షలకు రూ. 6 లక్షలు మాత్రమ రికవరీ చేశారు. ఐదో విడతలో అత్యధికంగా రూ.1.23 కోట్లు దుర్వినియోగం కాగా, ఇందులో రూ.8.17 లక్షలు మాత్రమే రికవరీ చేశారు.

దీన్నిబట్టి చూస్తే ఉన్నతాధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. అయితే జిల్లాలో జరిగిన అక్రమాలలో అక్కడి ఉద్యోగులతోపాటు పలువురు నాయకులు, ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందని, అందుకోసమే రికవరీ చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు రికవరీ పేరిట పలు ప్రాంతాల్లో ఉద్యోగులను వేధిస్తూ వారి వద్దనుంచి అధికారులు ముడుపులు వసూళ్లు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఏది ఏమైనా జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement