ఇక పరిషత్ వేడి... | Sakshi
Sakshi News home page

ఇక పరిషత్ వేడి...

Published Mon, Mar 17 2014 1:59 AM

from today filing of nominations for zptc,mptc

ఖమ్మం జడ్పీ సెంటర్, న్యూస్‌లైన్:  ఎన్నికల సంగ్రామంలో పరిషత్ వేడి రాజుకుంది. ఏప్రిల్ 6, 8 తేదీల్లో రెండు విడతలుగా జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు బ్యాలెట్ బాక్సులను సమకూర్చారు. కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నేటి నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎంపీటీసీ అభ్యర్థులు మండల కేంద్రాల్లో, జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా పరిషత్‌లో నామినేషన్లు వేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

 21న నామినేషన్లను పరిశీలిస్తారు. 22 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లపై అభ్యంతరాలు, 23న అభ్యంతరాల తిరస్కరణ ఉంటుంది. 24 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఈ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇప్పటికే సమస్యాత్మక, అతి సమస్యాత్మక , తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలను ఆయా మండలాలకు చెందిన తహశీల్దార్, ఎంపీడీవో, ఎస్సైలతో కూడిన కమిటీలు గుర్తించాయి. ఇందుకోసం ప్రత్యేక పోలీస్ బలగాలను రప్పించేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం డివిజన్లకు ఏప్రిల్ 6న, ఖమ్మం డివిజన్‌లో 8న ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జేసీ సురేంద్రమోహన్ ఆదివారం జిల్లా పరిషత్ ఆవరణంలో రిటర్నింగ్ అధికారులతో  సమావేశం నిర్వహించి, ఎన్నికల నిర్వహణ భాధ్యత రిటర్నింగ్ అధికారులపైనే ఉందని స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలకు పాల్పడినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

 అధికారుల హడావుడి ...
 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో జిల్లా పరిషత్ అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 46 జెడ్పీటీసీ, 46 ఎంపీపీ, 640 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. పోలింగ్ స్టేషన్‌ల తుది జాబితాపై కసరత్తు చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసిన అధికారులు బ్యాలెట్ పేపర్ల ముద్రణకు టెండరు ప్రకటన జారీ చేశారు. అభ్యర్థుల తుది జాబితా ఖరారైన అనంతరం ముద్రణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఎన్నికల నిర్వహణకు 46 మంది రిటర్నింగ్ అధికారులు,92 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు.

 జెడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు, ఎంపీటీసీలకు పింక్ (ఊదా) రంగు బ్యాలెట్ పేపర్లను కేటాయించారు. ఈ ఎన్నికల్లో 15,26,998 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 7,54,632 మంది పురుషులు, 7,72,366 మంది మహిళలు ఉన్నారు. ఒక ఓటరు రెండ్లు ఓట్లు వేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులు రూ.2 కోట్లు విడుదల చేశారు.

 రిజర్వేషన్ ఇలా...
  జిల్లాలోని 46 జడ్పీటీసీ, 640 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్‌లు పూర్తి చేశారు. ఇందులో మహిళలకు 23 జడ్పీటీసీలు (50 శాతం), మిగిలిన 23 జనరల్(పురుష/మహిళా అభ్యర్థులు)కు కేటాయించారు. కాగా మొత్తం స్థానాల్లో ఎస్టీ జనరల్‌కు 7, ఎస్టీ మహిళలకు 8, ఎస్సీ జనరల్ 4, ఎస్సీ మహిళలకు 4, జనరల్ 7, బీసీ జనరల్ 5, బీసీ మహిళ 5, జనరల్ మహిళ 6 స్థానాలు రిజర్వ్ చేశారు. అలాగే 640 ఎంపిటీసి స్థానాలకు ఎస్టీలకు 225, ఎస్సీలకు 110, బీసీలకు 106, ఇతరులకు 199 స్థానాలను కేటాయించారు. వీటిలో ఏజన్సీలో ఎస్టీలకు 145, ఎస్సీలకు 27, బీసీలకు 13, అన్‌రిజర్వుడ్ 68, మైదాన ప్రాంతంలో ఎస్టీలకు 80, ఎస్సీలకు 63, బీసీలకు 93, అన్‌రిజర్వుడ్ 131 స్థానాలను రిజర్వ్ చేశారు.

 పన్నుల చెల్లింపునకు పరుగులు...
  పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు ఎంపీటీసీగా విజయం సాధించి ఎంపీపీ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరికొందరు జడ్పీటీసీ పదవి కోసం పావులు కదుపుతున్నారు. నామినేషన్ నాటికి ఆయా పంచాయతీలకు చెల్లించాల్సిన పంపు, ఇంటి పన్నులు చెల్లించాలి. లేకుంటే ఆయా అభ్యర్థులను రిటర్నింగ్ అధికారులు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో గ్రామ స్థాయి నేతలు పన్నుల చెల్లింపునకు పరుగులు తీస్తున్నారు.

Advertisement
Advertisement