రూ.25 కోట్లు ల్యాప్స్! | Sakshi
Sakshi News home page

రూ.25 కోట్లు ల్యాప్స్!

Published Sat, Mar 29 2014 3:31 AM

funds are not used due to officers neglect

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను కూడా వారు వినియోగించడం లేదు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం విడుదల చేసిన దాదాపు రూ.25 కోట్లకుపైగా నిధులు ల్యాప్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం గడువు మార్చి 31తో ముగుస్తుంది. అంటే ఇంకా రెండు రోజులు ఉందన్నమాట. ఈ నిధులను అధికారులు రెండు రోజుల్లో ఎలా ఖర్చు చేస్తారో వారికే తెలియాలి. ఆయా ప్రభుత్వ శాఖల నిధులను తమ తమ అకౌంట్లలో ‘డ్రా’ చేసుకునేందు కు సమయం ముంచుకొస్తుండటంతో అధికారులు ఊగిసలాటలో పడ్డారు.

ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నందున  31న బిల్లులు డ్రా చేసుకునే అవకాశాలు తక్కువగా కన్పిస్తున్నాయి. దీనికి కారణమేంటంటే కిందిస్థాయి సిబ్బంది నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ఎన్నికల్లో పాల్గొనడమే.. శని వారం బ్యాంకులు మధ్యాహ్నం వరకే పనిచేస్తాయి. దీంతో బిల్లులు డ్రా చేసుకునేందుకు కష్టమయ్యే పరిస్థితులు ఉన్నం దున కలెక్టర్ శనివారం సాయంత్రం వరకు కూడా బ్యాంకులు పని చేసే విధంగా అనుమతి పొందినట్లు సమాచారం.

 రూ.25 కోట్లకుపైగా వెనక్కిపోయే అవకాశం
 ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండడంతో జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన రూ.25 కోట్లకు పైగా నిధులు ల్యాప్స్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఒకవేళ నిధులు ల్యాప్స్ అయితే ఈ నిధులు తిరిగి ప్రభుత్వానికి వెళ్తాయి. ల్యాబ్స్ అయిన నిధులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం కింద నిధులు విడుదల చేస్తుంది. ల్యాప్స్ అయిన నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరం (2014-15)లో కలిపి ప్రభుత్వం విడుదల చేస్తుంది. దీంతో జిల్లాకు తక్కువ బడ్జెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ శిశు సంక్షేమం, జెడ్పీ, విద్యార్థుల స్కాలర్ షిప్‌లు, గిరిజన సంక్షేమ శాఖలతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన రూ.కోట్ల నిధులు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉంది.

 ప్రస్తుత చెల్లింపులు..
 జిల్లాలో ఎన్నికల కోడ్ మార్చి మొదటి వారంలో అమలులోకి రావడంతో నిధులను ఫ్రీజింగ్ చేస్తూ ఈ నెల 5న రాష్ట్ర ఆర్థికశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయినా విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన విద్యుత్ బిల్లులు, తాగునీటి సరఫరా బిల్లులు, టెలిఫోన్, ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, మెడికల్ రీయింబర్స్‌మెంట్, జీపీఎఫ్, ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్స్, విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన బిల్లులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో శానిటేషన్ బిల్లులు, కోర్టు, పోలీసులకు చెందిన బిల్లులు మాత్రమే చెల్లిస్తున్నారు. ఫ్రీజింగ్ చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో టీఏ, డీఏ, ప్రభుత్వ కార్యాలయాలకు పనులకు సంబంధించిన బిల్లులు, అద్దె వాహనాల, ప్రైవేట్ భవనాల, కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసే బిల్లులను ఆపివేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసినా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల బిల్లుల చెల్లింపులు మాత్రం కొనసాగవచ్చని, ఇందుకు ఆదేశాలు జారీ కావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement