అద్దెలొద్దంట! | Sakshi
Sakshi News home page

అద్దెలొద్దంట!

Published Thu, Oct 10 2019 8:26 AM

GHMC Negligence on Rent Collection - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఖర్చులకుఅనుగుణంగా ఆదాయం పెంచుకునేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తోన్న జీహెచ్‌ఎంసీ... సొంత వనరులపై మాత్రం దృష్టిసారించడం లేదు. ప్రజల నుంచి రావాల్సిన ఆస్తి పన్ను వసూళ్లపై శ్రద్ధ చూపుతుందే గానీ... తన సొంత ఆస్తుల లీజు ద్వారా రావాల్సినఆదాయాన్ని మాత్రం అడగడం లేదు. జీహెచ్‌ఎంసీ ఎస్టేట్స్‌ విభాగానికిపలు ప్రాంతాల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు తదితర ఆస్తులు ఉన్నాయి. వాటిని లీజుకిచ్చిన విభాగం అద్దె వసూళ్లపై అశ్రద్ధ చూపుతోంది. ఏళ్లతరబడి వాటిని పట్టించుకోకపోవడంతో లీజు పొందినవారు కాకుండా థర్డ్‌పార్టీల చేతుల్లో చాలా వరకు ఆస్తులు ఉన్నాయి. మరికొన్ని ఆస్తుల వివరాలే లేకుండా పోయాయి. దీనిపై ‘సాక్షి’ గతంలో కథనం వెలువరించగా ఎస్టేట్‌ ఆస్తులను క్షేత్రస్థాయిలో సర్వే చేయడంతో పాటు జియో ట్యాగింగ్‌ చేశారు. అసలైనలీజుదారులనే కొనసాగించాలని,థర్డ్‌ పార్టీలను ఖాళీ చేయించాలని భావించారు. కానీ ఆ పని జరగనే లేదు. అదే విధంగా ప్రతినెలా అద్దె చెల్లించేందుకు వీలుగా యాప్‌ రూపొందిస్తామని పేర్కొన్నారు. దాని ద్వారా ఏ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో? ఏ మార్కెట్‌లో? ఏ మడిగలో? ఎవరుంటున్నారో?  ఏ నెల ఎంత అద్దె చెల్లించారో? తెలుసుకోవడం సులభమవుతుందని భావించారు. ప్రతినెలా గడువులోగా చెల్లించేలా అలర్ట్‌ మెసేజ్‌ కూడా పంపించాలని నిర్ణయించారు. తద్వారా జీహెచ్‌ఎంసీ ఖజానాకు నెలనెలా నిధులు చేరడంతో పాటు ఇప్పటి వరకు జరిగిన అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావించారు. 

అడ్డుకుంటున్నారా?  
ఎస్టేట్‌ ఆస్తులకు సంబంధించిన అద్దెలను సర్కిళ్లలో వసూలు చేస్తున్నారు. వసూలు చేసిన వాటికి సరైన రసీదులు ఇవ్వడం లేదు. కొందరు అధికారులు అద్దె సొమ్ములను తమ జేబుల్లో వేసుకుంటున్నారు. సర్కిల్‌ స్థాయికి అధికారాలను వికేంద్రీకరించడంతో ప్రధాన కార్యాలయం అజమాయిషీ లేకుండా పోయింది. ఎన్నింటికి అద్దె వసూలవుతోందో? ఎన్ని బకాయిలున్నాయో? ఇతరత్రా వివరాలేమీ తెలియడం లేదు. ఈ పరిస్థితిని నివారించేందుకు, ఇంటిదొంగల ఆటకట్టించేందుకు యాప్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇందుకుగాను  జియోట్యాగింగ్‌ చేసిన వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో ఉంచారు. యాప్‌ అందుబాటులోకి వస్తే అద్దెదారులు కార్యాలయాల దాకా రాకుండా.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది దుకాణాల వద్దకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌ ద్వారా లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా అద్దెలు చెల్లించవచ్చు. సదరు సమాచారం స్థానిక సర్కిళ్లతో పాటు ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులకు సైతం ఎప్పటికప్పుడు తెలుస్తుంది. అయినప్పటికీ యాప్‌ను అందుబాటులోకి తేకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యాప్‌ వినియోగం జరిగితే ఇంటిదొంగల జేబులు నిండే కార్యక్రమం ఆగిపోతుందనే యాప్‌ను రానీయకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్వేషణ చేస్తోన్న జీహెచ్‌ఎంసీ సొంత ఆస్తుల ద్వారా రావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు యాప్‌ను అందుబాటులోకి తెస్తే ప్రయోజనం ఉంటుంది.

సిబ్బంది లేమి..
సిబ్బంది లేమితో కూడా ఎస్టేట్స్‌ విభాగానికి రావాల్సినంత ఆదాయం రావడం లేదు. 30 మంది అసిస్టెంట్‌ ఎస్టేట్‌ ఆఫీసర్స్, 30 మంది రెంట్‌ కలెక్టర్లు అవసరం కాగా ఆ మేరకు లేరు. దీంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. గతేడాది వరకు దాదాపు రూ.40 కోట్ల బకాయిలున్నాయి. వీటిల్లో ఎన్ని వసూలయ్యాయో? ఎన్ని కాలేదో? ప్రధాన కార్యాలయంలో వివరాలు లేవు.   

త్వరలో ఖాళీ..
జీహెచ్‌ఎంసీ నిబంధనలు, మున్సిపల్‌ చట్టాల మేరకు ఒక దుకాణంలో 25 ఏళ్లకు మించి లీజుకు ఉండటానికి వీల్లేదు. వారిని ఖాళీ చేయించి, తిరిగి వేలం వేయాలి. కానీ జీహెచ్‌ఎంసీలో గడువు ముగిసిన వారు వందలాది మంది ఉన్నారు. వీరిని ఖాళీ చేయించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేసినా అదనపు ఆదాయం వచ్చే వీలుంది. ఖాళీ చేయించనున్న వాటిలో పుత్లిబౌలి, సుల్తాన్‌బజార్, అమీర్‌పేట, మోండా, ఖైరతాబాద్, నాచారం, పంజగుట్ట, అబిడ్స్, బేగంబజార్, చిక్కడపల్లి, కోఠి, కుషాయిగూడ, నాంపల్లి, నల్లగండ్ల, రామ్‌గోపాల్‌పేట, న్యూబోయిగూడ, లింగంపల్లి, రాణిగంజ్‌ తదితర ప్రాంతాల్లోని కాంప్లెక్స్‌లు, మార్కెట్లు ఉన్నాయి.  

Advertisement
Advertisement