గరీబోళ్ల గూడుపై రాబందులు | Sakshi
Sakshi News home page

గరీబోళ్ల గూడుపై రాబందులు

Published Thu, Oct 16 2014 11:53 PM

గరీబోళ్ల గూడుపై రాబందులు - Sakshi

గరీబోళ్ల ఇళ్ల స్థలాలపై గద్దలు వాలాయి. ఇందిరమ్మ ఇళ్ల మాటున భూ బకాసురులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కాసులు కురిపించే పారిశ్రామిక వాడను అడ్డగా చేసుకొని భూ దందాకు పక్కా ప్లాన్ వేశారు. గూడులేని నిరుపేదలకు ఇవ్వాల్సిన స్థలాలను నాయకులు అక్రమంగా అమ్ముకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట కళ్లు తిరిగే మోసానికి పాల్పడ్డారు.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం మండలంలోని బొల్లారం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం జిన్నారం మండలం హెచ్‌ఎండీఏ పరిధిలోకి ఉంది. అందువల్లే ఇక్కడి భూముల ధరలు చుక్కల్లో ఉంటాయి. అయినప్పటికీ స్థానిక కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు బొల్లారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీఓను తీసుకువచ్చింది.

2008లో మూడో విడత ఇందిరమ్మ పథకం ద్వారా బొల్లారంలోని 284 సర్వేనంబర్‌లో గల 25 ఎకరాల స్థలాన్ని ఇళ్లకు కేటాయిస్తూ అనుమతి ఇచ్చింది. అప్పటి మంత్రి సునీతారెడ్డి చేతుల మీదుగా ఒక్కో లబ్ధిదారునికి 80 గజాల చొప్పున 1,075 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను అందించారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు కొన్ని పట్టాలను తమ అనుకూలమైన వారికిచ్చి, మరికొన్ని పట్టాలను అమ్ముకొని రూ.కోట్లలో ఆర్జించారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇళ్ల స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నోసార్లు ఆందోళనలు నిర్వహించారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ప్రతిపక్షాల వేదన అరణ్యరోదనగానే మారిపోయింది.

సర్కార్ మార్పుతో మారిన సీన్
తాజాగా టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావటంతో కాంగ్రెస్ నాయకుల అక్రమాలపై అసలైన లబ్ధిదారులు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆర్డీఓతో విచారణ చేయించారు. నెల రోజులపాటు రెవెన్యూ అధికారులు జరిపిన విచారణలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. 1,075 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తే, అందులో కేవలం 308 మంది మాత్రమే అర్హులని అధికారులు నిర్ధారించారు. మిగతా 767 పట్టాలను అక్రమార్కులు కొట్టేసినట్లు అనుమానిస్తున్నారు. అక్రమార్కులు ఒక్కో పట్టాను డిమాండ్‌ను బట్టి  రూ. లక్ష నుండి రూ.2 లక్షల ఆపైగా విక్రయించినట్లు తెలిసింది. 1,075 మంది లబ్ధిదారులకు ఇచ్చిన సర్టిఫికెట్లలో 1,053 సర్టిఫికెట్లకు సంబంధించిన ప్లాట్లను మాత్రమే అధికారులు గుర్తించారు. మిగతా 22 ప్లాట్లకు సంబంధించిన స్థలాన్ని అధికారులు కూడా గుర్తించలేకపోయారు.

ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికలను రెవెన్యూ అధికారులు జిల్లా అధికారులకు పంపారు.  మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో బొల్లారం కాంగ్రెస్ నేతలు ఇళ ్ల స్థలాల కేటాయింపుల్లో అక్రమాలు జరిపారనే అరోపణలు ఉన్నాయి. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఇంతవరకూ చర్యలు తీసుకోలేకపోయారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల క్రయ, విక్రయాలు జరపకూడదనేనిబంధనలు ఉన్నా, ఇక్కడి నేతలు మాత్రం ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను యథేచ్ఛగా విక్రయించేసుకుంటున్నారు.

బొల్లారం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండడంతో ఇతర ప్రాంతాలు, పట్ట ణాల వారు ఇక్కడ భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో భూమాయగాళ్లు వారికి మాయ మాటలు చెప్పి ప్రభుత్వం కేటయించిన ఇళ్ల స్థలాలను విక్రయిస్తున్నారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని బొల్లారం ప్రాంత వాసులు కోరుతున్నారు.

Advertisement
Advertisement