సాగర్ చుట్టూ ఫ్రీ వైఫై | Sakshi
Sakshi News home page

సాగర్ చుట్టూ ఫ్రీ వైఫై

Published Mon, Apr 6 2015 1:44 AM

సాగర్ చుట్టూ ఫ్రీ వైఫై - Sakshi

తొలి 30 నిమిషాలకు మాత్రమే ఉచిత సేవలు
 వారం రోజుల్లో ఐటీ మంత్రిచే లాంఛనంగా ప్రారంభం
 ఐఫోన్-6 వంటి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో 32-40 ఎంబీపీఎస్ సామర్థ్యంగల డేటా వినియోగానికి అవకాశం
 గ్రేటర్ వ్యాప్తంగా 3 వేల వైఫై హాట్‌స్పాట్ కేంద్రాలు
 ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్
 
 సాక్షి, హైదరాబాద్: ఉచిత వైఫై సేవల కల్పన దిశగా గ్రేటర్‌లో మరో ముందడుగు పడింది. చారిత్రక హుస్సేన్‌సాగరం చుట్టూ అరచేతిలో ఆధునిక సమాచార స్రవంతిని వినియోగించుకునే వైఫై సేవలను అరగంటపాటు ఉచితంగా పొందే ‘భాగ్యం’ మరో వారం రోజుల్లో సిటిజన్లకు దక్కనుంది.
 
 దీనికోసం ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో 19 వైఫై హాట్‌స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరో వారం రోజుల్లో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. వీటి ప్రారంభంతో ఐఫోన్-6 వంటి ఆధునిక స్మార్ట్‌ఫోన్లలో 32 నుంచి 40 ఎంబీపీఎస్ సామర్థ్యమున్న వైఫై సేవలు అరగంటపాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఆపై వినియోగించేవారికి నిర్దేశిత ఛార్జీలు వర్తింపజేయనున్నట్లు ఐటీ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కాగా గ్రేటర్ వ్యాప్తంగా మూడు వేల వైఫై హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ముందుకొచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు తమకు అనుమతి మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ఐటీ శాఖకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం అనుమతించిన పక్షంలో గ్రేటర్‌వ్యాప్తంగా అరగంటపాటు ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే గతంలో పలు ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చినా బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థకే ఈ అవకాశం ఇస్తే వివాదాలు, విమర్శలకు తావుండదన్న ఉద్దేశంతో ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది.
 
 వైఫై అంటే..
 వైఫై అంటే.. వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్క్ (డబ్ల్యూఐఎల్‌ఏఎన్). ఇది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్(ఐఈఈఈ) 802.11 స్టాండర్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఆంగ్లభాషలో డబ్ల్యూఎల్‌ఏఎన్‌ను కుదించి ‘వైఫై’ అని పిలుస్తున్నారు. అంటే ైవెర్లైస్ ఫెడిలిటీ అన్నమాట. ఒక్క వైఫై టవర్ సిగ్నల్స్ ఇండోర్‌లో అయితే 20 మీటర్లు, ఔట్‌డోర్‌లో అయితే 100 మీటర్లు వరకు అందుతాయి. వైఫైతో కంప్యూటర్లు, వీడియో గేమ్స్ పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు, కొన్ని రకాల డిజిటల్ కెమెరాలు, ట్యాబ్లెట్స్, డిజిటల్ ఆడియో ప్లేయర్లు వంటివెన్నో కనెక్ట్ అయి ఉంటాయి.
 
 సిగ్నల్స్ ఇలా..
 తీగల అవసరం లేకుం డా నిర్ణీత పరిధిలో హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొం దడమే వైఫై. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న తర్వాత వైఫై రూటర్ పరికరాన్ని అమరుస్తారు. ఈ పరికరం బ్రాడ్ బ్యాండ్ ద్వారా అందే ఇంటర్నెట్‌ను నిర్ణీత పరిధిలో వైఫై సౌకర్యం ఉన్న ఫోన్లు, కంప్యూటర్లు వంటివాటికి ఇంటర్నెట్ సిగ్నల్‌ను అందిస్తుంది.
 
 ఇలా వినియోగించుకోవాలి
 మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై ఆప్షన్‌పై క్లిక్‌చేసి మీ మొబైల్ నంబర్‌ను, ఈ-మెయిల్ అడ్రస్ టైప్‌చేసి సబ్‌మిట్‌చేయాలి.
 ఆ తరవాత మీ మొబైల్‌కు యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఎస్‌ఎంఎస్ రూపంలో అందుతాయి.
 రెండో బాక్సులో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ టైప్‌చేసి లాగిన్ కావాలి. అప్పుడు నిరంతరాయంగా వైఫై సేవలు అందుతాయి.
 
 ప్రస్తుత వినియోగం ఇక్కడే..
 సైబర్‌టవర్స్-మాదాపూర్ పోలీస్‌స్టేషన్,సైబర్ టవర్స్-కొత్తగూడా జంక్షన్, సైబర్ టవర్స్-రహేజా మైండ్‌స్పేస్ సర్కిల్ పరిధిలో గతేడాది అక్టోబర్‌లో 8 కి.మీ. మార్గంలో 17 కేంద్రాల వద్ద వైఫై సిగ్నల్స్‌ను అందించేందుకు హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేయడంతో సుమారు 50 వేల మంది నిత్యం 750 మెగాబైట్స్ నిడివిగల వైఫై సేవలను వినియోగించుకునే సౌకర్యం కలిగింది.  ఆయా ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్, ఇతర వైఫై ఆధారిత ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగిస్తున్న వారికి సాంకేతిక సేవల వినియోగం ఉచితం, సులభతరమైంది.

 


 

Advertisement
Advertisement