అపరిశుభ్రతపై జీహెచ్‌ఎంసీ కొరడా | Sakshi
Sakshi News home page

అపరిశుభ్రతపై జీహెచ్‌ఎంసీ కొరడా

Published Mon, Jun 22 2015 2:11 AM

అపరిశుభ్రతపై జీహెచ్‌ఎంసీ కొరడా

- కేఎఫ్‌సీకి జరిమానా
- సెప్టిక్ ట్యాంకర్ల సీజ్
- స్వచ్చ హైదరాబాద్‌కు చర్యలు
సాక్షి, సిటీబ్యూరో:
రోడ్లపై చెత్తా చెదారం, వ్యర్థాలను పడవేసే వారి పై జీహెచ్‌ఎంసీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. హిమాయత్‌నగర్‌లో హోటల్ వ్యర్థాలను రోడ్డుపై వేస్తున్న కేఎఫ్‌సీతో పాటు ఉప్పల్‌లో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను డ్రైనేజీలో వదులుతుండగా వాహనాలపై అధికారులు కన్నెర్ర చేశారు. ఏకంగా కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానా విధించారు.

వివరాల్లోకి వెళ్తే.. హిమాయత్‌నగర్ ప్రధాన రహదారిపై ‘కేఎఫ్‌సీ’ రెస్టారెంట్ వారు గత కొంతకాలంగా హోటల్ వ్యర్థాలను రోడ్డుపై వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం దుర్గంధమయం అయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు రెండు రోజుల క్రితం హోటల్ నిర్వాహకులను తీవ్రంగా హెచ్చరించారు. అయినా కేఎఫ్‌సీ సిబ్బంది ‘మా యాజమాన్యానికి  చెబుతాం’ అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఆగ్రహానికి గురైన అధికారులు కేసు నమోదు చేసి రూ. 10 వేల రూపాయలు జరిమానా విధించారు.
 
ఉప్పల్‌లో ట్యాంక్‌లు సీజ్
సెప్టిక్ ట్యాంక్‌లో తీసుకొచ్చిన వ్యర్థాలను డ్రైనేజీలో వదులుతుండగా గమనించిన జీహెచ్‌ఎంసీ అధికారులు వాహనాలను అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు.నగరంలోని రామంతాపూర్ మోడ్రన్ బేకరి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను మ్యాన్‌హోల్‌లో వదులుతుండగా అటుగా వెళ్తున్న ఈస్ట్ జోనల్ కమిషనర్ గమనించారు. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి సెప్టిక్ ట్యాంక్‌ను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం కూడా అదే విధంగా మరో వ్యక్తి వ్యర్థాలను వదులుతుండగా గమనించిన మెడికల్ ఆఫీసర్ మల్లిఖార్జున్ రావు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వాహనాలను స్వాధీనం చేసుకొని తాళం చెవులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చేలోగా మరో తాళం చెవితో వాహనాన్ని తీసుకొని ట్యాంకర్‌దారుడు ఉడాయించారు. మోటార్ వాహనాల చట్ట ప్రకారం కేసు నమోదుచేసి పరారీలో ఉన్న వాహన యజమాని కోసం గాలిస్తున్నట్లు ఎస్సై విక్రమ్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement