నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం

Published Tue, Sep 30 2014 2:46 AM

నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం

 నీలగిరి :జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు, స్థాయీ సంఘ సమావేశాలకు గైర్హాజరవుతున్న సంబంధిత శాఖల అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి హెచ్చరించారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో  3వ వ్యవసాయ స్థాయీ సంఘ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి 14 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉంది. కానీ సమావేశంలో ప్రధాన ఎజెండా అంశాలైన డ్వామా, మార్కెటింగ్, అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారులు గైర్హాజరయ్యారు.
 
 డ్వామా పీడీ సెలవులో ఉన్నందున ఆమె స్థానంలో ఏపీడీ హాజరుకావాల్సి ఉండగా సూపరింటెండెంట్ వచ్చారు. అదేవిధంగా అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారికి బదులు కిందిస్థాయి ఉద్యోగి హాజరయ్యారు. ఇక మార్కెటింగ్ శాఖ అధికారులు ఎవరూ కూడా సమావేశానికి రాలేదు. దీంతో ఉద్యోగులతో సమీక్షలు చేయడం సాధ్యం కాదని.. జెడ్పీ సమావేశాలకు తప్పని సరిగా అధికారులు హాజరుకావాల్సిందేనని చైర్మన్, వైస్ చైర్మన్‌లు స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా అధికారులు సమీక్షలకు గైర్హాజరవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో సారి ఆ శాఖల అధికారులను రప్పించి కలెక్టర్ సమక్షంలో సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఈఓను ఆదేశించారు.
 
 వన్యప్రాణి విభాగం పై ఫైర్...
 నాగార్జునసాగర్ అటవీ శాఖ వన్యప్రాణి విభాగం అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చైర్మన్, వైస్‌చైర్మన్ మండిపడ్డారు. మారుమూల తండాల్లో కంకర రోడ్లు పూర్తయినా వాటిపై బీటీ వేయకుండా సం బంధింత అధికారి లేనిపోని కొర్రీలు పెడుతున్నారని వాపోయారు. సాగర్‌లో మెయిన్‌రోడ్డుకు సమీపంలో నిర్మించిన దేవస్థానం గోపుర  శిఖరం అటవీ శాఖ నిబంధనలకు అడ్డుగా ఉం దన్న కారణంతో దానిని సంబంధిత అధికారి తీసుకెళ్లారని వైస్ చైర్మన్ తెలి పారు. హాలియా - పెద్దవూర కూడలి వద్ద ఏర్పాటు చేసిన సమ్మక్క-సారక్క దేవస్థానం లైట్లు పులులకు ఇబ్బందికరంగా మారాయని వాటిని తొలగించారన్నారు. ఈ విషయాలన్నీ చర్చించాల్సిన సమావేశానికి అధికారి గైర్హాజరుకావడం పట్ల వారు మండిపడ్డారు.
 
 అడ్డగోలు అక్రమాలు..
 కిరోసిన్ డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా కిరోసిన్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారని స్థాయీ సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. రెండు నెలల పేరు మీద ఒక్కసారి మాత్రమే కిరోసిన్ పంపిణీ చేసి మిగతా కోటాను బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని వైస్ చైర్మన్ అధికారులకు వివరించారు. నెలవారీ కోటాలో కోత పెడుతూ చివరకు వచ్చే సరికి ట్యాం కుల కొద్దీ కిరోసిన్ అక్రమంగా హోల్‌సేల్ డీలర్లు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇక ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేయడంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సకాలంలో కాంట్రాక్టర్లు లారీలను పం పడం లేదని దీంతో రైతులే స్వయంగా డబ్బులు చెల్లించి ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ధాన్యం తరలిస్తున్నారని సభ్యులు వివరించారు.
 
 అలాకాకుండా వచ్చే సీజన్ నుంచి ధాన్యం రవాణా బాధ్యతలను సంఘాలకు అప్పగించాలని సభ్యులు సూచించారు. ఇక సూక్ష్మనీటి పారుదల శాఖ ఉద్యోగులు డ్రిప్ మంజూరు చేయకుండా లబ్ధిదారుల నుంచి సంతకాలు తీసుకుంటున్నారని.. వాటి పై ఎంపీపీ, జెడ్పీటీసీలను సంతకం చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని వైస్ చైర్మన్ సంబంధిత అధికారులకు తెలిపారు. లబ్ధిదారుల పేరు మీద ఇతర జిల్లాలకు డ్రిప్ పరికరాలు తరలిస్తున్నారని, డ్రిప్ ఏజెన్సీలు అక్రమాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత డ్రిప్ బిల్లులు చెల్లించాలని, రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మంజూరు చేయాలని వైస్ చైర్మన్, సభ్యులు సూచించారు. యూరియా కోటా సహకార సంఘాలకు 60 శాతం, అధీకృత డీలర్లకు 40 శాతం ఇవ్వాలని సభ్యులు సమావేశంలో ప్రతిపాదించారు. ఈ సమావేశానికి జెడ్పీ సీఈఓ దామోదర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రవి, సీహెచ్ కోటేశ్వరారవు, యాదగిరి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement