ప్రతి చుక్కా పట్టాలి | Sakshi
Sakshi News home page

ప్రతి చుక్కా పట్టాలి

Published Thu, Jan 29 2015 3:43 AM

ప్రతి చుక్కా పట్టాలి

జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జల మట్టాలు నానాటికీ అడుగంటుతున్నాయి. ఈ తరుణంలో భూగర్భజలాలను పెంచేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. వృథాగా పోతున్న  వాన నీటిని భూమిలోకి ఇంకింపజేసేలా ‘బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్’ను ఏర్పాటు చేస్తూ అధికారులు ఓ ప్రణాళికను రూపొందించారు. తద్వారా ఏ పొలంలో పడిన వర్షపు నీరు ఆ పొలంలోనే ఇంకి భూగర్భజలాలు పెరగనున్నాయి.

ఇందుకు సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ను  పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకుని అధికారులు ప్రతిపాదనలకు సిద్ధం చేశారు.  

 
* భూగర్భ జలమట్టం పెంచేందుకు ప్రణాళిక
* పైలట్ ప్రాజెక్టుగా గజ్వేల్ నియోజకవర్గం
* రూ.66.49 కోట్లతో రూపకల్పన
* ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదన

 
సాక్షి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌లో భూగ ర్భ జల మట్టాలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి. నియోజకవర్గంలోని సగానికిపైగా మండలాలు డార్క్ ఏరియాలోకి వెళ్లాయి. కొత్త బోరుబావుల తవ్వకాల సంఖ్య పెరుగుతుండడం, అవసరానికి మించి భూగర్భ జలాలు వాడుకోవడం వల్ల సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గుతోంది. దీని ప్రభావం సాగుపై చూపడంతో పాటు ప్రజల తాగునీటి అవసరాలు తీరని పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో జిల్లా భూగర్భ జలశాఖ అధికారులు గజ్వేల్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో భూగర్భ జలమ ట్టాలను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ప్రతి వర్షపు చుక్కనూ వడిసి పట్టి భూగర్భంలోకి ఇంకిపోయేలా (వాటర్ రీచార్జ్) చేసి తద్వారా భూగర్భ జల మట్టాలను పెంచేలా రూ.66.49 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజే సి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆమోదానికి అధికారులు వేచి చూస్తున్నారు.

సీఎం కేసీఆర్ భూగర్భ జలశాఖ అధికారు లు ప్రతిపాదించిన పైలట్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పక్షంలో గజ్వేల్ నియోజకవర్గంలో ఏటా భూగర్భ జల మట్టాలు 0.66 మీటర్లు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. గజ్వేల్  నియోజకవర్గంలో ఆరు మండలాల్లో 68 పెద్ద చెరువులు, 823 చిన్న చెరువులు ఉన్నాయి. ఆయా చెరువుల ద్వారా తక్కువ మొత్తంలో పంటలు సాగు అవుతున్నాయి. దీంతో రైతులు బోరు బావులను తవ్వుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం 33,722 బోర్లు ఉన్నాయి. ఆయా బోర్ల ద్వారా పంటల సాగు కోసం ఖరీఫ్, రబీ సీజనల్ పెద్ద మొత్తంలో భూగర్భ జలాలను వినియోగిస్తున్నారు.

2011-12 భూగర్భ జలశాఖ నివేదికను పరిశీలిస్తే గజ్వేల్ నియోజకవర్గంలో 13,568 హెక్టా మీటర్ల భూగర్భ జలాలు ఉంటే, బోరుబావుల ద్వారా 11,984 హెక్టా మీటర్ల నీటిని తోడేశారు. 2013-14 నివేదికను అనుసరించి 11,019 హెక్టా మీటర్ల నీటిని వాడుకున్నారు. సాగు, తాగునీటి అవసరాల కోసం భూగర్భ జలాలను విరివిగా వినియోగిస్తుండడంతో క్రమంగా నీటి మట్టాలు పడిపోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో 15 నుంచి 25 మీటర్ల మేరకు భూగర్భ జలమట్టాలు పడిపోయినట్లు అంచనా.
 
ప్రతి వర్షం బొట్టూ ఇంకించేందుకు ప్రతిపాదన

వర్షాకాలంలో కురిసే ప్రతి నీటిబొట్టును భూగర్భంలోకి ఇంకించి తద్వారా గజ్వేల్ అంతటా భూగర్భ జల మట్టాలు పెంచాలని భూగర్భ జల శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగానే బోరు బావి సమాంతరంగా పది మీటర్ల దూరంలో పది మీటర్ల లోతుతో బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్‌ను ఏర్పాటు చేస్తారు. పొలంలో కురిసిన వర్షం నీరంతా బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్ ద్వారా భూమిలోకి ఇంకిపోయేలా చేస్తారు. ఇలా చేయడం ద్వారా బోరు బావులు ఉన్న ప్రాంతంలో భూగర్భ జల మట్టాలు పెరిగే అవకాశం ఉంటుంది.

గజ్వేల్ నియోజకవర్గంలో మొదటి దశలో దళితులు, గిరిజనులకు పంపిణీ చేసిన భూముల్లో భూగర్భ జల మట్టాలను పెంచేందుకు వీలుగా రూ. 66.49 కోట్లతో 16,624 బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయాలని భూగర్భ జలశాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందిం చారు. ఒక్కో బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్ నిర్మాణం కోసం రూ.40 వేలు ఖర్చు అవుతుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా బ్రాడ్‌షాప్ట్ రీచార్జ్ స్ట్రక్చర్‌ల నిర్మాణం చేపట్టాలని భూగర్భ జలశాఖ అధికారులు ప్రతిపాదిస్తున్నారు.

ఇదే జరిగితే గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం బోరుబావుల కింద సాగు అవుతున్న 39,459 హెక్టార్లలకు అదనం గా మరో 11,665 హెక్టార్లలో రైతులు డ్రిప్ ద్వారా పం ట లు సాగు చేసుకోవచ్చని భూగర్భ జలశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు రూపొందించిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement