రేపటి నుంచి షర్మిల యాత్ర | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి షర్మిల యాత్ర

Published Sun, Jun 28 2015 1:24 AM

రేపటి నుంచి షర్మిల యాత్ర - Sakshi

వైఎస్ మృతిని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలకు పరామర్శ మంద మల్లమ్మ చౌరస్తాలో రాజశేఖరరెడ్డికి నివాళి జిల్లెలగూడ నుంచి రంగారెడ్డి జిల్లా పర్యటన ప్రారంభం
సాక్షి,సిటీబ్యూరో:
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతి చెందినవారి కుటుంబాలను మహానేత తనయవైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు షర్మిల సోమవారం నుంచి రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్ర చేపడతారు. తొలుత సరూర్ నగర్ మండలం జిల్లెల గూడలో మరణించిన బచ్చనబోయిన అంజయ్య యాదవ్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శిస్తారు.

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మంద మల్లమ్మ చౌరస్తాలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం షర్మిల పరామర్శ యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు మహేశ్వరం మండలం మంఖాల్, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామాల్లోని మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. మంగళవారం ఉదయం మేడ్చల్ నియోజకవర్గంలోని కొండ్లకోయ నుంచి యాత్రను ప్రారంభించి... మేడ్చల్, కేసారం, మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్‌లలో పరామర్శ యాత్ర కొనసాగిస్తారు. బుధవారం మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి, పరిగి మండలం రంగాపూర్, గొట్టిఖుర్దు, తాండూరులలో మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. గురువారం వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి, మోమిన్‌పేట, ఎన్కతలను సందర్శిస్తారు.
 
భారీగా స్వాగతం పలుకుదాం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం ఏ కార్యక్రమం తలపెట్టినా రంగారెడ్డి జిల్లానే ఎంచుకునే వారని... ప్రస్తుతం ఆయన కుమార్తె షర్మిల జిల్లా పర్యటనకు వస్తున్న దృష్ట్యా ఆమెకు భారీగా స్వాగతం పలకాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, జిల్లా అధ్యక్షులు సురేష్‌రెడ్డి శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement