తాగునీటి గండం గట్టెక్కినట్లే! | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 4 2017 2:48 AM

Full of drinking water at the water projects

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ రాష్ట్రాల  నుంచి దిగువకు వస్తున్న ప్రవాహాలతో రాష్ట్ర ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటితో పూర్తిస్థాయి సాగు అవసరాలను తీర్చే అవకాశాలు లేకున్నా, తాగునీటి గండం నుంచి మాత్రం గట్టెక్కే అవకాశాలున్నాయని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ అవసరాలకు పెద్దదిక్కుగా ఉన్న సాగర్‌లోకి స్థిరంగా ప్రవాహాలు వస్తుండటం, ఎగువ శ్రీశైలానికి భారీ ప్రవాహాలు కొనసాగుతుండటం రాష్ట్రానికి ఉపశమనమిస్తోంది. 

మిషన్‌ భగీరథకు ఢోకాలేదు
నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, శ్రీశైలం, కడెం, సింగూరు వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటి నిల్వలు 727.39 టీఎంసీలు కాగా ప్రస్తుతం 438.9 టీఎంసీల మేర నిల్వలున్నాయి. ఇందులో ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు దిగువన  168 టీఎంసీలు ఉండాల్సిందే. శ్రీశైలంలో ఏపీ వాటా మరో 100 టీఎంసీలు, ఆవిరి నష్టాలు మరో 20 టీఎంసీలను పక్కన పెట్టినా, గరిష్టంగా 150 టీఎంసీల రాష్ట్ర వాటా ఉన్నట్టే. ఇందులో ఇప్పటికే సాగు ప్రాజెక్టులకింద ఉన్న తాగునీటి కేటాయింపులు 40 నుంచి 50 టీఎంసీల వరకు ఉన్నాయి. ఇక మిషన్‌ భగీరథ కింద ఈ ఏడాది జనవరి నుంచి 60 టీఎంసీల అవసరాలు ఉండనున్నాయి. ముఖ్యంగా నాగార్జునసాగర్‌ కింద వచ్చే జూలై వరకు మిషన్‌ భగీరథకు 16 టీఎంసీలు, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు మరో 16 టీఎంసీలు, కల్వకుర్తి కింద 5 టీఎంసీల మేర అవసరం ఉంది. ప్రస్తుతం సాగర్లో కనీస నీటి మట్టం 510 అడుగులకు ఎగువన 13 టీఎంసీల నీటి లభ్యత ఉంది.

అయితే ఎగువన వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలంలోకి 1.21లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నిల్వ 181 టీఎంసీలకు చేరింది. ఇక్కడ లభ్యతగా ఉన్న నీటిని అవసరానికి తగ్గట్టు ప్రస్తుతం తెలంగాణ వినియోగించుకుంటోంది. ప్రస్తుతం శ్రీశైలానికి వస్తున్న ప్రవాహాలతో మరింత నిల్వలు పెరిగితే వాటా ప్రకారం సాగర్‌నుంచి గరిష్టంగా 70 నుంచి 80 టీఎంసీల వాటా అయినా దక్కే అవకాశం ఉంది. ఈ నీటితో వచ్చే ఏడాది వరకు తాగునీటి కష్టాలను సమర్ధంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక గోదావరి బేసిన్‌ పరిధిలోని సింగూరు, ఎల్లంపల్లి, కడెంలు పూర్తి స్థాయి మట్టాలకు చేరుకున్నాయి. ఎస్సారెస్పీలో అనుకున్న మేర నీటి నిల్వలు చేరకున్నా, ప్రాజెక్టులో లభ్యతగా ఉన్న 37.38 టీఎంసీల నీటితో తాగునీటి అవసరాలకు ఢోకాలేదు. ఒక్క నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింది తాగునీటి అవసరాలకు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సింగూరుకు మరిన్ని ప్రవాహాలు కొనసాగితే, అక్కడి నుంచి నిజాంసాగర్‌కు నీటి విడుదల జరిగే ఆస్కారం ఉంది. అదే జరిగితే ఇక్కడి అవసరాలు సైతం తీరుతాయని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement