కరోనా కర్మకాండ! | Sakshi
Sakshi News home page

కరోనా కర్మకాండ!

Published Wed, Apr 22 2020 4:20 AM

Funeral Difficulties After Corona Death - Sakshi

► చెన్నైలో ఈనెల 19న కరోనాతో డాక్టర్‌ మరణించాడు. అంత్యక్రియల కోసం కుటుంబసభ్యులు, స్నేహితులు శ్మశానవాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లగా స్థానికులు అడ్డగించారు. అక్కడ ఖననం చేస్తే వైరస్‌ వ్యాపిస్తుందనే భయంతో దాడి చేశారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ సహా పలువురు గాయపడ్డారు. దాడి నుంచి తప్పించుకోవడానికి ఆ డాక్టర్‌ కుటుంబం పరుగెత్తాల్సి వచ్చింది. చివరకు పోలీసు భద్రతతో అతని కుటుంబసభ్యులు లేకుండానే ఒక స్నేహితుడు, మరో ఇద్దరి సాయంతో డాక్టర్‌కు చివరి వీడ్కోలు పలికారు.

► అలాగే ఆదివారమే జార్ఖండ్‌లోని రాంచీలో ఒక వ్యక్తి కరోనాతో చనిపోయాడు. మృతదేహాన్ని శ్మశానవాటికలో పాతిపెట్టాలని రాంచీ జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుమారు 200 మంది ప్రజలు శ్మశానవాటిక వెలుపల పెద్ద ఎత్తున నిరసన తెలిపి అడ్డుకున్నారు. శవాన్ని వేరే చోట పాతిపెట్టాలని డిమాండ్‌ చేశారు. మృతదేహాన్ని శ్మశానవాటికలో ఖననం చేస్తే అక్కడి ఎలుకలు వైరస్‌ను తమ ఇళ్లలోకి తీసుకొస్తాయని నినదించారు.

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కాలంలో చివరికి కర్మకాండలు చేయడం కూడా సమస్యగా మారింది. కరోనాపై పోరాడుతున్న ఒకరిద్దరు డాక్టర్లు మొదలు చనిపోయే సామాన్యుల వరకు వారికి అంతిమ సంస్కారాలు చేయడం కష్టంగా మారింది. అనేక రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు కరోనా చావులు ఆయా కుటుంబాల్లో జీవిత వేదనగా చేదుజ్ఞాపకంగా మిగులుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే మృతదేహాలను ఖననం చేస్తామని చెప్పినా ప్రజలు అంగీకరించడంలేదు. చెన్నైలో డాక్టర్‌ మృతదేహం ఖనన ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ సంఘటన అనంతరం అక్కడి డీఎండీకే పార్టీ అధినేత విజయ్‌కాంత్‌ తన యాజమాన్యంలోని ఒక కాలేజీలో కొంత స్థలాన్ని కరోనాతో చనిపోయే రోగుల మృతదేహాల ఖననానికి కేటాయించారు. దేశంలో పలుచోట్ల, తెలంగాణలో అక్కడక్కడ ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి.

సాధారణ పరిస్థితుల్లో చనిపోయిన మృతదేహాలను కూడా ఖననం చేసేందుకు సమీపంలో ఉండే స్థానికులు అడ్డుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కరోనాతో చనిపోయిన చెన్నై డాక్టర్‌కు నివాళి అర్పిస్తూ, అలాగే డాక్టర్లపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, వారిని అనేకచోట్ల ఇళ్లల్లోకి రానీయని పరిస్థితులపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) బుధవారం రాత్రి 9 గంటలకు ‘వైట్‌ అలెర్ట్‌’కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ రోజు రాత్రి 9 గంటలకు అన్ని ఆసుపత్రుల్లోని వైద్యులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపాలని కోరింది. అలాగే వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలపై జరుగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా జరిగే వైట్‌ అలెర్ట్‌లోనూ పాల్గొనాలని నర్సింగ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ ప్రధాన కార్యదర్శి రుడావత్‌ లక్ష్మణ్‌ ఓ ప్రకటనలో కోరారు.

ఎలా చనిపోయినా ‘కరోనా’జాగ్రత్తలే...
కరోనా అనుమానిత లక్షణాలతో చనిపోయినవారి శాంపిళ్లను సేకరించకూడదని, వారిని కరోనా పాజిటివ్‌ వ్యక్తులుగానే పరిగణించి ఖననం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దాంతోపాటు తాజాగా చెన్నై, రాంచీ సహా దేశవ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వారి మృతదేహాల ఖననాలకు ఎదురైన అడ్డంకులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా మళ్లీ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో కరోనాతోనే కాకుండా ఏ విధంగా చనిపోయినా, ఆయా మృతదేహాలను కరోనా పాజిటివ్‌తో చనిపోయిన వారికి తీసుకునే జాగ్రత్తల ప్రకారమే కర్మకాండలు చేయాలని ఆదేశించింది. ఆసుపత్రుల్లోనూ, ఇళ్లలోనూ ఎక్కడ చనిపోయినా ఈ పద్ధతి పాటించాలని కోరినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. కరోనా అనుమానిత, నిర్ధారిత మృతుల అంత్యక్రియలకు ముందు కేవలం ముగ్గురు లేదా ఐదు మంది కుటుంబ సభ్యులు, బంధువులకు మాత్రమే కడచూపు అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులను మార్చురీ లోపలికి అనుమతించడం కాని మృతదేహాన్ని ముట్టుకోవడానికి అనుమతి ఉండదు.

ముఖం కనిపించే విధంగా మృతదేహాన్ని ప్లాస్టిక్‌ షీట్‌లో చుట్టి, లీక్‌ ప్రూఫ్‌ జిప్‌ బ్యాగులో ప్యాక్‌ చేస్తారు. మృతుడి ముఖం కనిపించేలా బ్యాగు ముందటి భాగం పారదర్శకంగా ఉంటుంది. ఇటువంటి వాటిని అన్ని ఆసుపత్రులు సమకూర్చుకోవాలి. ఈ పద్ధతి రాష్ట్రంలో ఏ విధంగా చనిపోయిన వ్యక్తుల మృతదేహాలకైనా వర్తిస్తుంది. ఎందుకంటే కరోనా అనుమానంతో చనిపోయిన వారి శాంపిళ్లను సేకరించి నిర్ధారణ పరీక్షలు చేయడాన్ని ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో తాజా నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా సహా ఇతరత్రా మృతదేహాల అంత్యక్రియలు సాఫీగా జరిగేందుకు ఇప్పటికే రాష్ట్రంలో ఒక కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ప్లాస్టిక్‌ షీట్‌లో మృతదేహాన్ని చుట్టడానికి ముందు రసాయన క్రిమిసంహారక మందులు కలిగిన నీటి మిశ్రమాన్ని శవంపై చల్లుతారు. అనంతరం శరీరాన్ని ప్లాస్టిక్‌ షీట్‌లో చుట్టి ఆపై తెల్లటి కాటన్‌ వస్త్రంతో చుడతారు. ఇకనుంచి అన్ని మృతదేహాలను ఇలాగే ఖననానికి ముందు ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement