జీవితాంతం ఉచిత మందులు | Sakshi
Sakshi News home page

జీవితాంతం ఉచిత మందులు

Published Sun, Jun 11 2017 4:31 AM

జీవితాంతం ఉచిత మందులు

ఎక్కడ వైద్య చికిత్స పొందినా వెల్‌నెస్‌ సెంటర్లలో మందులు
కాలేయ మార్పిడికి రూ.25 లక్షలు... గుండె మార్పిడికి రూ.18 లక్షలు
వాటికి ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం కింద ఉచిత చికిత్స
కొత్తగా దంత చికిత్సలకూ చోటు...


సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగులు, జర్నలిస్టులకు నగదు రహిత ఉచిత వైద్య చికిత్సలు అందజేస్తున్న ప్రభు త్వం, వారికి అవసరమైన మందులను జీవి తాంతం ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. మధు మేహం మొదలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు, గుండె, కిడ్నీ, కేన్సర్‌ సహా వివిధ జబ్బులకు చికిత్స చేశాక కొన్నింటికి జీవితాంతం, మరికొన్నింటికి కొన్నాళ్లపాటు మందులు వాడాల్సి ఉంటుంది. ఇకపై వాటన్నింటినీ ప్రభుత్వమే ఉచితంగా అందజేయనుంది. ఎక్కడ చికిత్స చేయించుకున్నా ప్రభుత్వం నెలకొల్పిన వెల్‌నెస్‌ సెంటర్లలో అన్ని రకాల మందులను ఉచితంగా సరఫరా చేస్తారు. అయితే దీనికి వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ తప్పనిసరి. ముఖ్యంగా రిటైర్‌ అయిన ఉద్యోగులు, జర్నలిస్టులు దీర్ఘకాలికంగా మందులు వాడాల్సి ఉంటుంది. వారందరూ ఇకనుంచి ఎక్కడా కొనుగోలు చేయాల్సిన పనిలేదు.

ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం 14 వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో ఇప్పటికే రెండు వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఇక షుగర్‌ పరీక్ష మొదలుకొని కేన్సర్‌ సహా మొత్తం 3,783 రకాల వైద్య పరీక్షలనూ నగదు రహిత ఆరోగ్య పథకం కింద ఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచితంగా చేయనున్నారు. కొన్నింటిని వెల్‌నెస్‌ సెంటర్లు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చేస్తారు. మరికొన్నింటిని ఒప్పందం చేసుకున్న డయాగ్నస్టిక్‌ సెంటర్లలో చేస్తారు. అలాగే 1,899 వ్యాధులకూ చికిత్స చేస్తారు. ఇక డయాలసిస్‌ కూడా జీవితాంతం ఉచితంగా చేస్తారు. కాగా, ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకానికి ప్రభుత్వం ఏటా రూ. 600 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.

అవయవ మార్పిడికి గరిష్టంగా రూ. 25 లక్షలు...
గతంలో ఉద్యోగుల వైద్య చికిత్సలకు గరిష్టంగా రూ. 2 లక్షల వరకు పరిమితి ఉండేది. అలాంటిది ఇప్పుడు పరిమితిని ఎత్తివేసిన ప్రభుత్వం అవయవ మార్పిడికి గరిష్టంగా రూ. 25 లక్షలు ఖర్చు చేసేలా ఉద్యోగులు, జర్నలిస్టుల నగదు రహిత ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్‌) ప్యాకేజీలో చేర్చింది. కాలేయ మార్పిడి (లైవ్‌)కి రూ. 25 లక్షలు, కాలేయ మార్పిడి (కెడావర్‌)కి రూ. 20 లక్షలు, ఊపిరితిత్తుల మార్పిడికి రూ. 20 లక్షలు, గుండె మార్పిడికి రూ. 18 లక్షలు, కిడ్నీ (లైవ్‌) మార్పిడికి రూ. 6 లక్షలు, కిడ్నీ (కెడావర్‌) మార్పిడికి రూ. 6.5 లక్షలు ఖర్చు అవుతుంది.

ఈ మొత్తం ఖర్చును కూడా ప్రభుత్వమే ఆరోగ్య పథకం కింద భరించనుంది. అలాగే మలేరియా, డెంగీ వంటి జ్వరాలనూ ఈ పథకంలో చేర్చింది. డెంగీ జ్వరం వచ్చి ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గితే వాటిని ఎక్కించేందుకు అవకాశం కల్పించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా దంత చికిత్సలన్నిం టినీ పథకంలో చేర్చింది. పన్ను పోతే కొత్త పన్ను వేసేందుకు వెసులుబాటు కల్పించింది. చిన్న పిల్లలకు చెవుడు వస్తే ఇచ్చే మిషన్లనూ ఈ పథకంలో కొత్తగా చేర్చింది. 23 రకాల కంటి శస్త్రచికిత్సలనూ చేర్చింది. అలాగే ప్లాస్టిక్‌ సర్జరీలనూ చేర్చింది. ముఖంపై తీవ్రగాయాలైతే ప్లాస్టిక్‌ సర్జరీకి వీలు కల్పించారు.

మూడు స్లాబ్‌లు... ఆ ప్రకారం ఆసుపత్రుల్లో గదులు
ఉద్యోగులు, జర్నలిస్టులను మూడు కేటగిరీలుగా వైద్య ఆరోగ్యశాఖ విభజించింది. ఆ ప్రకారం ఆసుపత్రుల్లో రూమ్‌లకు అర్హులుగా నిర్ధారించింది. స్లాబ్‌–‘ఏ’కేటగిరీలో గెజిటెడ్‌ ఆఫీసర్లు వస్తారు. స్లాబ్‌ ‘బీ’కేటగిరీలో నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్లు, జర్నలిస్టులు వస్తారు. స్లాబ్‌ ‘సీ’లో నాలుగో తరగతి ఉద్యోగులు వస్తారు. స్లాబ్‌ ఏ, బీ కేటగిరీలోని ఉద్యోగులు, జర్నలిస్టులకు ఆయా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సింగిల్‌ రూం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్లాబ్‌ సీ కేటగిరీకి చెందిన నాలుగో తరగతి ఉద్యోగులకు జనరల్‌ వార్డు కేటాయిస్తారు.

Advertisement
Advertisement