తూటా వదిలిన పాట | Sakshi
Sakshi News home page

తూటా వదిలిన పాట

Published Fri, Apr 7 2017 2:11 AM

తూటా వదిలిన పాట - Sakshi

మావోయిస్టు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన గద్దర్‌
సాక్షి, హైదరాబాద్‌: విప్లవ గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్‌ మావోయిస్టు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తాను ఓటరుగా కూడా నమోదు చేసుకున్నానని, పార్లమెంటరీ పంథాలో జనం ముందుకు వెళతానని పేర్కొన్నారు. పల్లె పల్లె పార్లమెంటుకు అనే నినాదంతో పర్యటిస్తానని చెప్పారు.

ఎర్ర జెండాను పక్కనపెట్టి..
తనపై కాల్పులు జరిగి ఇరవై ఏళ్లయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గద్దర్‌ మాట్లాడారు. తన మాతృ సంస్థ మావోయిస్టు పార్టీ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. అమరవీరులకు కన్నీళ్లతో వందనాలు చెబుతూ.. చేతిలోని ఎర్రజెండాను పక్కన పెట్టి, బుద్ధుడి జెండా కట్టిన కర్రను చేతిలోకి తీసుకున్నారు. ‘‘మార్క్స్‌ జ్ఞాన సిద్ధాంతం మాత్రమే చాలదు.. అంబేడ్కర్‌ ఫూలేల మార్గం అవసరమంటూ నా మాతృ సంస్థతో పలుమార్లు చర్చించాను. అయితే ఇది మిత్ర వైరుధ్యమే.

నన్ను వెళ్లవద్దని వారించారు కూడా. కానీ రెండు దశాబ్దాలుగా తుపాకీ తూటాలను నాలో మోస్తున్నా. రెండు పడవలపై కాళ్లుపెట్టలేనని స్పష్టం చేశాను..’’అని పేర్కొన్నారు. మార్క్స్‌ జ్ఞాన సిద్ధాంతాన్ని, అంబేడ్కర్, ఫూలేల ఆలోచనలతో.. పల్లె పల్లె పార్లమెంటుకు అనే నినాదంతో ప్రజల ముందుకు వస్తున్నానని తెలిపారు. తాను ఓటరుగా కూడా నమోదు చేసుకున్నానని చెప్పారు. అయితే ఇప్పుడు తాను కేవలం ఓటరునేనని, ఏ రాజకీయ పార్టీ సభ్యత్వం లేదని పేర్కొన్నారు. తాను పార్టీ పెట్టడం కాదని, పార్టీని అల్లడానికి పూలలో దారం అవుతానని చెప్పారు.

దొరల తెలంగాణ వస్తుందని అప్పుడే భావించాం
ఎటువంటి తెలంగాణ అవసరమో ఉద్యమం నాడే చెప్పి ఉండాల్సిందని... అంబేడ్కర్‌ స్వాతంత్య్రం వస్తే నా జాతికేమిస్తారని అడిగినట్టే, మేం తెచ్చిన తెలంగాణ ఇలా ఉండాలని ముందే చెప్పి ఉండాల్సిందని గద్దర్‌ వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ల మాదిరిగానే ఇక్కడా దొరల రాజ్యం వస్తుందని ముందే భావించామని చెప్పారు. ఇప్పుడున్న భౌగోళిక తెలంగాణ కాదని, పాలన, అధికారం, అభివృద్ధి పైనుంచి కాకుండా.. కింద నుంచి అన్నీ అందాలని పేర్కొన్నారు. అటువంటి త్యాగాల తెలంగాణకు సిద్ధం కావాలని గద్దర్‌ పిలుపునిచ్చారు.

ప్రత్యామ్నాయం కావాలి: ప్రత్యా మ్నాయ తెలంగాణ కోసం పల్లె పల్లె పార్లమెంటుకు పాటతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని గద్దర్‌ పేర్కొన్నారు. ఇదెవరికీ వ్యతిరేకం కాదన్నారు. కొద్దిరోజుల్లో దక్షిణ భారతదేశంలోని 175 ప్రాంతాలను సందర్శించనున్నట్టు తెలిపారు. భావ సారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలని.. జాతీయ, ప్రాంతీయ పార్టీలు కలవాలని పిలుపునిచ్చారు. అప్పుడు మీరు కోరుకుంటే తాను దండలో దారం అవుతానని వ్యాఖ్యానించారు. తన మిగిలిన జీవితం అంతా అమర వీరుల స్వప్నమేనని పేర్కొన్నారు. గద్దర్‌ మిగతా జీవితం కూడా ఇప్పటిలాగే ప్రజలతో ముడిపడి ఉండాలని కోరుకుంటున్నట్లు గద్దర్‌ భార్య పేర్కొన్నారు. కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు హాజరయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement