104కు బ్రేక్! | Sakshi
Sakshi News home page

104కు బ్రేక్!

Published Tue, Sep 16 2014 12:26 AM

104కు బ్రేక్!

►  నిధులు లేక నిలిచిన 12 సర్వీసులు
►  మూడు నెలల నుంచి అందని సేవలు
►  రావాల్సింది రూ.61.60 లక్షలు
►  మందులున్నా.. రోగులకు అందని వైద్యం
 సాక్షి, కరీంనగర్ : గ్రామీణ ఆరోగ్య ప్రదాయినికి ఆపదొచ్చింది. పిలవకుండానే.. పరుగెత్తుకుంటూ పేదవాడి ఇంటికెళ్లి.. వైద్యం అందించే  104 సేవలు చాలాచోట్ల మూడు నెలల నుంచి నిలిచిపోయాయి. అంబులెన్సుల్లో మందులున్నా.. డీజిల్‌కు డబ్బులు లేక కొన్ని.. మరమ్మతుకు నోచుకోక షెడ్లకే పరిమితమై కొన్ని వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 22 సర్వీసులుంటే.. ప్రస్తుతం 10 మాత్రమే తిరుగుతున్నాయి. చొప్పదండి, కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, మహాదేవ్‌పూర్, రాయికల్, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల, హుస్నాబాద్, జమ్మికుంటలో వాహనాలు నిలిచిపోయాయి. ఆయా మండలాల పరిధిలోని వందలాది గ్రామాలు.. లక్షలాది మందికి సేవలు అందని పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం విషజ్వరాలు ప్రబలడం.. సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో 104 సేవలు నిలిచిపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైద్యారోగ్య సిబ్బంది వెళ్లని మారుమూల ప్రాంతాలకు 104 వాహన సిబ్బంది వెళ్లి సేవలందించారు. మూడు నెలలుగా వాహనాలు నిలిచిపోవడంతో ఆ ప్రాంతాల్లో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క.. 104 వాహనాల్లో దమ్ము వ్యాధిగ్రస్తులకు సల్‌బుటమాల్, ఫిట్స్ రోగులకు సోడియం వాల్‌పొరేట్, పెంటియం సోడియం, షుగర్ మందులు అందుబాటులో ఉండేవి.

బహిరంగ మార్కెట్లో వీటి ఖరీదు ఎక్కువగా ఉండడంతో వేలాది మంది ఈ వాహనాలపైనే ఆధారపడుతున్నారు. మూడు నెలల నుంచి వాహనాలు తిరగక పోవడంతో.. దమ్ము, షుగర్, ఫిట్స్ వ్యాధిగ్రస్తులు బహిరంగ మార్కెట్లో ఖరీదైన మందులు కొనలేక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. వాహనాల్లో ఇచ్చే సిప్రోఫ్లాక్సిసిన్ (యాంటిబయాటిక్), ఓఆర్‌ఎస్, కొట్రిమాక్సిజోల్ టానిక్, పీసీఎం (చిన్నపిల్లల కోసం), సొట్రానిసిన్ (గాయాలు), బెన్‌జోట్ సొల్యూషన్ (ఎలర్జీ) మందులు కూడా అందని పరిస్థితి నెలకొంది.
 
రావల్సింది రూ.61.60 లక్షలు
104 వాహనాలు జిల్లాలో మొత్తం 22 ఉన్నాయి. డ్రైవర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్‌ఎంలు మొత్తం 130 మంది ఉన్నారు. ఒక్కో వాహన నిర్వహణకు ప్రతి నెల ప్రభుత్వం రూ.1.10 లక్షలు కేటాయిస్తుంది. అందులో మందులకు రూ.40 వేలు, డీజిల్‌కు రూ.12 వేలు, మిగతావి సిబ్బంది వేతనాలకు వినియోగిస్తారు. నాలుగు నెలల నుంచి మందులకు తప్ప.. డీజిల్, వేతనాల కోసం నయాపైసా విదిల్చిలేదు. వీటి కోసం రూ.61.60 లక్షలు రావాల్సి ఉంది. మందులు అందుబాటులో ఉన్నా.. వాహనాలు నడవకపోవడంతో రోగులకు పంపిణీ చేయలేని పరిస్థితి.

గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కొనసాగుతున్న 104 సేవలు నిలిచిపోకుండా చ ర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇదివరకే జిల్లా అధికారులను ఆదేశించింది. అవసరమైతే జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) నిధులను వినియోగించుకోవాలని సూచిం చింది. ఈ నెల 14న.. జిల్లాకు వచ్చిన వైద్యారోగ్యశాఖ డెరైక్టర్ పి.సాంబశివరావు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కానీ, మన జిల్లాలో మాత్రం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నుంచి నయాపైసా ఇవ్వకుండా వాహనాలు మూలకు పడేశారు. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి వివరణ ఇస్తూ.. నిధు విడుదలయ్యాయని, త్వరలో పునరుద్ధస్తామని చెప్పారు.

Advertisement
Advertisement