కోవిడ్‌ టెస్ట్‌లో మేయర్‌కు నెగిటివ్‌ | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

Published Mon, Jun 8 2020 10:06 AM

GHMC Mayor tests negative for Coronavirus Hyderabad - Sakshi

ముషీరాబాద్‌: ముషీరాబాద్‌ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్‌ కేసులు విజంభిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే నియోజకవర్గంలో 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భోలక్‌పూర్‌లోని పద్మశాలీకాలనీకి చెందిన వ్యక్తి(61)కి, నిమ్స్‌ ఆస్పత్రిలో పనిచేస్తూ రాంనగర్‌ మీసేవ సమీపంలో నివసించే ఓ నర్సు(30)కి, కవాడిగూడ డివిజన్‌లోని ఎస్‌బీఐ కాలనీలో నివసించే అపోలో పనిచేసే మహిళ(34)కి, హరిహర కళాక్షేత్రం సమీపంలో నివసించే ఓ వ్యక్తి(65)కి, ముషీరాబాద్‌లోని భరత్‌నగర్‌లో నివసించే ఉస్మానియా ఆస్పత్రి హౌస్‌సర్జన్‌(25)కు, ఫ్రెండ్స్‌కాలనీలో నివసించే మరో ఉస్మానియా ఆస్పత్రి హౌస్‌సర్జన్‌(24)కు, మంచానికే పరిమితమై చికిత్స పొందుతున్న భరత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి(59)కి, అలాగే రాంనగర్‌ రామాలయం ఎదురుగా నివసిస్తూ ఇటీవల మరణించిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ముగ్గురికి ఇప్పటికే కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తాజాగా భార్యతో పాటు మరో ఐదుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆదివారం ఒక్కరోజే కరోనా సోకినవారి సంఖ్య 13కు చేరగా, ముషీరాబాద్‌ నియోజకవర్గం వ్యాప్తంగా కోవిడ్‌–19 బారిన పడిన వారి సంఖ్య 95కు చేరుకుంది.

నిమ్స్‌ ఉద్యోగికి కరోనా
మన్సూరాబాద్‌: నిమ్స్‌ హాస్పిటల్‌లో కార్డియాలజీ ల్యాబ్‌ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తూ మన్సూరాబాద్‌ డివిజన్‌ హయత్‌నగర్‌ పరిధిలోని లెక్చరర్స్‌ కాలనీలో నివాసముంటున్న ఓ వ్యక్తి(49)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన ఉంటున్న ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీ హయత్‌నగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ మారుతీదివాకర్, మన్సూరాబాద్‌ కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డి ఆదివారం పరిశీలించి సోడియం హైపోక్లోరైడ్‌తో శానిటేషన్‌ చేయించారు. లెక్చరర్స్‌ కాలనీ రామాలయం గుడి వీధిలోని అతని నివాసాన్ని హోం కారంటైన్‌గా ప్రకటించారు. కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని, ఇంట్లోని వారందరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.

బంజారాహిల్స్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌కు...
జూబ్లీహిల్స్‌: బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ కాప్స్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌(27)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మూడు రోజులుగా ఒంట్లో నలతగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోవడంతో వ్యాధి బయటపడింది. యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌లో నివాసం ఉండే కానిస్టేబుల్‌ ప్రస్తుతం హోం క్యారంటైన్‌లో ఉన్నారు. కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. శనివారం పోలీస్‌స్టేషన్‌ను శానిటైజ్‌ చేశారు. శనివారం అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా విచారణ నిమిత్తం పోలీస్‌ స్టేషన్లోనే ఉన్నారు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

మూసారంబాగ్‌లో బ్యాంక్‌ మేనేజర్‌కు...
మలక్‌పేట: మూసారంబాగ్‌కు చెందిన ఓ బ్యాంక్‌ మేనేజర్‌(45)కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కొన్ని రోజులుగా ఆయన జ్వరం, దగ్గుతో బాధపడుతున్నాడు. ఈ నెల 2న నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. 5 తేదీన మరోసారి పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.

రామంతాపూర్‌లో ఏడుగురికి...
రామంతాపూర్‌: రామంతాపూర్‌లో ఆదివారం వివిధ బస్తీలు, కాలనీలలో ఆదివారం ఒక్కరోజే ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గోకులేనగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 76 ఏళ్ల వయసున్న వ్యక్తికి, 48, 21 సంవత్సరాలున్న ఇద్దరికి, 69 సంవత్సరాల ఓ మహిళకు కరోనా నిర్ధారణ అయింది. శ్రీనగర్‌ కాలనీకి చెందిన 49 సంవత్సరాల వ్యక్తికి, వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన 45 సంవత్సరాల మహిళకు, కామాక్షిపురానికి చెందిన 70 సంవత్సరాల మహిళకు కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. కరోనా నిర్ధారణ అయిన వారి ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

కరోనాతో జర్నలిస్టు మృతి
చంచల్‌గూడ: ఓ టీవీ చానల్‌లో క్రైమ్‌ రిపోర్టర్‌గా పని చేస్తున్న మనోజ్‌కుమార్‌ ఆదివారం కరోనా వైరస్‌తో మృతి చెందాడు. మాదన్నపేట్‌కు చెందిన మనోజ్‌ మినిస్ట్రియా గ్రేవీస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దానికితోడు కరోనా కూడా సోకింది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

ఏఎస్‌ఐకి పాజిటివ్‌...
అమీర్‌పేట: ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేసే ఓవ్యక్తి(560కి కరోనా సోకింది. క్రైం విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆయన గోల్కొండలో పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉంటున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రిలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్‌ పాజివివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

కాలాపత్తర్‌లో వృద్ధుడికి...
బహదూర్‌పురా: కాలాపత్తర్‌లో ఓ వృద్ధుడి(60)కి కరోనా పాజిటివ్‌ రావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించామని చార్మినార్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ జగన్‌ తెలిపారు. కాలాపత్తర్‌లో వ్యక్తికి కరోనా రావడంతో వారి కుటుంబంలోని ఐదుగురుని హోమ్‌ క్వారంటైన్‌ చేశామన్నారు.  

కోవిడ్‌ టెస్ట్‌లో మేయర్‌కు నెగిటివ్‌
ముందు జాగ్రత్తగా పరీక్ష చేయించుకున్న బొంతు రామ్మోహన్‌

లక్డీకాపూల్‌: శ్రేయోభిలాషులు, వైద్యుల సలహా మేరకు ముందుజాగ్రత్తగా కోవిడ్‌–19 పరీక్షలు చేయించుకున్న నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు నెగిటివ్‌ వచ్చినట్లు జీహెచ్‌ఎంసీ సీపీఆర్‌ఓ యాసా వెంకటేశ్వర్లు ఒక  ప్రకటనలో తెలిపారు. నగరంలో జరుగుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు పర్యవేక్షణలో భాగంగా నిరంతరం పర్యటిస్తున్న మేయర్‌ ఇటీవల స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక హోటల్‌లో టీ తాగరు. ఆ హోటల్‌లో అప్పుడు టీ పంపిణీ చేసినట్లుగా పేర్కొంటున్న వ్యక్తి, అప్పటికి పది రోజుల ముందు నుంచే విధులకు హాజరు కాలేదు. అనంతరం టెస్టుల్లో హోటల్‌లోని వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నిరంతరం మంత్రులు, తదితర  ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి తిరుగుతున్నందున  అపోహలను తొలగించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నెల 5న ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో  మేయర్‌ కోవిడ్‌–19 పరీక్షలు చేయించుకున్నారు అని పీఆర్‌ఓ పేర్కొన్నారు.  

రసూల్‌పురాలోని కానిస్టేబుల్‌కు పాజిటివ్‌
రసూల్‌పురా: నగరంలోనే అతిపెద్ద మురికివాడ ప్రాంతమైన రసూల్‌పురాలో మొదటిసారి కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ గేట్‌ సమీపంలోని మహ్మదీయ మసీదు లైన్లో నివాసం ఉంటూ మలక్‌పేట పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అనిల్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సమాచారం అందుకున్న బోర్డు అధికారులు, బేగంపేట పోలీసులు అనిల్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనిల్‌ తల్లి, సోదరితోపాటు ఆ వీధిలో ఉంటున్న వారిని పద్నాలుగు రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. ఆ వీధికి బారికేడ్లు ఏర్పాటు చేశారు. బోర్డు శానిటరీ విభాగం అధికారులు శానిటైజేషన్‌ చేయించారు. బ్లీచింగ్‌ జల్లారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తు వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement